నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ ఎలా జరిగిందంటే...
మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌పై ఎట్టకేలకు మావోయిస్టులు మొదటిసారి లేఖ విడుదల చేశారు.;
By : The Federal
Update: 2025-05-26 14:14 GMT
మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌పై ఎట్టకేలకు మావోయిస్టులు లేఖ విడుదల చేశారు.ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్ అడవుల్లో ఈ నెల 21న జరిగిన ఎన్‌కౌంటర్‌లో కేశవరావుతో పాటు మరో 26 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో లేఖ విడుదల చేశారు. నంబాల కేశవరావును సజీవంగా పట్టుకుని కాల్చి చంపారని స్పెషల్ జోనల్ కమిటీ ఆరోపించింది.
లొంగిపోయిన ద్రోహులు ఇచ్చిన సమాచారంతోనే...
‘‘మా నాయకుడు కేశవరావును కాపాడుకోవడంలో మేం విఫలమయ్యాం, లొంగిపోయిన ద్రోహులు ఇచ్చిన సమాచారంతోనే ఎన్‌కౌంటర్ జరిగింది’’అని మావోయిస్టులు పేర్కొన్నారు. ఆరు నెలలుగా మాడ్ ప్రాంతంలో కేశవరావు ఉన్నట్లు నిఘా వర్గాలకు తెలుసునని, కేశవరావు టీమ్‌లో ఉన్న ఆరుగురు ఇటీవల లొంగిపోయారని మావోయిస్టులు తెలిపారు. వాళ్లు ఇచ్చిన సమాచారంతోనే ఎన్‌కౌంటర్ చేశారని కమిటీ పేర్కొంది.
కేంద్ర బలగాలు చుట్టుముట్టాయి...
యూనిఫైడ్ కమాండో సభ్యుడు ద్రోహిగా మారాడని మావోయిస్టులు ఆరోపించారు.పలువురు ద్రోహం చేయడంతోనే ఎన్‌కౌంటర్ జరిగిందన్నారు. ఎన్‌కౌంటర్ ముందు రోజు నుంచి 20వేల మంది కేంద్ర బలగాలు మా ప్రాంతాన్ని చుట్టుముట్టాయని మావోయిస్టులు తెలిపారు.10 గంటల్లో ఐదు ఎన్‌కౌంటర్‌లు జరిగాయని, 60 గంటల పాటు బలగాలు తమను నిర్భంధించాయని మావోయిస్టులు చెప్పారు. కేశవరావుని కాపాడుకునేందుకు 35 మంది ప్రాణాలు అడ్డుపెట్టారని, ఈ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు సురక్షితంగా బయటపడ్డారని మావోయిస్టులు తెలిపారు.
కాల్పుల విరమణ ప్రకటించాక కాల్పులు జరపలేదు...
‘‘మేం ఇప్పటికే కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత ఎలాంటి కాల్పులు జరపలేదు’’అని మావోయిస్టులు చెప్పారు.‘‘మమ్మల్ని వదిలి సురక్షిత ప్రాంతానికి కేశవరావును తరలించేందుకు ప్రయత్నించామని, మమ్మల్ని వదిలి కేశవరావు బయటకు వెళ్లేందుకు ఇష్టపడలేదు,నాయకత్వాన్ని ముందుండి నడిపించాలని మాతోటే ఉన్నారు’’అని మావోయిస్టులు పేర్కొన్నారు. పాకిస్థాన్ తో కాల్పుల విరమణ జరిపిన కేంద్ర ప్రభుత్వం,తమతో శాంతి చర్చలు జరిపేందుకు సిద్ధంగా లేదని మావోయిస్టు స్పెషల్ కమిటీ ఆరోపించింది.