కవితకు పార్టీల ‘నో ఎంట్రీ’ బోర్డు

కవితను పార్టీలో చేర్చుకోవటానికి కాంగ్రెస్, బీజేపీలు సిద్ధంగా లేవు;

Update: 2025-09-05 07:59 GMT
Kavitha

ఇళ్ళకు టులెట్ బోర్డులు కనబడినట్లే కల్వకుంట్ల కవితకు నో ఎంట్రీబోర్డులు ఎదురువుతున్నాయి. విషయం ఏమిటంటే కవితను పార్టీలో చేర్చుకోవటానికి కాంగ్రెస్, బీజేపీలు సిద్ధంగా లేవు. అందుకనే కవిత(Kavitha)ను తమ పార్టీల్లోకి చేర్చుకునే ముచ్చటే లేదని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్(TPCC President Bomma Mahesh) కుమార్ గౌడ్, బీజేపీ అధ్యక్షుడు నారపరాజు(BJP President Ramachandra Rao) రామచంద్రరావు బహిరంగంగా ప్రకటించారు. పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్న కారణంతో మూడురోజుల క్రితం కవితను బీఆర్ఎస్(BRS) నుండి అధినేత కేసీఆర్(KCR) సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. పార్టీలో నుండి సస్పెండ్ అయిన మరుసటిరోజే కవిత ఎంఎల్సీ పదవితో పాటు పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

బీఆర్ఎస్ లో నుండి బయటకు వచ్చేసిన కవిత భవిష్యత్ కార్యాచరణపై అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే కాంగ్రెస్ లో చేరుతారని కాదుకాదు బీజేపీలోకి వెళతారనే ప్రచారం హోరెత్తిపోతోంది. ఈ నేపధ్యంలోనే బొమ్మ, రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతు కవితను తమ పార్టీలో చేర్చుకునేది లేదని వేర్వేరుగా ప్రకటించారు. కవిత లాంటి అవినీతి నేతను తమపార్టీలో చేర్చుకోవటం జరిగేపనికాదని బీజేపీ అధ్యక్షుడు స్పష్టంగా ప్రకటించారు. కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం అవినీతిఫ్యామిలీగా రావు అభివర్ణించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ఇరుక్కుని ఆరుమాసాలు తీహార్ జైలులో ఉండి బెయిల్ పై బయటున్న విషయాన్ని నారపరాజు గుర్తుచేశారు. లిక్కర్ స్కామ్ లో ఇరుక్కోవటమే కవితకు అతిపెద్ద మైనస్ అయిపోయింది. అందుకనే ప్రత్యర్ధులు ఆమెను ‘లిక్కర్ క్వీన్’ అని ఎద్దేవా చేస్తున్న విషయం తెలిసిందే.

ఇదే విషయన్ని బొమ్మ మాట్లాడుతు అధికారంలో ఉన్నపుడు సంపాదించిన అవినీతి ఆస్తుల కోసమే ఇఫుడు కల్వకుంట్ల ఫ్యామిలీలో గొడవలు జరగుతున్నాయన్నారు. భారీ ఎత్తున అవినీతికి పాల్పడిన కవితను కాంగ్రెస్ లో చేర్చుకునేది లేదని అధ్యక్షుడు స్పష్టంచేశారు. ఇప్పటి పరిస్ధితి ప్రకారమైతే పై రెండు పార్టీల్లోకి కవిత ఎంట్రీ లేదని అర్ధమవుతోంది. తెలంగాణలో ఉన్నవే మూడు పెద్ద పార్టీలు. వీటిల్లో కాంగ్రెస్, బీజేపీ జాతీయపార్టీలు కాగా బీఆర్ఎస్ ప్రాంతీయపార్టీ. సీపీఐ, సీపీఎం వల్ల పెద్దగా లాభంలేదు. ఏఐఎంఐఎంలోకి కవిత వెళతారని ఎవరూ అనుకోవటంలేదు.

రాజకీయంగా పెద్ద పార్టీల్లో చేరే అవకాశాలు లేవన్న విషయం కవితకు బాగా తెలుసు. అందుకనే బీఆర్ఎస్ కాదన్నా తనకు జాగృతి సంస్ధ ఉందని పదేపదే చెబుతున్నారు. జాగృతి కేంద్రంగా తొందరలోనే కొత్త ప్రాంతీయపార్టీ పెట్టే ఆలోచన చేస్తున్నట్లు ఆమె సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. అయితే కొత్తపార్టీ పెట్టి బీఆర్ఎస్ కు ధీటుగా నడపటం అంత వీజీకాదు. దిగితే కాని లోతు తెలీదన్నట్లుగా పార్టీ పెడితే కాని కష్టాలేంటో అనుభవంలోకి రావు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నమ్ముకున్న జాగృతి కూడా కవితను ఆదుకుంటుందన్న నమ్మకాలు తగ్గిపోతున్నాయి. ఎందుకంటే కవితకు మద్దతుగా, వ్యతిరేకంగా నేతల్లో చీలికలు వచ్చేస్తున్నాయి. కాబట్టి జాగృతి తొందరలోనే చీలిపోతుందనే ప్రచారం పెరిగిపోతోంది. అదే జరిగితే జాగృతి అన్నది స్కెలిటన్ సంస్ధలాగ మిగిలిపోతుంది. కాబట్టి నామమాత్రంగా మిగిలిన జాగృతిని పట్టుకుని కవిత గోదావరిని ఈదటానికి ప్రయత్నిస్తున్నట్లుగానే ఉంటుంది. భవిష్యత్ కార్యాచరణ ఏమిటో కవిత తొందరలోనే ప్రకటిస్తారని అంటున్నారు అదేమిటో చూడాల్సిందే.

Tags:    

Similar News