కమలంలో కొత్త కమిటీ కల్లోలం

టీపీసీసీని కాపీ కొట్టడంతోనే కొత్త రాష్ట్ర కమిటీ ఏర్పాటు తరువాత తెలంగాణ బీజేపీలో చిచ్చు రగిలిందా?;

Update: 2025-09-10 10:20 GMT

తెలంగాణ బీజేపీకి కొత్త సారధి వచ్చాక ఏర్పాటైన పార్టీ కొత్త రాష్ట్ర కమిటీ సీనియర్లలో అసంతృప్తి రాజేసింది. మళ్లీ కొత్త పాత తగాదా తెర ముందుకొచ్చింది.కమిటీలలో అసలు సమతుల్యమే లేదని కొందరు సీనియర్లు సైతం మండిపడుతున్నారు.పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్‌ బన్సల్‌ వైఖరి పట్ల ఎంపీలు, ఎమ్మెల్యేలు మండిపడుతుండటం పార్టీవర్గాల్లో చర్చనీయాంశమైంది.పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాత్ర కన్నా ,కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, సునీల్ బన్సల్ లే ఎంపిక చేశారన్న ప్రచారం జరుగుతోంది."ఇది కేవలం ఒకరిద్దరు ఎంపిక చేసిన కమిటీ మాత్రమే"అంటూ ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.కొత్త కమిటీపై తీవ్ర అసంతృప్తి వున్నా బాహాటంగా విమర్శించడానికి మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదు . తమది క్రమశిక్షణగల పార్టీ అంటూ అసంతృప్తిని లోలోనా దాచుకుంటున్నారు. పెద్దపల్లి నేత రామకృష్ణారెడ్డి మాత్రం బాహాటంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

22మందితో కొత్త కమిటీ
పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌ రావు కొత్త కార్యవర్గ సభ్యుల పేర్లను ప్రకటించారు. మొత్తం 22 మంది సభ్యులతో కూడిన కార్యవర్గంలో యువతకు, వివిధ సామాజిక వర్గాలకు పెద్దపీట వేశారు. కొత్త కార్యవర్గంలో ఎనిమిది మంది ఉపాధ్యక్షులు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు, ఎనిమిది మంది కార్యదర్శులు ఉన్నారు. వీటితో పాటు ఏడు మోర్చాలకు అధ్యక్షుల పేర్లను కూడా ప్రకటించారు.ఇందులో ఆరుగురు మహిళలకు స్థానం కల్పించారు.కమిటీలో 9మంది ఓసీలు,7గురు బీసీలకు చోటుదక్కింది.గతంలో జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన వారిలో ఇద్దరికి మాత్రమే కొత్త కమిటీలో చోటుదక్కింది.ఉపాధ్యక్షులుగా డా.బూర నర్సయ్యగౌడ్, కాసం వెంకటేశ్వర్లు, జరుప్లావత్‌ గోపి(కల్యాణ్‌ నాయక్‌), రఘునాథ్‌రావు, బండా కార్తీకరెడ్డి, బండారి శాంతికుమార్, ఎం.జయశ్రీ, కొల్లి మాధవిలకు చోటు దక్కగా,ప్రధాన కార్యదర్శులుగా టి.వీరేందర్‌గౌడ్, వేముల అశోక్‌, ఎన్‌.గౌతంరావు ..కార్యదర్శులుగా ఓ.శ్రీనివాస్‌రెడ్డి, కొప్పు బాషా, బండారు విజయలక్ష్మి, స్రవంతిరెడ్డి, కరణం పర్ణీత, భరత్‌ ప్రసాద్, తూట్లపల్లి రవికుమార్‌, బద్దం మహిపాల్‌రెడ్డి లకు స్థానం దక్కింది.కోశాధికారిగా దేవ్‌కీ వసుదేవ్, సంయుక్త కోశాధికారిగా విజయ్‌ సురన జైన్, ముఖ్య అధికార ప్రతినిధిగా ఎన్‌.వి.సుభాష్‌లు ఎంపికయ్యారు.
కమిటీపై ఎంపీల అసంతృప్తి!
కొత్త కమిటీలో తాము సిఫార్సు చేసిన వారి పేర్లు లేకపోవడం పట్ల కేంద్రమంత్రి బండి సంజయ్,ఎంపీలు డీకే అరుణ,రఘునందన్ రావు, ఈటెల,గుడెం నగేష్ సైతం తమ అనుచరుల దగ్గర కమిటీపై తమ అఇష్టాన్ని వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.బండి అనుచర వర్గంలో గీతామూర్తి,గంగిడి మనోహర్ రెడ్డి, రాణీరుద్రమ లాంటి వారు తమకు స్థానం దక్కక పోవడం పైన అసంతృప్తితో వున్నట్లు చెబుతున్నారు.ఈటల వర్గం నేత బోడిగ శోభ ఈకోవలోనే వున్నారు. ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు సైతం కమిటీ ఎంపికపై ఆగ్రహంతో వున్నారు. తాము సిఫార్సు చేసిన పేర్లు ఏవీ జాబితాలో లేకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.కిషన్ రెడ్డి వర్గానికే అధిక ప్రాధాన్యం తక్కిందన్న వాదన వినిపిస్తోంది.
ఉత్తర తెలంగాణ ప్రాంతానికి కమిటీలో తగిన ప్రాతినిధ్యం దక్కలేదు.వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ పార్లమెంటరీ పరిధిలో నేతలకు తీవ్ర అన్యాయం జరిగింది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు."పార్టీ పటిష్టంగా వున్న ఉత్తర తెలంగాణను పట్టించు కోకుండా , హైదరాబాద్ ,రంగారెడ్డి జిల్లాల వారితో కమిటీని నింపేశారు.ఎప్పుడూ ఆఫీసులో కూర్చునే వారికే పదవులా, ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడిన మాలాంటి వారు కనబడరా" ఇది మరో సీనియర్ నేత ఆవేదన . బీజేపీ అంటే నగరాలకు మాత్రమే పరిమితమైన పార్టీ అనే పేరు ఇప్పటికే ఉంది.ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు పార్టీ చేరువవుతున్న తరుణంలో పార్టీ కమిటీలో 70శాతం పదవులు నగరవాసులకు, అదీ హైదరాబాద్‌లో స్థిరపడ్డవారికే ఇవ్వడం ఎలాంటి సంకేతాలు ఇస్తుందన్న చర్చ సాగుతోంది.పదేళ్లుగా కమిటీలో వున్న వారిని కొందరిని కంటిన్యూ చేయడం కూడా విమర్శలకు తావిస్తోంది.
మాది మంచి టీం
అన్ని జాగ్రత్తలు తీసుకొని మంచి డైనమిక్ కమిటీని ఏర్పాటు చేశామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాత్రం కొత్త కమిటీని సమర్థించుకున్నారు.యువతు ప్రాధాన్యం ఇచ్చి , పారీకి కొత్త రక్తం ఎక్కించే ప్రయత్నం జరిగిందన్నారు. రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాలకు దాదాపుగా ప్రాతినిధ్యం కల్పించినట్లు ఆయన చెప్పుకొచ్చారు.సామాజిక సమతుల్యత కోసం ప్రయత్నించామని, అందుకే కొందరు సీనియర్లకు అవకాశం కల్పించలేక పోయామని , కమిటీలో లేనంత మాత్రాన ఎవరినీ దూరం పెట్టినట్లు కాదని ,మరో బాధ్యత ఇచ్చి వారి సేవలను పార్టీకి వినియోగించుకుంటామని రామచంద్రరావు వెల్లడించారు.హైదరాబాద్ చుట్టుపక్కలే 35 అసెంబ్లీ సెగ్మెంట్లు వున్నాయని అందుకే కమిటీలో ఆ ప్రాంతానికి కొద్దిగా ప్రాధాన్యం దక్కిందన్నారు.
టీపీసీసీ కమిటీని కాపీ కొట్టారా?
రాష్ట్ర బీజేపీ కొత్త కమిటీ పక్కాగా టీకాంగ్రెస్ కమిటీని కాపీ కొట్టినట్లు వుందని బీజేపీకే చెందిన ఓ సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారు.రెడ్డి సామాజిక వర్గాన్ని తగ్గించి బీసీలకు అందులో గౌడలకు కమిటీలో ప్రాధాన్యం ఇచ్చారన్నారు. ఇదంతా పీసీసీని కాపీ కొట్టటమే నన్నారు.ఉపాధ్యక్షులుగా బూర నర్సయ్యగౌడ్,ప్రధాన కార్యదర్శిగా వీరేందర్ గౌడ్ ల నిమాయకం అందులో భాగమన్నారు.ఉత్తర తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వలేదన్న విమర్శలను ప్రస్తావిస్తూ ,ఆ ప్రాంతంలో తమ పార్టీకి ఎంపీలు ,ఎమ్మెల్యేలు వున్నారు కాబట్టే , మిగిలిన ప్రాంతంలో వున్న నేతలకు కమిటీలో చోటు కల్పించారని , ఆయా జిల్లాలలోనూ పార్టీ ఎదుగుదలను దృష్టిలో వుంచుకొని ఇలా చేసుండవచ్చని అభిప్రాయపడ్డారు.
బీజేపీ కొత్త కమిటీ ఏర్పాటు ఎంపీల అసంతృప్తిపై రాజకీయ విళ్లేషకులు ప్రొఫెసర్ వినాయక రెడ్డి ఫెడరల్ తెలంగాణ తో మాట్లాడుతూ ఏ పార్టీ అయినా సామాజిక సమీకరణలకు పార్టీలోనూ ప్రాధాన్యం ఇవ్వక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు."బీజేపీ రాష్ట్ర కమిటీలో కేవలం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధి నుంచే 11 మంది ఆఫీస్ బేరర్లు వున్నారు. దీనిలో కిషన్ రెడ్డి మార్కు కనిపిస్తోంది.అందుకే మిగతా ఎంపీల అసంతృప్తి. అదీకాక కమిటీపై ఆర్ఎస్ఎస్ ప్రభావం కూడా వుంది" అన్నారు.
Tags:    

Similar News