మేమే నిర్మాణాన్ని కూల్చివేస్తాం -మురళీ మోహన్
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) నోటీసులపై నటుడు, రియల్ ఎస్టేట్ డెవలపర్ మురళీ మోహన్ స్పందించారు.
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) నోటీసులపై నటుడు, రియల్ ఎస్టేట్ డెవలపర్ మురళీ మోహన్ స్పందించారు. ఆయనకి చెందిన జయభేరి కన్‌స్ట్రక్షన్స్ ఆక్రమణలకు సంబంధించి శనివారం హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆక్రమణలను 15 రోజుల్లో తొలగించాలని లేదంటే మేమే కూల్చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై స్పందించిన మురళీమోహన్... హైడ్రా అధికారులు జోక్యం చేసుకోవలసిన అవసరం లేదని, తన బృందం కూల్చివేతలను స్వయంగా నిర్వహిస్తుందని స్పష్టం చేశారు.
33 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న మురళీ మోహన్.. తమ కంపెనీ ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని చెప్పారు. “బఫర్ జోన్‌లోకి మూడు అడుగుల పొడవున్న షెడ్డు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇది చాలా చిన్నది. హైడ్రా చాలా చిన్న విషయం కోసం జోక్యం చేసుకోవలసిన అవసరం లేదు. మేమే దాన్ని తొలగిస్తాము” అని ఆయన తెలిపారు.
కాగా, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని రంగలాల్ కుంట చెరువులో ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టిఎల్) మరియు బఫర్ జోన్‌లో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని హైడ్రా జయభేరి కన్‌స్ట్రక్షన్స్‌ను ఆదేశించింది. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న బ్లూ షీట్ గోడలను కూల్చివేయాలని ఆదేశించింది. కూల్చివేయడానికి కంపెనీకి 15 రోజుల గడువు ఇచ్చింది. లేని పక్షంలో తామే కూల్చివేస్తామని హైడ్రా అధికారులు హెచ్చరించారు.
అంతేకాదు, బ్లూ షీట్ గోడలతో సహా కొన్ని నిర్మాణాలు ఎఫ్టీఎల్లోకి రెండు మీటర్లు విస్తరించి ఉన్నాయని హైడ్రా కమిషనర్ ఎవి రంగనాథ్ వివరించారు. ఈ గోడలను తొలగించి బఫర్ జోన్‌ను ఖాళీ చేయమని జయభేరి కన్‌స్ట్రక్షన్స్‌ను ఆదేశించినట్లు ఆయన చెప్పారు. ఆక్రమణలపై స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.