కొడిపందేల కేసు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ విచారణ పూర్తి..
లాయర్ సమాధానం నచ్చకనే పోచంపల్లికి రెండోసారి నోటీసులు. విచారణకు హాజరై సమాధానాలిచ్చిన ఎమ్మెల్సీ.;
మొయినాబాద్‌లోని ఫార్మ్ హౌస్‌లో కోడి పందేలు, క్యాసినో నిర్వహించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. అందుకు ఆ ఫార్మ్ హౌస్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి కావడమే కారణం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఫార్మ్ హౌస్‌లో క్యాసినో, కోడి పందేలు నిర్వహించారన్న విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చలకు దారితీసింది. కాగా.. ఈ కేసులో పోలీసులు వేగం పెంచారు. తాజాగా ఈకేసుకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లిని పోలీసులు శుక్రవారం విచారించారు. ఆయన విచారణ దాదాపు నాలుగన్నర గంటలపాటు సాగింది. ఇందులో ఆయనను పలు కీలక ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. తన ఫార్మ్ హౌస్‌లో కోడిపందేలు, క్యాసినో నిర్వహిస్తుంటే ఆ విషయంలో ఎమ్మెల్సీకి ఎలా తెలియలేదు? తెలిసినా ఆయన సైలెంట్‌గా ఉన్నారా? ఈ క్యాసినో వ్యవహారం ఎప్పటి నుంచి కొనసాగుతుంది? అన్న అంశాలపై పోలీసులు విచారించినట్లు సమాచారం.
అయితే ఈ కేసుకు సంబంధించి విచారణకు రావాలని పోచంపల్లికి ఫిబ్రవరి 13న నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఆ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తన తరుపు న్యాయవాదిని పంపి.. ఫార్మ్ హౌస్‌ను లీజ్‌కు ఇచ్చానని చెప్పారు. వారు మరొకరికి లీజుకు ఇచ్చి ఈ వ్యవహారం నడిపించారని, ఈ విషయం తనకు ఇప్పటి వరకు తెలియదని చెప్పారు. ఆయన సమాధానంతో సంతృప్తి చెందని పోలీసులు.. మరోసారి నోటీసులు జారీ చేశారు. వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని తెలిపారు. ఆ నోటీసుల మేరకు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం విచారణకు హాజరయ్యారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
అసలు కేసేంటంటే..
ఫిబ్రవరి 11న పక్కా సమాచారం రావడంతో మొయినాబాద్ ఫార్మ్ హౌస్‌లో పోలీసులు సోదాలు చేపట్టారు. అక్కడ కోడి పందాలు, క్యాసినో నిర్వహిస్తున్నట్లు నిర్ధారించారు. 61 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో రాజేంద్రనగర్ డీసీపీ బృందం 64 మందిని అదుపులోకి తీసుకుంది. అంతేకాకుండా రూ.30లక్షల నగదు, 55 లగ్జరీ కార్లను కూడా స్వాధీనం చేసుకుంది. 86 పందెం కోళ్లు, 46 కోడికత్తులు, కోటిరూపాయలు విలువచేసే క్యాసినో కాయిన్‌లను కూడా స్వాధీనం చేసుకుంది. పందేలు నిర్వహిస్తున్న భూపతిరాజు, శివకుమార్ కీలకంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోచంపల్లిని పోలీసులు ఏ1గా చూపించారు. పోచంపల్లిపై సెక్షన్-3, గేమింగ్ యాక్ట్, సెక్షన్-11 యానిమల్ యాక్ట్ కింద కేసులు నమోదుచేశారు. ఫామ్ హౌస్ ను శివకుమార్ వర్మ లీజుకు తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయాలపై స్పష్టత కోసమే ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ పోలీసులు విచారిస్తున్నారు.