పళ్లతో మేక మెడ కొరికి బలి, పెటా ఫిర్యాదుపై పోలీసు కేసు
జంతు హింసకు పాల్పడిన ఘటనపై చిన్నకోడూర్ పోలీసులు కేసు నమోదు చేశారు...;
By : The Federal
Update: 2025-07-07 08:30 GMT
జంతుహింసకు సంబంధించి దారుణ ఘటన తాజాగా సిద్ధిపేటజిల్లాలో వెలుగులోకి వచ్చింది. మేక మెడను ఓ వ్యక్తి తన పళ్లతో కొరికి చంపి, చేతులతో మేక చర్మాన్ని చీల్చిన ఘటన సిద్ధిపేట జిల్లాలోని చిన్నకోడూర్ మండలం జక్కాపూర్ గ్రామంలో సంచలనం రేపింది. మేకను బలి చేసిన ఘటనను వీడియో తీసి షేర్ చేయడంతో ఈ ఘటన జంతుప్రేమికుల దృష్టికి వచ్చింది. జంతు సంక్షేమ సంస్థ పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ ఇండియా (PETA ఇండియా), స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (SAFI) హైదరాబాద్ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో చిన్నకోడూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
జంతు హింసపై కేసు
జంతు హింసకు పాల్పడిన నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా మేనేజరు అదులాపురం గౌతమ్ ఇచ్చిన ఫిర్యాదు సిద్ధిపేట పోలీసు కమిషనర్ డాక్టర్ బి అనూరాథ కేసు నమోదు చేయించారు.మేకను అత్యంత క్రూరంగా చంపిన వ్యక్తిపై భారతీయ న్యాయ సంహిత 2023 సెక్షన్ 325, తెలంగాణ జంతువులు, పక్షుల బలి నిషేధ చట్టం 1950 సెక్షన్ 6 ప్రకారం, జంతువుల పై క్రూరత్వం నివారణ చట్టం 1960 సెక్షన్ 11(1)(ఎ) కింద పోలీసులు కేసు నమోదు చేశారని పెటా ప్రతినిధి వీరేంద్రసింగ్ చెప్పారు.
సీపీకి పెటా అభినందన
జంతు హింసకు వ్యతిరేకంగా సిద్ధిపేట సీపీ డాక్టర్ అనూరాథ కేసు నమోదులో చూపించిన చొరవను పెటా అభినందించింది. లైసెన్స్ పొందిన కబేళాల్లో మాత్రమే జంతువులను వధించవచ్చని మున్సిపల్ అధికారులు ఈ తీర్పును పాటించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఏదైనా మతపరమైన ఆరాధన స్థలంలో లేదా దాని ఆవరణలో లేదా వీధిలో మతపరమైన ఆరాధనతో అనుసంధానించిన ఏదైనా ఊరేగింపులో ఏదైనా జంతువును మతపరంగా బలి ఇవ్వడాన్ని నిషేధించింది. దీన్ని ఉల్లంఘించి బహిరంగంగా మేకను పళ్లతో కొరికి చంపి బలి ఇవ్వడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు.