తెలంగాణ (Telangana)రాష్ట్రంలో అడవుల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణ కోసం తెలంగాణ అటవీశాఖ (Forest Department)కొత్త వినూత్న చర్యలు చేపట్టింది.అడవుల్లో టేకు కలప స్మగ్లింగ్, వన్యప్రాణుల వేటకు పుల్ స్టాప్ పెట్టేందుకు(protect forests)అటవీశాఖ పోలీసు శాఖలో లాగా ఫారెస్ట్ స్నిఫర్ డాగ్స్ వ్యవస్థను ప్రవేశపెట్టింది.కవ్వాల్ అభయారణ్యంలో (Kawal Tiger Reserve)పనిచేస్తున్న హంటర్ (Hunter)అనే బెల్జియన్ మాలినోయిస్ శిక్షణ పొందిన జాగిలం, అమ్రాబాద్ టైగర్ రిజర్వులో(Amarabad Tiger Reserve) బ్రూనో (Bruno)అనే జర్మన్ షెపర్డ్ స్నిఫర్ డాగ్ టేకు చెట్ల నరికివేత, కలప స్మగ్లింగ్, వన్యప్రాణుల వేట వంటి క్రిమినల్ వ్యవహారాలలో వాసన ద్వారా నిందితులను గుర్తించడంలో విజయవంతంగా పనిచేస్తున్నాయి.
(కవ్వాల్, అమ్రాబాద్ అడవుల నుంచి ‘ఫెడరల్ తెలంగాణ’ ప్రతినిధి సలీం షేక్)
అడవుల్లో అటవీశాఖ అధికారుల సర్వేలెన్స్ వ్యవస్థలు ఉన్నప్పటికీ, రహస్యంగా రాత్రివేళ టేకు చెట్ల నరికివేత, వేట, స్మగ్లింగ్, వన్యప్రాణుల వేట సాగుతున్న నేపథ్యంలో ప్రత్యేక శిక్షణ పొందిన జాగిలాలు నేరస్థుల వాసన, వినికిడి ఆధారంగా గుర్తిస్తున్నాయి. ఈ స్నిఫర్ డాగ్స్ అడవుల్లో వన్యప్రాణులను, అడవుల సంపదను భద్రపరచడంలో ఒక కొత్త ఆయుధంగా మారాయి.
అమ్రాబాద్ అడవిలో వేటగాడి కోసం బ్రూనో డాగ్ సెర్చ్ ఆపరేషన్
ప్రయోగాత్మకంగా అటవీశాఖలో స్నిఫర్ డాగ్స్ ప్రయోగం
పలు హత్యలు, దోపిడీల కేసుల్లో అసలు నిందితులను పట్టుకునేందుకు, పేలుడు పదార్థాలను గుర్తించేందుకు పోలీసులు శిక్షణ పొందిన జాగిలాలను రంగంలో దించుతుండటం సర్వసాధారణం, కానీ తెలంగాణ అటవీశాఖ కలప స్మగ్లర్లు, వన్యప్రాణుల వేటగాళ్ల ఆట కట్టించేందుకు ప్రయోగాత్మకంగా కవ్వాల్, అమ్రాబాద్ అభయారణ్యాల్లో రెండు స్నిఫర్ డాగ్స్ ను (Sniffer dogs curb smuggling)రంగంలోకి దించింది. కలపస్మగ్లర్లు, వేటగాళ్లను కేవలం వాసన ద్వారానే వారిని పట్టుకోవడంలో ఈ స్నిఫర్ డాగ్స్ విజయం సాధించాయి. ఫారెస్ట్ స్నిఫర్ డాగ్స్ పనితీరును పరిశీలించి వాటి హ్యాండ్లర్స్, అటవీశాఖ అధికారులతో ‘ఫెడరల్ తెలంగాణ’ ప్రతినిధి మాట్లాడగా పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.
తెలంగాణలో 9వేల టేకు కలప స్మగ్లింగ్ కేసులు
తెలంగాణ రాష్ట్రంలో అడవులు అధికంగా ఉండటంతో టేకు కలప స్మగ్లింగ్ జోరుగానే సాగుతోంది. ప్రతీ ఏటా కలప స్మగ్లింగ్ సాగుతూనే ఉంది. 2014-15 వ ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26 సంవత్సరం వరకు గడచిన పన్నెండేళ్లలో తెలంగాణలో మొత్తం 96,813 టేకు కలప స్మగ్లింగ్ కేసులు నమోదు చేసి,18,002 వాహనాలను సీజ్ చేశామని ఇటీవల తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. 2019-20 సంవత్సరంలో అత్యధికంగా తెలంగాణ అటవీశాఖ 9 వేల కలప స్మగ్లింగ్ కేసులను పట్టుకుంది. ఏడాది కాలంలో 6,721 కలప స్మగ్లింగ్ కేసులను నమోదు చేసిన అటవీశాఖ అధికారులు రూ.5.64 కోట్ల టేకు కలపను సీజ్ చేశారు. కలప స్మగ్లర్ల నుంచి రూ.10.61 కోట్ల జరిమానాను వసూలు చేశామని అటవీ శాఖ స్మగ్లింగ్ గణాంకాలే చెబుతున్నాయి. మరో 2,585 కలప స్మగ్లింగ్ కేసుల్లో స్మగ్లర్లు పారిపోగా, రూ.3.42 కోట్ల కలపను అటవీశాఖ స్వాధీనం చేసుకొని ప్రభుత్వ టింబర్ డిపోలకు తరలించిందంటే కలప స్మగ్లింగ్ జోరు విదితమవుతుంది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం గుండాల అడవుల్లో విలువైన టేకు చెట్లను స్మగ్లర్లు నరికివేయడంతో ఫారెస్ట్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఇటీవల కేసు నమోదు చేశారు.
తెలంగాణలో 135 వన్యప్రాణుల వేట కేసులు
తెలంగాణ రాష్ట్రంలోని అడవుల్లో వన్యప్రాణుల సంఖ్య ఎక్కువగానే ఉంది. దీంతో వేటగాళ్లు వన్యప్రాణులను వేటాడుతూనే ఉన్నారు. 2014 నుంచి 2024వ సంవత్సరం వరకు గడచిన 11 ఏళ్లలో 135 వన్యప్రాణులను వేటాడిన కేసులు నమోదయ్యాయని సమాచార హక్కు చట్టం ద్వారా అటవీశాఖ అందించిన అధికారిక డేటానే వెల్లడించింది. తెలంగాణలో 2023వ సంవత్సరంలోనే అత్యధికంగా 52 వన్యప్రాణులు వేటగాళ్ల దాడుల్లో నేలకొరిగాయని వైల్డ్ లైఫ్ క్రైం కంట్రోల్ బ్యూరో ()విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. తెలంగాణ అడవుల్లో వన్యప్రాణుల వేటను నిరోధించేందుకు హైదరాబాద్ నగరంలోని అరణ్య భవన్ కేంద్రంగా టైగర్ సెల్ ను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలంగాణ వైల్డ్ లైఫ్ చీఫ్ వార్డెన్ ఎలూసిన్ మేరు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.అడవుల్లో వేటగాళ్లను పట్టుకునేందుకు ఇంటెలిజెన్స్, సర్వెలెన్స్ సిస్టమ్, కెమెరా ట్రాప్ మానిటరింగ్ మూవ్ మెంట్ ను పెంచామని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్, అమ్రాబాద్, నిర్మల్ కేంద్రాలుగా వేటగాళ్లను పట్టుకునేందుకు ఆపరేషనల్ స్క్వాడ్ తో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించామని ఆయన వెల్లడించారు.
తెలంగాణలో అటవీశాఖ పైలెట్ ప్రాజెక్టు
తెలంగాణ రాష్ట్రంలో కలప స్మగ్లర్లు, వన్యప్రాణుల వేటగాళ్లు ఆట కట్టించేందుకు అటవీశాఖ స్నిఫర్ డాగ్స్‌ను పైలెట్ ప్రాజెక్టు కింద రంగంలోకి దించింది. కవ్వాల్, అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో డాగ్ స్క్వాడ్ సేవలను అటవీశాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. కవ్వాల్ అభయారణ్యంలో హంటర్ అనే స్నిఫర్ డాగ్ కలప స్మగ్లర్లు, వేటగాళ్ల భరతం పడుతుంది. మరో వైపు అమ్రాబాద్ లో బ్రూనీ అనే స్నిఫర్ డాగ్ కలప స్మగ్లర్లకు సింహస్వప్నంగా పనిచేసింది. అయితే కిడ్నీ ఫెయిలై బ్రూనో ఫారెస్ట్ జాగిలం మరణించడంతో మళ్లీ కొత్త స్నిఫర్ డాగ్‌ను అమ్రాబాద్ అభయారణ్యంలో రంగంలోకి దించారు. తెలంగాణ అటవీ శాఖ ప్రవేశపెట్టిన స్నిఫర్ డాగ్స్ బాగా పనిచేస్తున్నాయని తెలంగాణ వన్యప్రాణుల విభాగం ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఎ శంకరన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. వీటి వల్ల పలు చెట్ల నరికివేత, కలప స్మగ్లింగ్, వన్యప్రాణుల వేట కేసుల గుట్టు రట్టు అయిందని, ఈ జాగిలాలు కలపస్మగ్లర్లు, వేటగాళ్లను వాసనను గుర్తించి పట్టుకున్నాయని శంకరన్ వివరించారు. ప్రస్థుతం రాష్ట్రంలోని రెండు టైగర్ రిజర్వుల్లో స్నిఫర్ డాగ్స్ తో కలప స్మగ్లర్లు, వేటగాళ్ల ఆట కట్టిస్తున్నామని ఆయన తెలిపారు.
అటవీ మార్గంలో కారు డిక్కిలో బ్రూనో తనిఖీలు
ఫారెస్ట్ డాగ్స్ అంటే హడల్
కవ్వాల్, అమ్రాబాద్ పులుల అభయారణ్యాల్లో టేకు చెట్లను నరికినా, అడవిలో అగ్గి రాజేసినా, అటవీ ఉత్పత్తులను తీసుకువెళ్లినా, వన్యప్రాణులను వేటాడినా ఫారెస్ట్ స్నిఫర్ డాగ్స్ రంగంలోకి దిగి కేవలం వాసన ద్వారానే కలప స్మగ్లర్లు, వేటగాళ్లను పట్టిస్తున్నాయి. ఈ ఫారెస్టు డాగ్స్ రంగంలోకి దిగి ఆపరేషన్ చేపడుతుండటంతో కలప స్మగ్లర్లు, వేటగాళ్లు హడలిపోతున్నారు. ఈ ఫారెస్ట్ స్నీఫర్ డాగ్స్ కలపస్మగ్లర్లు, వేటగాళ్లను పట్టుకోగానే వారిపై అటవీ శాఖ అధికారులు తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ 1967 ప్రకారం కేసులు పెట్టి వారిని జైలుకు పంపిస్తున్నారు. దీంతో కలప స్మగ్లింగ్, వన్యప్రాణుల వేటకు తెరపడుతుందని అమ్రాబాద్ పులుల అభయారణ్యం డీఎఫ్ఓ గోపిడి రోహిత్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
కలప స్మగ్లరును పట్టుకున్న ‘హంటర్’
అక్టోబరు 13వతేదీ రాత్రి 11.00 గంటలకు జన్నారం రేంజిలోని గోండుగూడ బీట్ లో ముగ్గురు కలప స్మగ్లర్లు అడవిలో టేకు చెట్లను నరుకుతున్నారని అడవిలో నైట్ పెట్రోలింగ్ లో ఉన్న అటవీశాఖ బీట్ ఆఫీసరు, వాచర్లకు సమాచారం వచ్చింది. అంతే అటవీశాఖ అధికారులు ఫారెస్ట్ స్నీఫర్ డాగ్ ‘హంటరు’ను తీసుకొని హుటాహుటిన అడవిలోకి వెళ్లారు.కలప స్మగ్లరు తాను ధరించిన చొక్కాను చెట్లు కొట్టేసిన ప్రాంతంలో పొరపాటు మర్చిపోయి వదిలేసి వెళ్లాడు. డాగ్ స్మగ్లర్ చొక్కా చెమట వాసనను గ్రహించిన ‘హంటర్’ డాగ్ జువ్విగూడ గ్రామానికి చెందిన స్మగ్లరు రాథోడ్ హీరాలాల్ ఇంటికి వెళ్లి స్మగ్లరుతోపాటు కలపను అటవీశాఖ అధికారులకు పట్టించింది. అంతే అటవీశాఖ అధికారులు హీరాలాల్ ను అరెస్ట్ చేశారు. ఇతనితో పాటు చెట్లు నరికివేతలో పాల్గొన్న మరో ఇద్దరు స్మగ్లర్లు కూడా హంటర్ భయానికి అటవీశాఖ అధికారుల ముందు లొంగిపోయారు. దీంతో అటవీశాఖ అధికారులు వారిని కలప స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టి రిమాండుకు పంపించారు.ఇదంతా హంటర్ డాగ్ వల్లనే కలప స్మగ్లర్ల ఆట కట్టించారు అటవీశాఖ అధికారులు.
చెట్టుపై వేటగాడు ఉంచిన దుప్పి మాంసాన్ని గుర్తించిన బ్రూనో స్నిఫర్ డాగ్
వేటగాడిని పట్టుకున్న ఫారెస్ట్ జాగిలం ‘బ్రూనో’
అమ్రాబాద్ పులుల అభయారణ్యంలోని బీకే ఉప్పునూతల అనే అటవీ గ్రామానికి చెందిన ఓ వేటగాడు పండుగ సందర్భంగా అడవిలో దుప్పిని వేటాడి, దాని మాంసాన్ని కొంత వండుకొని తిని, మరికొంత మాంసాన్ని గ్రామశివార్లలోని ఓ చెట్టుపై దాచి పెట్టాడు. అడవిలో దుప్పిని చంపిన ప్రదేశంలో ఉన్న రక్తం మరకల ఆధారంగా అమ్రాబాద్ ఫారెస్ట్ జాగిలం బ్రూనోతో వాసన చూపించగా అది రెండు కిలోమీటర్ల దూరంలోని చెట్టువద్దకు వెళ్లి అక్కడ నిలిచి మొరిగింది. అటవీశాఖ అధికారులు చెట్టుపై చూడగా దుప్పి మాంసం సంచిలో పెట్టి ఉంచారని బయటపడింది. దీంతో దుప్పిని వేటాడి చంపిన వేటగాడికి అటవీశాఖ అధికారలు సంకెళ్లు వేశారు.
అటవీశాఖ మాజీ వాచరే స్మగ్లర్ అయిన వేళ...
కవ్వాల్ అభయారణ్యంలోని తాళ్లపేట అడవిలో కలప స్మగ్లర్లు 8 టేకు చెట్లను నరికినట్లు ఆ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ షుష్మారావుకు ఫోన్ వచ్చింది. అంతే అటవీశాఖ అధికారులు స్మగ్లర్లను పట్టుకునేందుకు హంటర్ ను రంగంలోకి దించారు. చెట్లు నరికిన ప్రాంతంలో ఓ టవల్ పడి ఉండటంతో దాన్ని వాసన చూపించగా హంటర్ వాసనను పసిగట్టి నేరుగా కలపస్మగ్లరుగా మారిన అటవీశాఖ మాజీ వాచర్ పెందూరు రాజేష్ ఇంటికి వెళ్లింది. ఆ ఇంట్లో అటవీశాఖ అధికారులు శోధించగా టేకు దుంగలు దొరికాయి. దీంతో స్మగ్లర్ రాజేష్ ను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.
టేకు దుంగలను పట్టించిన ఫారెస్ట్ డాగ్
అమ్రాబాద్ టైగర్ రిజర్వు పరిధిలోని నల్లమల అడవుల్లో టేకు చెట్లను నరికి దుంగలను వటువర్లపల్లిలోని ఓ ఇంట్లో కలప స్మగ్లర్లు దాచి పెట్టారు. బ్రూనో డాగ్ తో తనిఖీలు చేయగా టేకు దుంగలను స్నిఫర్ డాగ్ పట్టించింది.దీంతో కలప స్మగ్లర్లపై కేసు నమోదు చేశామని నల్లమల ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ డి మంజుల చెప్పారు. ఎవరైనా కలప స్మగ్లర్లు చెట్లను నరికితే ఫారెస్ట్ స్నిఫర్ డాగ్ పట్టుకుంటుందని ఆమె హెచ్చరించారు.
కలపస్మగ్లర్లు, వేటగాళ్లకు జైలు, జరిమానా
అభయారణ్యాల్లో కలప స్మగ్లింగ్ చేసినా, వన్యప్రాణులను వేటాడినా అటవీ చట్టాల ప్రకారం నేరస్థులకు రూ.25 వేల జరిమానా లేదా ఏడేళ్ల కారాగార శిక్ష లేదా రెండూ విధించే అవకాశముందని అమ్రాబాద్ అటవీశాఖ బీట్ ఆఫీసర్ ముహ్మద్ పాషా ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
అడవిలో స్నిఫర్ డాగ్స్ పెట్రోలింగ్
కవ్వాల్, అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో అటవీశాఖ స్నిఫర్ డాగ్స్ తో పెట్రోలింగ్ చేస్తోంది. కలప స్మగ్లర్లు, వేటగాళ్లను పట్టుకోవడంతోపాటు స్మగ్లింగ్, వేట జరగకుండా నిరోధించేందుకు వీలుగా ఈ జాగిలాలు పనిచేస్తున్నాయి. ప్రతీరోజూ డాగ్ హ్యాండ్లర్స్ ఈ డాగ్స్ ను తీసుకొని అడవుల్లో పెట్రోలింగ్ చేస్తున్నారు. ఈ డాగ్స్ భయానికి స్మగ్లింగ్, వేట తగ్గాయని అటవీశాఖ అధికారి కారెం శ్రీనివాస్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
కవ్వాల్ అభయారణ్యంలో వేటాడుతున్న స్నిఫర్ డాగ్ కు ‘హంటర్’ పేరు
తెలంగాణ అటవీశాఖ కవ్వాల్ టైగర్ రిజర్వులో వేటగాళ్లు, కలప స్మగ్లర్లను వేటాడేందుకు తాజాగా రంగంలోకి దించిన స్నిఫర్ డాగ్ కు అటవీశాఖ అధికారులు ‘హంటర్’ అని పేరు పెట్టారు. కవ్వాల అభయారణ్యంలో గతంలో ఉన్న ‘చీతా’ అనే డాగ్ అనారోగ్యంతో మరణించడంతో కొత్తగా హంటరును తీసుకువచ్చారు. గతంలో ‘చీతా’ డాగ్ 2016 వ సంవత్సరం నుంచి 2024వ సంవత్సరం వరకు విశిష్ఠ సేవలందించి అనారోగ్యంతో మరణించింది.
పంచకుల ఇండో టిబెటన్ బార్డర్ పోలీసు విభాగం నుంచి...
హర్యానా రాష్ట్రంలోని పంచకుల ఇండో టిబెటన్ బార్డర్ పోలీసు విభాగం ఆధ్వర్యంలోని నేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ డాగ్స్ అండ్ ఎనిమల్ అకాడమీ నుంచి రెండున్నర నెలల వయసున్న స్నిఫర్ డాగ్ హంటర్ ను కవ్వాల్ ఫారెస్ట్ అధికారులు తీసుకువచ్చారు. బెల్జియం మాలినోయిస్ బ్రీడ్ కు చెందిన హంటర్ కు చంఢీఘడ్ లో ఏడు నెలల పాటు శిక్షణ పూర్తి కావడంతో దాన్ని అడవుల్లో రంగంలో దించారు. రెండున్నర నెలల వయసు నుంచే ఈ జాగిలానికి వాసన పసిగట్టడంలో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. హంటరుకు కాకుండా దీని హ్యాండ్లర్లు అయిన అనిల్ కుమార్, పరమేష్ లు కూడా చంఢీఘడ్ లో ప్రత్యేక శిక్షణ పొందారు.
నేషనల్ పాసింగ్ ఔట్ పరేడ్ లో హంటర్ కు మూడో స్థానం
చండీఘడ్ లోని నేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ డాగ్స్ అండ్ ఎనిమల్ అకాడమీలో ఏడు నెలల శిక్షణ తర్వాత జరిగిన 12వ నేషనల్ లెవెల్ పాసింగ్ ఔట్ పరేడ్ లో హంటర్ మూడో స్థానంలో నిలిచి అవార్డు సాధించిందని అసిస్టెంట్ డాగ్ హ్యాండ్లర్ పరమేశ్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
అమ్రాబాద్ అభయారణ్యంలో...
అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో స్మగ్లర్లు, వేటగాళ్లను పట్టుకునేందుకు బ్రూనో అనే జర్మన్ షెపర్డ్ జాగిలాన్ని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ నగరంలోని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి రప్పించామని బ్రూనో హ్యాండ్లర్ శివప్రసాద్ చెప్పారు. అమ్రాబాద్ లో 20కు పైగా కలప స్మగ్లింగ్, వేట కేసులను బ్రూనో పట్టించిందని ఆయన చెప్పారు.
ఫారెస్ట్ స్నిఫర్ డాగ్స్ స్మగ్లర్లు, వేటగాళ్లను ఎలా పట్టుకుంటాయంటే...
అటవీశాఖకు చెందిన స్పిఫర్ డాగ్స్ కలప స్మగ్లర్లు, వేటగాళ్లను వాసన ద్వారానే పట్టుకుంటాయి. చెట్లు నరికినా, టేకు దుంగలను తరలించుకెళ్లిన కలప స్మగ్లర్ల చొక్కాలు లేదా వారి టవల్, వారి చెప్పులు, లేదా ఇతర వస్తువులను స్మగ్లింగ్ చేసిన ప్రదేశంలో మర్చిపోయి వదిలి వెళితే వాటిని ఈ డాగ్స్ కు వాసన చూపిస్తారు. వన్యప్రాణులను వేటాడితే వాటి మాంసం ముక్కలు లేదా వాటి రక్తం వాసను ఈ స్నిఫర్ డాగ్స్ కు చూపిస్తారు. అంతే కలపస్మగ్లర్లు, వేటగాళ్లు ఎక్కడ ఉన్నా వాటి వాసనను ఈ జాగిలాలు గుర్తించి పట్టుకుంటాయి.
అటవీగ్రామాల్లో హంటర్ అంటే హడల్
కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోని అటవీ గ్రామాల్లో అటవీశాఖ అధికారులు హంటర్ ను తిప్పుతూ దీనికి ప్రచారం చేశారు. హంటర్ పేరు చెబితేనే కలప స్మగ్లర్లు, వేటగాళ్లు హడలిపోతున్నారు.కవ్వాల్ అభయారణ్యంలో ‘హంటర్’అనే స్నిఫర్ డాగ్ కలప స్మగ్లర్లు, వేటగాళ్ల పాలిట సింహస్వప్నంగా నిలిచింది. టేకు చెట్లను నరికి కలప స్మగ్లర్లు పరారైనా, జింకలు ఇతర వన్యప్రాణులను చంపిన వేటగాళ్లను హంటర్ వాసన ద్వారానే పట్టుకుంటుందని జన్నారం అటవీశాఖ అధికారి ఎం రామ్మోహన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
హంటర్ ఫీడింగ్ కోసం ప్రత్యేకంగా గెస్ట్ హౌస్ తో పాటు వాచర్
అటవీశాఖ కవ్వాల్ లోని స్నిఫర్ డాగ్ హంటర్ కోసం ప్రత్యేకంగా సింగిల్ బెడ్రూం, హాలు, కిచెన్ తో కూడిన అటవీశాఖ క్వార్టరును కేటాయించారు. ఈ డాగ్ కోసం వేసవికాలంలో చల్లగా ఉండేలా కూలర్ ను, చలికాలంలో వెచ్చగా ఉండేలా హీటర్ ను కూడా అమర్చారు. ఈ డాగ్ డ్యూటీలో భాగంగా ఆపరేషన్ లలో పాల్గొనేందుకు వీలుగా దీని కోసం ప్రత్యేకంగా బొలెరో వాహనాన్ని ఏర్పాటు చేశారు. దీని ఆలనా పాలన కోసం ఇద్దరు బీట్ ఆఫీసర్లు, ఒక వాచర్ ను ప్రత్యేకంగా నియమించారు.బీట్ ఆఫీసర్ అనిల్ కుమార్ హంటర్ డాగ్ హ్యాండ్లరుగా,అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పరమేశ్ అసిస్టెంట్ హ్యాండ్లరుగా, వాచర్ గా తాజుద్దీన్ ను నియమించారు. వాచర్ ఈ డాగ్ కు స్నానం చేయించడంతోపాటు ఆహారం వండి పెడుతుంటారు.
ఇదీ హంటర్ దిన చర్య
ప్రతీ రోజూ ఉదయం 5.30 గంటలకు హంటర్ స్నిఫర్ డాగ్ ను నిద్రలేపి బయటకు తీసుకువెళతారు. స్టూలింగ్ అయిన తర్వాత ఉదయం 6.00 గంటల నుంచి ఏడు గంటల వరకు మైదానంలో వర్కవుట్ చేయిస్తుంటారు. ఈ డాగ్ కు వర్కవుట్ లో భాగంగా రన్నింగ్, జాగింగ్, జంపింగ్ తోపాటు వివిధ రకాల ఎక్సర్ సైజులు చేపిస్తారు.మళ్లీ సాయంత్రం వేళ 4.00 గంటల నుంచి 5.30 గంటల వరకు డాగ్ హ్యాండ్లర్ పర్యవేక్షణలో వర్కవుట్ చేపిస్తున్నారు.
అటవీశాఖ హంటర్ కోసం ప్రత్యేకంగా బడ్జెట్ ను కేటాయించింది. దీనికి ప్రతీరోజూ ఉదయం 11 గంటలకు బాయిల్డ్ ఎగ్, అరలీటర్ పాలు, 200 గ్రాముల మొక్కజొన్న గటక లేదా రైస్, 100 గ్రాముల మిక్స్ డ్ కూరగాయలు, పాలకూర, బీట్ రూట్, క్యారట్ ఉడికించి హంటర్ కు పెడుతున్నారు. సాయంత్రం వేళ 6.00 గంటలకు 350 గ్రాముల బోన్ లెస్ మటన్, 250 గ్రాముల రైస్, కొంచెం పసుపు వేసి ఉడికించి ఈ డాగ్ కు పెడుతున్నారు. మధ్యాహ్నం వేళ దీనికి పెడిగ్రీ, బిస్కెట్లు, చికెన్, వెజిటబుల్, మటన్ ఫ్లేవర్లతో కూడి స్టిక్స్ అందిస్తున్నారు. దీంతో పాటు గ్రౌండులో ప్రాక్టీసు బాగా చేసినపుడు ప్రోత్సాహకంగా హంటరుకు ప్రత్యేకంగా టిట్ బిట్స్ లా మంచి రుచికరమైన బిస్కెట్లు కూడా పెడుతున్నారు.ఈ డాగ్స్ కు ఫిల్టరు చేసిన మంచినీటిని అందిస్తున్నామని హంటర్ వాచర్ తాజుద్దీన్ చెప్పారు.
వాసన పసిగట్టడంలో మనుషుల కంటే మేటి బెల్జియం మాలినోయిస్ బ్రీడ్ జాగిలం
తెలంగాణ రాష్ట్రంలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులో కలప స్మగ్లర్లు, వేటగాళ్లను పట్టుకునేందుకు బెల్జియం దేశానికి చెందిన మాలినోయిస్ బ్రీడ్ స్నిఫర్ డాగ్ అయిన ‘హంటర్’ ను అటవీశాఖ రంగంలోకి దించింది. బెల్జియం బ్రీడ్ ఫారెస్టు డాగ్ కు మనుషుల కంటే 200 రెట్లు ఎక్కువగా వాసనను పసిగడుతుందని డాగ్ హ్యాండ్లర్ అయిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనిల్ కుమార్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఈ హంటర్ స్మగర్లు, వేటగాళ్ల వాసనను పసిగట్టడంలో కాకుండా 20 రెట్లు అధిక వినికిడి శక్తి కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ జాగిలానికి చూపు మనిషి కంటే తక్కువ ఉండటంతో దీంతో రాత్రి సమయంలో ఆపరేషన్ చేపట్టమని ఆయన తెలిపారు.
ప్రతీ నెలా వెటర్నరీ డాక్టరుతో వైద్య పరీక్షలు
ఈ ఫారెస్ట్ స్నిఫర్ డాగ్స్ ను ప్రతీ నెలా కోరుట్లలోని వెటర్నరీ యూనివర్శిటీ పశు వైద్యుడి వద్దకు తీసుకువెళ్లి అన్ని రకాల వైద్యపరీక్షలు చేపిస్తామని డాగ్ హ్యాండ్లర్ అయిన బీట్ ఆఫీసర్ అనిల్ కుమార్ చెప్పారు.వెటర్నరీ డాక్టరు సలహాపై ఈ స్నిఫర్ డాగ్స్ కు ప్రోటీన్లు, సిరప్ లు అందిస్తున్నామని ఆయన వివరించారు.
హంటర్, బ్రూనోలే అటవీ రక్షకులు
తెలంగాణ అటవీశాఖ ప్రవేశపెట్టిన ఫారెస్ట్ స్నిఫర్ డాగ్స్ హంటర్, బ్రూనో (Hunter, Bruno)లాంటి జాగిలాలు ఇప్పుడు అడవుల్లో అటవీ సిబ్బందికి కళ్లు,చూపు, ముక్కు వాసనలుగా మారాయి.తెలంగాణలో వీటి సహాయంతో ఎన్నో కలప స్మగ్లింగ్, వన్యప్రాణి వేట కేసులు వెలుగులోకి వచ్చాయి. స్మగ్లర్లను, వేటగాళ్లను కేవలం వాసన ఆధారంగా పట్టుకునే ఈ స్నిఫర్ డాగ్స్ వల్ల అడవుల్లో నేరాలు గణనీయంగా తగ్గాయి.అడవుల సంరక్షణలో సాంకేతికత, మానవ మేధస్సు, జంతు శిక్షణ ...ఈ మూడు కలయికతో తెలంగాణ అటవీశాఖ ఒక కొత్త దిశను చూపుతోంది. భవిష్యత్తులో మరిన్ని ఫారెస్ట్ డాగ్ స్క్వాడ్‌లు ఏర్పడితే, టేకు స్మగ్లింగ్, వన్యప్రాణి వేటకు శాశ్వతంగా ముగింపు పలికే రోజు దూరంలో లేదని అటవీ అధికారులు చెబుతున్నారు.