‘ఈ ప్రభుత్వంలో ప్రాణాలకే భరోసా లేదే’.. కాంగ్రెస్‌పై జీవన్ రెడ్డి వ్యాఖ్యలు

తన ప్రధాన అనుచరుడు గంగారెడ్డి హత్యను నిరసిస్తూ చేపట్టిన నిరసనను కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి విరమించుకున్నారు. కాంగ్రెస్‌పై మండిపడ్డారు. రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు.

Update: 2024-10-22 08:27 GMT

తన ప్రధాన అనుచరుడు గంగారెడ్డి హత్యను నిరసిస్తూ చేపట్టిన నిరసనను కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి విరమించుకున్నారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని ఎస్పీ హామీ ఇవ్వడంతో జీవన్ రెడ్డి తన నిరసన విరమించారు. దాదాపు మూడు గంటల పాటు ఈ నిరసన జరిగింది. అధికారంలో ఉన్న పార్టీ నేతకే భద్రత లేదంటే రాష్ట్రంలో శాంతిభద్రతల దుస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చంటూ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి పాలనను, కాంగ్రెస్ పెద్దలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ నుంచి తప్పుకునే అవకాశాలు కూడా ఉన్నాయని, ప్రజా సేవ చేయాలన్న తన కలను నెరవేర్చుకోవడానికి తనకు పార్టీతో పని లేదని వ్యాఖ్యానించారు. ‘నీకో దండం.. నీ పార్టీకో’ దండం అంటూ ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం నేనెందుకు బతకడం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పార్టీతో పనిలేదని, ఏదైనా స్వచ్ఛంద సంస్థ పెట్టుకుని అయినా దాని ద్వారా ప్రజాసేవను కొనసాగిస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని చెప్పారు. జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి.

నేను భరోసా ఇవ్వలేను..

‘‘నేను పార్టీలో ఇక ఉండలేదు. నాలుగు దశాబ్దాల కష్టానికి మంచి బహుమతి ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలకే భరోసా లేదు. ఫిరాయింపులను ప్రోత్సహించొద్దని నాటి రాజీవ్ గాంధీ నుంచి నేటి రాహుల్ గాంధీ వరకు కోరుకున్నారు. కానీ నేడు కాంగ్రెస్ పార్టీ.. వాళ్లు చెప్పిన దాన్నే మరిచింది. మన మహానీయుల విగ్రహాలను ఎందుకు పెడతాం. వారి ఆలోచనా విధాన్ని అలవర్చుకోవాలన్న ఉద్దేశంతో.. కానీ ఇప్పుడు కాంగ్రెస్ రాజీవ్ గాంధీ అంటోందే తప్ప వారి విధి విధానాలు ఏమాత్రం ఆచరించడం లేదు. గతంలో కేసీఆర్ ఎలా నడుచుకున్నారో.. ప్రస్తుతం కాంగ్రెస్ కూడా అదే మార్గంలో వెళ్తోంది. మన నాయకుడు రాహుల్ గాంధీ అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో ఉన్నాయి. ఎవరికీ భరోసా ఇచ్చే స్థితిలో నేను లేను. నా ఆవేదనను మాత్రమే వ్యక్తం చేస్తున్నా’’ అని జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

శాంతి భద్రతలేమయ్యాయి..

‘‘కేసీఆర్ తప్పు చేశాడు కాబట్టి నేను చేస్తా.. కేటీఆర్ అక్రమాలు చేస్తే కాని తప్పు నేను చేస్తే అక్రమం అవుతుందా అనడం సరైన పద్దతి కాదు. కేసీఆర్ తప్పు చేశారు కాబట్టే ప్రజలు మనకు అధికారం ఇచ్చారు. అయితే మన నాయకుడు కేసీఆరా? రాహుల్ గాంధీనా? మన నాయకుడు రాహుల్ గాంధీ ఏం చెప్పారు. మీరు ఏం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని సంతోషపడాలా? లేక నా మనుషులను చంపేస్తున్నారని బాధపడాలో అర్థం కావట్లేదు. నా అనుచరుడిని చంపిన నిందితుడు ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున డబ్బులు పంచాడు. బీఆర్ఎస్ నేతలకు అడ్డొస్తే భౌతికంగా దాడులు చేస్తున్నారు. నిందితుడు నా అనుచరుడిని చంపేస్తానని ముందే హెచ్చరించాడు. అంత హెచ్చరించినా పోలీసులు కనీసం పట్టించుకోలేదు. జరుగుతున్న పరిణామాలను తలుచుకుంటే గుండె తరుక్కుపోతుంది. ప్రభుత్వానికి పుల్ మెజారిటీ ఉన్నా ఫిరాయింపులను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు. ఫిరాయింపు రాజకీయం‌ కారణంగానే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా ఫిరాయింపుల విషయంలో ప్రభుత్వం పునారాలోచించాలి’’ అని వేడుకున్నారు.

నాకీ రాజకీయాలొద్దు..

‘‘నేను రాజకీయల నుండి తప్పుకుంటా. దయచేసి మమ్మల్ని బతకనివ్వండి. నిన్నటి దాకా వాళ్లే రాజ్యం ఎలిండ్రు. ఇవ్వాళా వాళ్ళే రాజ్యం చేస్తుండ్రు. నేనే రాజకీయాల నుండి తప్పుకుంటా. నాకు ఏ పదవి అక్కర్లేదు. వాళ్లనే రాజ్యం చేసుకొమ్మనండి. కాంగ్రెస్ పార్టీ ముసుగులో మా ప్రాణాలు తీస్తుంటే రక్షించాల్సిన పోలీసులు మీరు వాళ్ళకే వత్తాసు పలుకుతున్నారు. పార్టీ కూడా అలాంటి వారికే వత్తాసు పలుకుతుంది. నీకూ, నీ పార్టీకో దండం లక్ష్మణ్..ఇకనైనా మమ్మల్ని బ్రతకనివ్వండి. ఇంతకాలం మానసికంగా అవమానలకు గురైనా తట్టుకున్నాం. ఇవ్వాళా ప్రాణాలకే రక్షణ లేకపోతే మాకేందుకు పార్టీ, ప్రభుత్వం’’ అని ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, జిల్లా ఎస్పీ అశోక్ ఎదుట ఆవేదన వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి.

Tags:    

Similar News