హైదరాబాదీ మహిళతో ప్రేమ పెళ్లి పేరిట పాకిస్థానీ మోసం

పహెల్గాం దాడి తర్వాత పాక్ జాతీయులను వెనక్కి పంపిస్తుండగా ఓ కొత్త కథ వెలుగుచూసింది. ఓ పాకిస్థానీ హైదరాబాదీ మహిళను మోసం చేసి ప్రేమ పెళ్లి చేసుకున్నాడని తేలింది.;

Update: 2025-04-28 07:54 GMT
పాకిస్థానీ ఉస్మాన్ ఇక్రమ్

జమ్మూ కశ్మీరులోని పహెల్గాంలో పర్యాటకులపై పాక్ ఉగ్రవాదులు జరిపిన దాడి ఘటన తర్వాత దేశంలోని పాక్ జాతీయులను కేంద్రం ఆ దేశానికి తిప్పి పంపిస్తోంది. హైదరాబాద్‌ నగరంలోనూ 230 మందికి పైగా పాకిస్థానీయులు ఉన్నారని తేలడంతో కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆదేశాలతో వాళ్లను వెనక్కి పంపడానికి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్‌లో 200 మందికి పైగా పాకిస్థానీయులను అట్టారి సరిహద్దుకు పంపించే పనిలో పోలీసులు ఉన్నారు.ఈ క్రమంలో పాక్ యువకుడి ప్రేమ పెళ్లి బాగోతం వెలుగుచూసింది.


దుబాయ్‌లో భారతీయుడినంటూ పరిచయం చేసుకొని...
హైదరాబాద్ నగరానికి చెందిన ఓ మహిళ 17 సంవత్సరాల క్రితం దుబాయ్ లో ఉద్యోగం చేస్తుండేది. పాకిస్థాన్ దేశానికి చెందిన ఉస్మాన్ ఇక్రమ్ అలియాస్ ముహమ్మద్ అబ్బాస్ ఇక్రమ్ అనే యువకుడు తాను ఢిల్లీ నగరవాసినని, తాను భారతీయుడినేనంటూ హైదరాబాదీ మహిళను పరిచయం చేసుకున్నాడు. తాను ప్రేమిస్తున్నానని చెప్పి దుబాయ్ లోనే హైదరాబాదీ మహిళను పాక్ జాతీయుడు పెళ్లి చేసుకున్నాడు.

ప్రేమ పెళ్లి పేరిట పాక్ జాతీయుడి మోసం
దుబాయ్ లో ఉద్యోగాన్ని వదిలి హైదరాబాదీ మహిళ తన స్వస్థలమైన హైదరాబాద్ కు తిరిగివచ్చింది. మోసగించి ప్రేమ పెళ్లి చేసుకున్న పాకిస్థానీ ఉస్మాన్ ఇక్రమ్ చట్టవిరుద్ధంగా భారతదేశంలోకి ప్రవేశించాడు. తాను విజిట్ వీసాపై వచ్చానని చెప్పి వచ్చిన ఉస్మాన్ ను హైదరాబాదీ మహిళ నిలదీయడంతో అతను తాను పాక్ జాతీయుడనని అంగీకరించాడు.పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఇక్రమ్ పాక్ నుంచి విమాన మార్గంలో నేపాల్‌లోకి ప్రవేశించి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అక్రమంగా సరిహద్దు దాటి ఢిల్లీకి, ఆపై హైదరాబాద్‌కు చేరుకున్నాడని హైదరాబాద్ పోలీసులు కనుగొన్నారు.

పాక్ పౌరుడిపై ఫిర్యాదు
పాక్ జాతీయుడితో దూరంగా ఉంటున్న హైదరాబాదీ మహిళ 2018వ సంవత్సరంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఉస్మాన్ ను పోలీసులు అరెస్ట్ చేసి నిర్బంధ కేంద్రంలో ఉంచారు. పాక్ జాతీయుడి కేసు కోర్టులో నడుస్తోంది. ఉస్మాన్ ను దేశం నుంచి బహిష్కరించే ప్రయత్నాలు ఫలించలేదు. ఉస్మాన్ అబ్బాస్ పేరుతో బోగస్ ధ్రువీకరణ పొంది పాస్ పోర్టు తీసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.తన కుమార్తె నగ్న వీడియోలను అప్ లోడ్ చేస్తానని మాజీ భార్యను బెదిరించాడు. సైబర్ నేరాలకు ఉస్మాన్ పాల్పడ్డాడని తేలడంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

కేంద్రం దృష్టికి ఇక్రమ్ బాగోతం
పహెల్గాం ఉగ్ర దాడి ఘటన తర్వాత పాక్ జాతీయులంతా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించిన నేపథ్యంలో అక్రమ వలసదారు అయిన ఉస్మాన్ ఇక్రమ్ బాగోతం మరోసారి తెర మీదకు వచ్చింది. హైదరాబాద్ పోలీసులు ఇక్రమ్ ప్రేమ పెళ్లి మోసం గురించి కేంద్ర హోంమంత్రిత్వశాఖ దృష్టికి తీసుకువెళ్లారు. ఉస్మాన్ కు ఉగ్రవాద సంస్థలతో లేదా ఐఎస్ఐ వంటి గూఢచారి సంస్థలతో ఉన్న సంబంధాలపై పోలీసు విభాగం దర్యాప్తు చేస్తోంది.



Tags:    

Similar News