పట్టు నిలుపుకున్న రేవంత్..
బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు రద్దు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పట్టు నిలుపుకున్నారు.
బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు రద్దు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పట్టు నిలుపుకున్నారు. ఈరోజు సినీ పరిశ్రమ ప్రముఖులతో జరిగిన భేటీలో కూడా ఆయన తన వైఖరిని చాలా స్పష్టంగా తేల్చి చెప్పారు. బెన్‌ఫిట్ షోలు, టికెట్ ధరల పెంపుకు అనుమతించేది లేదని తేల్చి చెప్పేశారు. దీంతో ఈ విషయంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక విధంగా సెట్‌బ్యాక్ అయిందనే చెప్పాలి. సంక్రాంతి దగ్గర పడుతున్న క్రమంలో బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు లేకపోవడం ఇండస్ట్రీకి, రానున్న బడా హీరోల సినిమాలకు భారీ ఎదురుదెబ్బ కానుంది. కాగా ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పెడుతూ వ్యాపారం చేయాల్సిన అవసరం లేదన్న కోణంలో సీఎం రేవంత్ రెడ్డి తన ఆలోచనను ఇండస్ట్రీ ప్రముఖుల ముందుంచారు.
‘‘ఇకపై బెనిఫిట్ షోలు ఉండవు. అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామన్నాం’’ అని రేవంత్ వెల్లడించారు. అంతేకాకుండా ‘‘శాంతిభద్రతల విషయంలో రాజీ లేదు. ఇకపై బౌన్సర్లపై సీరియస్‌గా ఉంటాం. అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే. ప్రభుత్వం ఇండస్ట్రీతో ఉంటుంది. తెలంగాణ అభివృద్ధిలో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్స్‌బిలిటీతో ఉండాలి. డ్రగ్స్ క్యాంపెయిన్, మహిళా భద్రత క్యాంపెయిన్‌లో చొరవ చూపాలి. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలి. పెట్టుబడుల్లోనూ ఇండస్ట్రీ సహకరించాలి’’ అని రేవంత్ సూచించారు. ఈ క్రమంలోనే సినీ పెద్దలకు పోలీసులు కూడా పలు కీలక సూచనలు చేశారు.
అన్నీ ఆలోచించుకునే నిర్ణయం: పోలీసులు
‘‘సినిమా ప్రమోషన్స్ సమయంలో పోలీసులు అనుమతి నిరాకరిస్తే దానిని పాటించాలి. అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాతనే అనుమతి ఇవ్వాలా? వద్దా? అన్న అంశాలపై పోలీసులు ఒక నిర్ణయానికి వస్తారు. అనుమతుల విషయంలో పోలీసులు తీసుకునే నిర్ణయాన్ని సినిమా వారు గౌరవించాలి. బౌన్సర్లను నియమించుకున్నప్పుడు న్యాయ సమ్మతం ఉండాలి. ఇటీవల బౌన్సర్ల తీరు, ప్రవర్తన బాగాలేదు. అలాగే సినిమా రిలీజ్, ఈవెంట్స్ నిర్వహించే సమయంలో అభిమానుల్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా సెలబ్రిటీలదే’’ అని డీజీపీ స్పష్టం చేశారు.