ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశ ప్రకటన వెలువడింది ఈ రోజే...
మార్చి 21, అదివారం, 1982 . సాయంకాలం 7గంట. ఎన్టీఆర్ స్టూడియో, ముషీరాబాద్, హైదరాబాద్ తొలి విలేకరుల సమావేశం;
సరిగ్గా 43 ఏళ్లక్రితం ఇదే రోజున (ఆదివారం 21 మార్చి 1982)
తెలుగు ప్రజల ఆరాధ్య దైవం విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారు రాజకీయరంగ ప్రవేశం చేయనున్నట్లు ప్రకటించారు.
తెలుగు ప్రజల ఆరాధ్య దైవం విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారు రాజకీయరంగ ప్రవేశం చేయనున్నట్లు ప్రకటించారు.
శ్రీ ఎన్.టి. రామారావు గారి రాజకీయ రంగప్రవేశం ప్రకటన కోసం ఉత్కంఠగా ఇటు అభిమానులు, అటు తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్న సమయంలో 1982 మార్చి 21వ తేదీ మధ్యాహ్నం పత్రికా విలేఖరుల కార్యాలయాలకు అందిన ఆహ్వానం వారిని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఆరోజు ఆదివారం శెలవు దినం కావటంతో పత్రికావిలేఖరులు, పత్రికల బ్యూరోలు, పత్రికాధిపతులు తీరుబడిగా తమ స్వవిషయాలు చూసుకుంటూ విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఈ రోజు సాయంకాలం 5 గంటలకు ముషీరాబాద్ లోని రామకృష్ణా సినీ స్టూడియో లో ఎన్.టి. రామారావు గారు నిర్వహించే పత్రికా గోష్టికి రావలసిందిగా రాష్ట్రంలోని అన్ని పత్రికా కార్యాలయాలకు
ఆహ్వానం అందింది.
ఈ ఆహ్వానం అందిన వెంటనే ఇదేదో రామారావు గారి రాజకీయ ప్రవేశానికి సంబంధించిన ప్రకటనే అయి ఉంటుందనుకొని పత్రికా విలేఖరులు హుటాహుటిగా రామకృష్ణా స్టూడియోకు వెళ్ళారు. వారందరిని
స్టూడియోలోని మిని ప్రివ్యూ థియేటర్లో కూర్చుండబెట్టి, రామారావు గారి కుమారుడు జయకృష్ణ ఫలహారం,టీ,కాఫీ ఏర్పాట్లు పర్యవేక్షించారు. సరిగ్గా 5 గంటలకు తెల్లని లాల్చీ పంచె కట్టు పైన ఉత్తరీయం ధరించిన నందమూరి తారక రామారావు గారు పైఅంతస్థులోని తన గది నుంచి క్రిందకు దిగివచ్చి అందరికీ చేతులు జోడించి అభివాదం చేశారు.
అక్కడున్న జర్నలిస్టులందరూ చాలాసార్లు రామారావు గారిని తెరమీద చూసిన వారే కానీ చాలామందికి ఆయన్ని ప్రత్యక్షంగా చూడటం అదే మొదటిసారి పైనుంచి కింద వరకూ ధగధగలాడుతూ ధవళ వస్త్రాలతో ఉన్న ఆ రూపాన్ని చూసి వారు మంత్రముగ్ధులై కళ్ళప్పగించి అలా చూస్తూ ఉండిపోయారు.
టీ ఫలహారాలు ముగిశాక తమ మూడున్నర దశాబ్దాల సినీ జీవితం గురించి, తన పట్ల ప్రజలు చూపిన ఆదరాభిమానాల గురించి రామారావు వివరిస్తూ ప్రజల రుణం తీర్చుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు.
తాను రాజకీయాలలోకి ప్రవేశించే విషయాన్ని సూటిగా చెప్పలేదు. అయితే, కోట్ల ఆర్జనను కాదనుకుని ప్రజాజీవితానికే పూర్తికాలం వెచ్చించాలన్న తన నిర్ణయం గురించి తెలిపారు. తనకెలాంటి కుటుంబ బాధ్యతలు లేవని చెప్పారు. మే 28కి తాను 59 దాటి అరవై సంవత్సరంలో పడతానని, అప్పటి నుంచి ఇంక పూర్తి సమయం ప్రజల సేవకు అంకితం చేస్తానని చెప్పారు.
తాను అయిదు సినిమాల్లో నటిస్తున్నానని, మరొక ఆరింటికి అంగీకరించానని చెబుతూ అవసరమయితే ఆ ఆరింటిని రద్దు చేసుకుంటానని ఎన్టీర్ చెప్పారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి పాటు పడుతూ వర్గ, కుల రహిత సమాజ స్థాపనకోసం పాటుపడే ఒక సంస్థను స్థాపించాలనుకుంటున్నానని ఆయన వెల్లడించారు. తాను మరొక రాజకీయ పార్టీలో చేరే ప్రసక్తి లేనేలేదని కూడా ఆయన చెప్పారు.
గత ఏడాది ఊటీ లో ఉన్నపుడు విలేకరులతో మాట్లాడుతూ ఎంజిఆర్ లాగా మీరు రాజకీయాల్లోకి వస్తారా అని ఒక విలేకరి ప్రశ్నించాడని, అప్పటి నుంచి రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన తొలుస్తూ ఉందని ఆయన అంగీకరించారు. 900 పై చిలుకున్న తన అభిమాన సంఘాలన్నీ కూడా పార్టీ పెట్టాలని తనమీద వత్తిడి తెస్తున్నాయని ఆయన చెప్పారు. ఇంతవరకు సినిమాలకు అంకితమయిన తన జీవితం ఇక ముందు ప్రజల సేవకు అంకితమయివుతుందని ఆయన చెప్పారు. రాజకీయాల్లోకి వస్తే, ఎమ్జీ ఆర్ లాగా,మీ ఆస్తులన్నింటిని ప్రజలకోసం వెచ్చిస్తారా అని ఒక విలేకరి అడిగినపుడు,”డబ్బేమిటి? జీవితమే ప్రజలకు అంకితమిస్తున్నపుడు,” అని సమాధానమిచ్చారు.
మళ్లీ తొందర్లో కలుద్దామని చెప్పి రామారావు విలేకరుల సమావేశం ముగించారు. తర్వాతేమిజరిగిందో అందరికి తెలిసిందే. అలా ఒక ఆదివారం ఎవరూ ఊహించని రీతిలో తెలుగు రాజకీయాలను శాశ్వతంగా మార్చేసింది.
(Source: NTR: A Biography by K Chandrahas & K Lakshminarayana)