పంజా'గుట్టు'.. రట్టయిందండీ ఇట్లు!! మూకుమ్మడి వేటు- ఖాకీల కకావికలు
గురజాడ అప్పారావు రాసిన కన్యాశుల్కంలో ఓ పాత్ర.. సొతంత్రం వస్తే మన ఊరి కానిస్టీబు పోతాడా బాబయ్యా.. అని అమాయకంగా అడుగుతుంది. 175 ఏళ్లయినా ఏమీ మారలేదని రుజువైంది..
ఖాకీల అవినీతి, అధికార దుర్వినియోగం ఈనాటిదేమీ కాదు. వ్యవస్ధలు పుట్టినప్పటి నుంచి పుట్టే ఉంటుందని జూలియస్ సీజర్ చరిత్ర చెబుతోంది. ఎప్పుడో 175 ఏళ్ల కిందట మన గురజాడ అప్పారావు రాసిన కన్యాశుల్కంలోనూ ఖాకీల అవినీతి, వేధింపులు, అధికార దుర్వినియోగం గురించి ఉంటుంది. అందులో ఒక పాత్ర.. స్వాతంత్ర్యం వస్తే మన ఊరి కానిస్టీబు పోతాడా బాబయ్యా.. అని అమాయకంగా అడుగుతుంది. అందువల్ల పోలీసు అవినీతి పురాణానికి ‘బోలెడంత గతం‘, ‘వర్తమానం‘, ‘భవిష్యత్‘ ఉంది. అందువల్ల అవినీతి పలు విధములు.. వ్యవస్థాగత అవినీతి, వ్యవస్థీకృత అవినీతి, వ్యక్తిగత అవినీతి, బృంద లేదా మంద అవినీతి చట్టపరమైన అవినీతి... ఇలా అనేక రకాలు. నిజానికి పోలీసు అవినీతి చాలా వాటితో పోలిస్తే చిన్నదే కావొచ్చు గాని పబ్లిక్ అవినీతి, చాలామందికి కనిపించే అవినీతి కావడంతో పెద్దఎత్తున చర్చ, మరికాస్త రచ్చ అవుతుంది.
మూకుమ్మడి బదిలీలతో కంగుతిన్న ఖాకీలు...
హైదరాబాద్ నడిబొడ్డునున్న పంజాగుట్ట పోలీసు స్టేషన్ సిబ్బంది మొత్తంపై వేటు పడినపుడు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు అవినీతిపై చర్చ జరిగింది. ఒకనాడు దేశంలోనే రెండో అత్యుత్తమ ఠాణాగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్.. నేడు తీవ్ర అప్రతిష్ఠను మూట కట్టుకుందే అని చాలా మంది బాధ పడ్డారు. కాసులతో కేసులను మేనేజ్ చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో.. ఇక్కడ ఎస్సైల నుంచి హోంగార్డుస్థాయి వరకూ దాదాపు 90 శాతం మంది సిబ్బందిపై బదిలీ వేటు పడింది. ఈ స్టేషన్‌లో పనిచేస్తున్న వారిలో ఆరుగురు ఎస్సైలు, 8 మంది ఏఎస్సైలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు కలిపి 86 మందిని ఏకకాలంలో ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌కు ఎటాచ్ చేస్తూ నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. అక్రమాలకు పాల్పడిన సిబ్బందికి మెమోలు జారీచేసి, మందలించినా దారికి రాకపోవటంతో ప్రక్షాళనకు సీపీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఇంతమందిపై వేటు ఇదే ప్రథమం...
రాష్ట్ర పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోనే ఇదో సంచలనం. గతంలో ఎన్నడూ లేని విధమిది. ఇనస్పెక్టర్ నుంచి హోంగార్డ్ వరకు అందరినీ బదిలీ అయ్యారు. అవినీతికి పాల్పడితే ఇలాంటి పరిణామాలే ఉంటాయని రాష్ట్రవ్యాప్తంగా పోలీసులకు ఇది వార్నింగ్ ఇచ్చినట్లయింది.
మూడున్నర లక్షల మంది జనాభా.. ఐదు సెక్టార్లు.. వందకు పైగా పోలీస్ సిబ్బంది.. అంతటి పేరున్న పంజాగుట్ట పీఎస్ రీసెంట్ గా వివాదాల్లో నిలవడం విచిత్రమేమీ కాదు. రాజకీయ పలుకుబడితో పోస్టింగులు తెచ్చుకున్న వారు అవినీతికి పాల్పడకుండా ఉంటారనుకోవడమే లోపం. అలా పైరవీలు, లంచాలు ఇచ్చి వచ్చిన పోలీసులు పలు కీలక కేసులను తప్పుదారి పట్టిస్తారు. ఇప్పుడిక్కడ అదే జరిగింది.
అసలింతకీ ఏమి జరిగిందంటే...
ప్రజాభవన్ (పాత ప్రగతి భవన్) ముందు జరిగిన యాక్సిడెంట్ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్‌ని తప్పించి మరొకరిపై కేసు పెట్టారని అప్పట్లో పని చేస్తున్న సీఐ దుర్గారావును సస్పెండ్ చేశారు. సీఐ దుర్గారావుకు మరికొంత మంది సిబ్బంది సహకరించారనే ఆరోపణలూ ఉన్నాయి. రీసెంట్ గా పంజాగుట్టలో ఒక వ్యక్తి ఫుల్లుగా తాగి తన కారుతో రోడ్డుపై ఉన్నవారందరినీ గుద్దుకుంటూ వెళ్లాడు. అతడ్ని పట్టుకుని స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత ఆ వ్యక్తిని రిమాండ్ కి తరలిస్తుండగా పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. లంచావతారమెత్తిన పోలీసుల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందనేది అందరికీ తెలిసిన సత్యం. నిందితులకు సహకరిస్తూ వారి బంధువులతో మాట్లాడే అవకాశం కల్పిస్తున్నట్లు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. నెల క్రితం డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడి.. న్యూసెన్స్ క్రియేట్ చేసిన ఇద్దరిని ట్రాఫిక్ పోలీసులు పంజాగుట్ట పోలీసులకు అప్పగించగా.. వారిద్దరూ పోలీసుల నుంచి పారిపోయారు. గతంలో ఇదే పీఎస్ కి చెందిన ఇద్దరు కానిస్టేబుల్స్ పెట్రోలింగ్ డ్యూటీ చేస్తూ, లిక్కర్ తాగుతూ పట్టుబడ్డారు. ఇదే పీఎస్ లోని ఓ ఎస్సై.. మహిళా బాధితుల పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి.
రేవంత్ రెడ్డి కదలికల్ని లీక్ చేశారా?
సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ కదలికల్ని సైతం లీక్ చేస్తున్నారని సమాచారం. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఒకేసారి భారీగా ట్రాన్స్ ఫర్స్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు నగర కమిషనర్. అవినీతికి పాల్పడ్డా.. సివిల్ వివాదాల్లో తలదూర్చినా.. ట్రాన్స్ ఫర్స్ తో పాటు సస్పెన్షన్స్ ఉంటాయంటున్నారు పోలీస్ ఉన్నతాధికారులు. ఆరోపణలు వచ్చిన ప్రతీ పోలీస్ పై స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ చేయించనున్నారు.
ఇంకా ఏమేమీ ఆరోపణలున్నాయంటే...
పంజగుట్ట పోలీసు స్టేషన్లో కేసుల నమోదుకు ఫిర్యాదుదారులతో బేరసారాలతో పాటు మహిళలని చూడకుండా అమర్యాదగా ప్రవర్తించినట్లు కొందరు ఎస్సైలపై విమర్శలున్నాయి.
స్థానిక మెరిడియన్ హోటల్‌లో కుటుంబంతో కలిసి భోజనం చేసేందుకు వచ్చిన యువకుడిపై హోటల్ సిబ్బంది దాడికి పాల్పడ్డారు. తీవ్రగాయాల పాలైన బాధితుడిని ఆసుపత్రికి బదులు పోలీసులు ఠాణాకు తీసుకెళ్లారు. అప్పటికే తీవ్రంగా గాయపడిన బాధితుడు అక్కడే కుప్పకూలాడు.
ఈ ఠాణాలోని 10 మంది ఎస్సైల్లో నలుగురు మసాజ్ కేంద్రాల నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నట్టు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. వీరిలో ఓ ఎస్సై తన వద్దకు వచ్చే ఫిర్యాదుదారులను బెదిరించి, నిందితులతో రాజీ కుదుర్చుకోమని ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.
ఓ ప్రభుత్వ స్థల వివాదంలో ఆక్రమణదారుకు అనుకూలంగా ఉంటానంటూ ఇక్కడి ఎస్సై ఒకరు భారీఎత్తున డబ్బు గుంజినట్టు తెలిసింది.
మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఖాకీల అవినీతిపై కదిలింది. ఇది ఆరంభ శూరత్వం కాకుండా ఉండాలని హైదరాబాద్ నగర ప్రజలు కోరుకుంటున్నారు. సత్వర స్పందనను స్వాగతిస్తున్నారు. వ్యవస్థాగత పోలీసు అవినీతి సమస్యపై కదలికను ప్రజలు హర్షిస్తున్నారు.