ఇస్రో, ఎన్‌ఆర్ఎస్సీతో ఓయూ ఒప్పందం
అంతరిక్ష పరిశోధన, శిక్షణ, నైపుణ్య అభివృద్ధి అంశాలపై విద్యాసంస్థలు స్పెషల్ ఫోకస్ పెడుతున్నాయి.;
అన్ని రంగాల్లో భారత్ తన మార్క్ చూపించుకుంటుంది. స్పేస్ రంగంలో అయితే ప్రపంచాన్ని విస్తుబోయేలా చేసే విజయాలను సాధిస్తోంది. చంద్రయాన్-3 సక్సెస్ తర్వాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) చేపడుతున్న ప్రతి ప్రాజెక్ట్ కూడా ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. అంతరిక్ష పరిశోధన, శిక్షణ, నైపుణ్య అభివృద్ధి అంశాలపై విద్యాసంస్థలు స్పెషల్ ఫోకస్ పెడుతున్నాయి. ఇందులో భాగంగానే అంతరిక్ష పరిశోధన సంస్థలతో విద్యా సంస్థలు ఒప్పందాలు కూడా చేసుకుంటున్నాయి. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ.. ఇస్రోకి అనుబంధంగా ఉన్న నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌తో కీలక ఒప్పందం చేసుకుంటుంది. దీని ప్రకారం రానున్న ఐదేళ్లపాటు ఇస్రో, ఎన్‌ఆర్‌ఎస్సీ, ఓయూ సంయుక్తంగా విద్య, పరిశోధన కార్యక్రమాలను చేపట్టనున్నాయి. అంతరిక్ష రంగంలోని తాజా ఆవిష్కరణలకు అనుగుణంగా విద్యార్థుల సామర్థ్యాలను పెంచడానికి, వారికి ప్రామాణిక శిక్షణ కల్పించడంలో ఈ ఒప్పందం కీలక మైలురాయిలా మారనుంది.
ఓయూ విద్యార్థుల కోసం ఇంజినీరింగ్, టెక్నాలజీ విభాగాల్లో కొత్త డిగ్రీ, పీజీ కోర్సులు అందుబాటులోకి వస్తాయి. ఇవి అంతరిక్ష, ఉపగ్రహ పరిశోధనలకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి ప్రత్యేకంగా రూపొందించనున్నారు. ఓయూ విద్యార్థులకు అదనంగా శాస్త్రవేత్తలతో ప్రత్యక్షంగా చర్చించే అవకాశం కూడా ఉంటుంది. ఇందులో అంటార్కిటికాలో ఉన్న శాస్త్రవేత్తలతో లైవ్ ఇంటరాక్షన్ సెషన్స్ కూడా ఉంటాయి.