Paradise for Tourists | పర్యాటకులకు స్వర్గధామం, అమ్రాబాద్ అభయారణ్యం
అమ్రాబాద్ అభయారణ్యంలో ట్రెక్కింగ్ కోసం ప్యాకేజీని కొత్తగా ప్రారంభించారు.నల్లమల అడవి అందాలు, జాలువారుతున్న జలపాతాలు, గుహల ట్రెక్కింగ్ యాత్ర థ్రిల్ అందిస్తోంది.;
By : The Federal
Update: 2025-01-16 03:24 GMT
చెంగుచెంగున దూకే జింకలు,పులులు, చిరుతల సంచారంతో అమ్రాబాద్ పులుల అభయారణ్యం (Amrabad Tiger Sanctuary) తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల ప్రకృతి పర్యాటకులకు స్వర్గధామంగా నిలిచింది.(Paradise for Nature Tourists)కొత్తగా దోమలపెంట అక్కమహా దేవి గుహల అందాలను తిలకిస్తూ సాగే ట్రెక్కింగ్ థ్రిల్ ఈ పర్యటనకు తోడైంది.
- గల గలా పారే నీటితో పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ నదీ తీరాన (Krishna River), ఎతైన కొండలు, గుట్టలు, జాలువారుతున్న జలపాతాలు,అందమైన హరిత కుటీరాలు,సోమశిలలో బోటింగ్,మున్ననూర్ జంగిల్ రిసార్ట్, టైగర్ స్టే ప్యాకేజీ,సఫారీ రైడ్‌లు, అడవుల్లో ట్రెక్కింగ్, బర్డ్ వాచింగ్ పర్యాటకులకు మధురానుభూతులను మిగిలిస్తోంది.
- ఫరహాబాద్ అడవిలో సఫారీ సవారీలు, దట్టమైన అడవిలో జాలువారుతున్న మల్లెల్లతీర్థం,సలేశ్వరం జలపాతాలు,మన్ననూర్ అడవి అందాలు,పురాతన ప్రతాపరుద్రుని కోట, పులులను ప్రత్యక్షంగా తిలకిస్తూ, రంగురంగుల పక్షులు, వాటి కిలకిలరావాలను వింటూ అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో సాగే ప్రకృతి పర్యావరణ యాత్ర పర్యాటకులకు మర్చిపోలేని మధుర అనుభూతులను మిగిలిస్తోంది.
అక్కమహాదేవి-దోమలపెంట పర్యటన ఉత్కంఠ భరితం
శ్రీశైలం ఆనకట్ట వద్ద కొత్తగా ప్రారంభించిన అక్కమహాదేవి-దోమలపెంట స్టే ప్యాకేజీ పర్యటన ఉత్కంఠ భరితంగా నిలుస్తోంది. శ్రీశైలం సమీపంలోని ఆక్టోపస్ వ్యూ పాయింట్ స్థానం నుంచి కనిపించిన ప్రకృతి అందాలు మనసును పరవశింపజేస్తున్నాయి. దోమలపెంటలో కొత్తగా వనవిహంగ కాటేజీలు, అతిథి గృహం అందుబాటులోకి వచ్చాయి. శ్రీశైలం ఆనకట్ట నుంచి కనిపించే కృష్ణా నది బ్యాక్ వాటర్ మంత్రముగ్ధులను చేస్తుంది.
మధుర అనుభూతిని పంచే యాత్ర
సందర్శకులను సఫారీ వాహనాల్లో ఆక్టోపస్ వ్యూ పాయింట్, వజ్రాల మడుగు వాచ్ టవర్‌కు వెళ్లి అక్కడ సంక్లిష్టమైన స్థలాకృతితో పచ్చని కొండల గుండా మెలికలు తిరుగుతూ పారుతున్న కృష్ణా నదిని ఆస్వాదించవచ్చు. మరుసటి రోజు అక్కమహాదేవి ట్రెక్కింగ్ పాయింట్‌కు సఫారీలో చేరి పురాతన గుహలవద్ద ట్రెక్కింగ్ చేయడం మధుర అనుభూతిని పొందవచ్చు. మార్గమధ్యలో సందర్శకులు సహజ అడవి అందాలు, జంతువులను చూసి ఆనందించవచ్చు.అక్కమహాదేవి గుహలకు చేరుకున్న తర్వాత గుహల్లోని శివుడిని చూస్తే భక్తిభావం ఉట్టిపడుతుంది. ట్రెక్కింగ్‌కు సహాయం చేయడానికి,మార్గనిర్దేశం చేయడానికి చెంచు ప్రకృతి గైడ్‌లను ఏర్పాటు చేశారు.
ఫరహాబాద్ వ్యూ పాయింట్
ఫరహాబాద్ అంటే 'మౌంట్ ప్లెజెంట్' అని అర్ధం. ఇది ప్రధానంగా హైదరాబాద్ నిజామ్ నవాబులు వేట, వినోదం కోసం ఉపయోగించిన ప్రాంతం. ఈ ప్రదేశం సహజ ప్రకృతి అందాల దృశ్యాలు,అరణ్యం చాలా మంది పర్యాటకులను ఆకర్షిస్తాయి.నల్లమల కొండలు, అడవులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు ఉత్తమ సమయం. పీఠభూమి అంచు నుంచి రుషుల చెరువు దృశ్యం ఆకర్షణీయంగా ఉంది.శాశ్వత నీటి చెరువు అడవి పక్కనే ఉంది.
ఆక్టోపస్ వ్యూ పాయింట్
దోమలపెంట అటవీ చెక్-పోస్ట్ సమీపంలో ఆక్టోపస్ వ్యూ పాయింట్ ఉంది. దీనిని పర్యాటకుల కోసం అటవీ శాఖ 2017వ సంవత్సరంలో నిర్మించింది. ఈ వ్యూ పాయింట్ నుంచిసందర్శకులు పచ్చని వృక్షసంపద, కృష్ణ నదీ పరవళ్లు, శ్రీశైలం ఆనకట్ట వెనుక జలాల అద్భుతమైన దృశ్యాలను ఆస్వాదించవచ్చు. కొండల మధ్య ప్రవహించే కృష్ణా నది నీరు లోయలను ఆలింగనం చేసుకునే ఆక్టోపస్‌ను పోలి ఉంటుంది. ఇది మన్ననూర్ నుంచి 42 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై ఉంది.
మల్లెల తీర్థం జలపాతం
మల్లెల తీర్థం నల్లమల అడవుల్లో ఉన్న ఒక అందమైన, శాశ్వత జలపాతం. ఈ జలపాతం నగర జీవితంలోని రద్దీ, కాలుష్యం నుంచి దూరంగా ఉంది. ఈ జలపాతం సమీపంలో గతంలో చాలా మంది రుషులు శివుని కోసం తపస్సు చేశారని ఈ ప్రాంత ప్రజలు చెబుతుంటారు. ఈ నీరు జలపాతం బేస్ నుంచి 150 అడుగుల ఎత్తులో ఉన్న ఒక చిన్న వాగు నుంచి ప్రవహిస్తుంది. ఈ జలపాతం నీరు నేరుగా శివలింగాలపై చిమ్ముతుంది. మల్లెల తీర్థం చివరికి అడవుల ద్వారా కృష్ణ నదిలో కలుస్తుంది. మన్ననూర్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం ఉంది.
అక్కమహాదేవి గుహలు
అక్కమహాదేవి ఈ ప్రదేశంలోనే తుది శ్వాస విడిచిందని చరిత్ర చెబుతుంది. కృష్ణా నదీ ప్రవాహానికి కొంచెం పైన, సహజంగా ఏర్పడిన ఈ గుహ శ్రీశైలం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. 12వ శతాబ్దానికి చెందిన అక్కమహాదేవి ఈ గుహలో తపస్సు చేసి,శివలింగాన్ని పూజించిందని ప్రతీతి. అందుకే దీనిని అక్కమహాదేవి గుహలు అని పిలుస్తారు.
సలేశ్వరం జలపాతం
సలేశ్వరం జలపాతం ఫరహాబాద్ గేట్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో అమ్రాబాద్ డివిజన్ కోర్ ఏరియాలో లోతుగా ఉంది. ఇక్కడ సలేశ్వరం జాతర కూడా సాగుతోంది.గత 30 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో మూడు రోజుల పాటు జాతర నిర్వహిస్తున్నారు. ఇక్కడ శాశ్వత జలపాతం ఉండటంతో రాళ్లపై చిలకరించేటప్పుడు పొడవైన పాములా ఉండటం ఈ ప్రదేశం యొక్క అందాన్ని మరింత పెంచుతుంది. ఈ జలపాతం ఎత్తు 200 అడుగులు, నీటి వనరు ఎక్కడ నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. ఈ జలపాతం వద్ద చెంచులు లింగమయ్యగా పూజించే శివలింగం ఉంది. ప్రతి సంవత్సరం జాతర సమయంలో దేశవ్యాప్తంగా 5 లక్షల మంది సలేశ్వరంను సందర్శిస్తుంటారు.
లొడ్డి మల్లన ఆలయం
లొడ్డి మల్లన ఆలయం మన్ననూర్ శ్రేణిలోని తీర్థయాత్ర స్థలం. లోధి మల్లన అనేది సరస్సు ముందు ఉన్న గుహ, గుహ లోపల శివలింగం ఉంది. జులై నెలలో థోలి ఏకాదశి సమయంలో మాత్రమే ఈ ఆలయం ప్రజలకు తెరిచి ఉంటుంది.
మున్ననూర్ జంగిల్ రిసార్ట్, టైగర్ స్టే ప్యాకేజీ
ఉత్కంఠభరితమైన సఫారీ రైడ్‌లు, అటవీ ట్రెక్కింగ్ మరియు నిపుణుల గైడ్‌ల నేతృత్వంలోని పక్షుల వీక్షణ పర్యటనలతో ఫరహాబాద్ పర్యాటకులను ఆకట్టుకుంటోంది. మట్టి ఇళ్ళు, ట్రీహౌస్,ఏరోకాన్ కాటేజీలున్నాయి. పర్యాటకులకు ఒక జ్యూట్ బ్యాగ్,ఒక్కో గదికి 10 లీఫ్ ప్లేట్లు ఉచితంగా అందిస్తున్నారు.
పర్యావరణ విద్యా కేంద్రం
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ గురించి సందర్శకులకు అవగాహన పెంచడానికి మన్ననూర్‌లో పర్యావరణ విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వివిధ కార్యక్రమాలు, చలనచిత్ర ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు పర్యావరణ విద్యా కేంద్రాన్ని సందర్శిస్తున్నారు.
సోమశిల టూరిజం పాయింట్
సోమశిల టూరిజం పాయింట్ ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణగా నిలిచింది. ఇది నాగర్ కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో ఉంది. ఈ అడవిలో 15 దేవాలయాలున్నాయి. ఈ ఆలయాలను శివుడికి అంకితం చేశారు. ఈ ఆలయాల్లో పలు శివలింగాలు ప్రతిష్ఠించారు.శ్రీశైలం ఆనకట్ట వెనుక భాగంలోని సోమశిలలో బోటింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.పర్యాటకులు పడవలో ప్రయాణించేటప్పుడు ఓపెన్ డెక్ నుంచి చుట్టుపక్కల దృశ్యాలను చూడవచ్చు.సోమశిలలో అందమైన హరిత కుటీరాలున్నాయి.
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ దేశంలోని అతిపెద్ద టైగర్ రిజర్వ్‌లలో ఒకటి. తెలంగాణలోని నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాల్లో 2,611.4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. తూర్పు కనుమల్లోని నల్లమల కొండల్లో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఆకట్టుకుంటోంది. ఈ అభయారణ్యం నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట్ ,నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ మూడు అటవీ విభాగాల్లో ఉంది. హైదరాబాద్ నుంచి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ 140 కిలోమీటర్ల దూరంలో,మహబూబ్ నగర్ నుంచి 105 కిలోమీటర్ల దూరంలో ఉంది. నల్లమల ఫారెస్ట్ ట్రాక్‌లో భాగమైన అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో పలు జాతుల వృక్షాలు, జంతుజాలంతో గొప్ప జీవ వైవిధ్యాన్ని కలిగి ఉంది.ఈ అటవీ ప్రాంతం తెలంగాణలో అత్యధిక సంఖ్యలో పులులకు నిలయంగా మారింది. లోతైన లోయలు, కనుమలతో కూడిన ఈ టైగర్ రిజర్వ్ యొక్క కొండ భూభాగం కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఇంకెనెన్నో ప్రకృతి అందాలు, ఏండ్ల నాటి చరిత్ర మన తెలంగాణ కే సొంతం.
— Telangana Tourism (@TravelTelangana) January 3, 2025
వేరే విహార యాత్రలకోసం, మా వెబ్సైట్ చూడగలరు! #తెలంగాణజరురానా #telenganazaruraana https://t.co/cFVKcynmdw