జూబ్లీ ఎన్నిక: చిన్న శ్రీశైలం యాదవ్‌కు భారీ షాకిచ్చిన పోలీసులు
రైడీ షీటర్ల బైండోవర్‌లో శ్రీశైలం యాదవ్ పేరు. అసలు ఈ బైండోవర్ ఏంటి? ఎందుకు?
తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక హీట్ రోజురోజుకు అధికం అవుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఈ ఉపఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నవంబర్ 11న జూబ్లీహిల్స్ అసెంబ్లీ సీటుకు పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఎన్నికల సమయంలో శాంతి భద్రతలకు ఏమాత్రం విఘాతం కలగకుండా ఉండటం కోసం రౌడీ షీటర్ల చేత బౌండోవర్ చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ తరుపున ఉపఎన్నిక బరిలో ఉన్న నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ చేత కూడా బైండోవర్ చేయించారు. ఆయనతో పాటు 100 మంది రౌడీ షీటర్లతో బైండోవర్ చేయించారు. అత్యధికంగా బోరబంద పరిధిలో 74 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేశారు. చిన్న శ్రీశైలం యాదవ్, అతని సోదరుడు రమేశ్ యాదవ్‌తో మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైండోవర్ చేశారు. ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలీసులు రౌడీ షీటర్ల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
అసలు బైండోవర్ అంటే..!
ఎన్నికల సమయంలో శాంతి భద్రతలకు చిన్నపాటి విఘాతం కలిగినా చాలా పెద్ద సమస్య అవుతుంది. అలాంటివి జరగకుండా ఉండటం కోసమే పోలీసులు బైండోవర్ చేయిస్తారు. ఈ పదం ఎన్నికల సమయంలోనే ఎక్కువగా వినిపిస్తుంటుంది. శాంతి భద్రతలకు ఎవరి వల్ల అయినా విఘాతం కలగొచ్చు అని అనుకుంటే వారి చేత పోలీసులు బైండోవర్ చేయిస్తారు. బైండోవర్ అంటే బాండ్ ఫర్ గుడ్ బిహేవియర్ అని అర్థం. ఎన్నికల సమయంలో తాను శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఎటువంటి చర్యలకు పాల్పడనని సదరు వ్యక్తుల చేత బాండ్ పేపర్‌పై లిఖిత పూర్వకంగా హామీ తీసుకుంటారు. ఇదంతా కూడా తహసీల్దార్ లేదా ఆర్డీఓ ముందు జరుగుతుంది. సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేస్తారు. వీరిలో ఎక్కువగా రౌడీ షీటర్లు ఉంటారు.
బైండోవర్‌ను ఉల్లంఘిస్తే..
ఒకవేళ బైండోవర్ చేసిన వ్యక్తి దానిని ఉల్లంఘిస్తే 24 గంటల్లో అతనిని అరెస్ట్ చేస్తారు. సదరు వ్యక్తిపై ఐపీసీ 107, 108, 109, 110 సెక్షన్ల కింద బైండోవర్ కేసులు నమోదు చేస్తారు. బైండోవర్ సమయంలో వ్యక్తులు రాసిచ్చిన పత్రాలు పోలీసుల దగ్గర కొన్ని నెలల పాటు ఉంటాయి. ఎన్నికలు పూర్తి అయిన తర్వాత అయినా.. ఎన్నికల సమయంలో సదరు వ్యక్తి శాంతి భద్రతలకు విఘాతం కలిగించినట్లు తెలిస్తే అతనిపై చర్యలు ఉంటాయి.