పీర్జాదిగూడ ఘటనపై ప్రతిపక్షాలు ఫైర్

హైదరాబాద్ పీర్జాదిగూడలో అక్రమ కట్టడాలంటూ ప్రభుత్వం ఇళ్లను కూల్చివేయడాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుబట్టారు.

Update: 2024-07-08 14:38 GMT

హైదరాబాద్ పీర్జాదిగూడలో అక్రమ కట్టడాలంటూ ప్రభుత్వం ఇళ్లను కూల్చివేయడాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుబట్టారు. బీఆర్‌ఎస్ కార్పొరేటర్లను బెదిరించి పీర్జాదిగూడ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం స్థానికులను ఈరకంగా వేధిస్తోందని ఆరోపించారు. మేయర్ జక్కా వెంకట్ రెడ్డికి, కార్పొరేటర్లకు బీఆర్‌ఎస్ మద్దతుగా ఉందని, బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ వేధింపులను వడ్డీతో సహా తీర్చుకుంటానని అన్నారు.

కాగా, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నంబర్ 1లో ప్లాట్లలో స్థానికులు ఇళ్ళు నిర్మించుకున్నారు. అయితే అవన్నీ అక్రమ కట్టడాలని ఈరోజు ప్రభుత్వం వాటిని కూల్చివేసింది. కూల్చివేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు పోచయ్య, హరిశంకర్‌ రెడ్డి లను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అక్కడ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. అయితే ఈ ఘటనపై ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుబడుతున్నాయి.

ఈ ఘటనపై కేటీఆర్ స్పందిస్తూ.. కాంగ్రెస్ నేతలు అమాయకులకు ప్లాట్లు విక్రయించారని, ఆ తర్వాత వారి ఇళ్లను కూల్చివేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఘటనపై విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌ రెడ్డిని కోరారు. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ ప్లాట్లను క్రమబద్ధీకరించిందని తెలిపారు. కాంగ్రెస్ నాయకుడు రాందాస్ గౌడ్, జగదీశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ కార్పొరేటర్ అమర్ సింగ్ కుటుంబం ఈ ప్లాట్లను విక్రయించింది. పట్టా భూమి కావడంతో రెవెన్యూ అధికారులు ఎన్‌ఓసీలు జారీ చేశారు. మునిసిపల్ అనుమతులతో ప్రజలు అప్పులు చేసి ఇళ్లు నిర్మించుకున్నారు" అని ఆయన చెప్పుక్కుకొచ్చారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అధికారులపై ఒత్తిడి తెచ్చి అమాయకులు కట్టుకున్న ఇళ్లను కూల్చివేశారని మండిపడ్డారు.

"సాయిప్రియ, సత్యనారాయణపురం కాలనీలో ప్లాట్‌ యజమానుల సమస్యలను పరిష్కరించేందుకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జీవో 118ని చేర్చింది. కానీ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఇళ్లను కూల్చేస్తోంది. ఈరోజు వాటిని కూల్చివేయడం ద్వారా మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఏం సాధించాలని ఆశించారు? అని కేటీఆర్ నిలదీశారు. ఇలాంటి అణచివేతను ప్రజలు అంతం చేస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ హెచ్చరించారు.

పరిహారం చెల్లించాల్సిందే... ఈటల

అవి అక్రమ భూములు అయితే, ఆనాడు ఇళ్ల నిర్మాణానికి, గృహ రుణాలకు ఎలా అనుమతి ఇచ్చారో సమాధానం చెప్పాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్​ చేశారు. సమస్య ఉత్పన్నమైతే పరిష్కరించాల్సిన ప్రభుత్వం, హింసకు గురిచేయడం సరికాదన్నారు. కాంగ్రెస్‌ వైఖరి వల్ల 300 మంది చిరుద్యోగులు రోడ్డున పడ్డారని మండిపడ్డారు. 30, 40 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన భూముల విషయంలో ఇప్పుడు కలుగజేసుకోవటం ఏంటని ప్రశ్నించారు.

"రెక్కాడితే కానీ డొక్కాడని ఆ పేదవాళ్లు, 30 యేళ్ల క్రితం పీర్జాదీగూడలో భూములను కొనుక్కున్నారు. వాళ్లకు అన్ని పర్మిషన్లు ఉన్నా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అకారణంగా కట్టుకున్న ఇళ్లను కూల్చివేసింది. అడిగే నాథుడు లేడు. కూలగొట్టిన ఆ ఇళ్లకు పరిహారం చెల్లించాలి. అదేవిధంగా అప్పుడు అనుమతులు ఇచ్చిన కలెక్టర్​పై చర్యలు తీసుకోవాలి" అని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News