అగ్గి రాజేస్తోన్న రైతులపై లాఠీ ఛార్జ్ వివాదం

ఆదిలాబాద్ లో విత్తనాల కోసం వచ్చిన రైతులపై లాఠీఛార్జ్ జరపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ధ్వజమెత్తాయి.

Update: 2024-05-28 10:23 GMT

ఆదిలాబాద్ లో విత్తనాల కోసం వచ్చిన రైతులపై లాఠీఛార్జ్ జరపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ధ్వజమెత్తాయి. రైతులపై లాఠీఛార్జ్ చేయడం అమానుషం అంటూ బీఆర్ఎస్, బీజేపీ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ తెచ్చిన మార్పు ఇదేనా అంటూ నిలదీస్తున్నారు.

రుతుపవనాలు ఆరంభం కాకముందే సబ్సిడీ విత్తనాల అమ్మకాలు షురూ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. గత కొన్నిరోజులుగా రైతులు విత్తన కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. మండుటెండలోనూ గంటల తరబడి క్యూలో నిల్చున్నా పంట విత్తనాలే కాదు జీలుగ, జనుము విత్తనాలు కూడా లభించట్లేదని వాపోతున్నారు. క్యూలో నిలబడలేక వారి స్థానాల్లో పాస్ బుక్కులు ఉంచుతున్న దృశ్యాలు ప్రభుత్వంపై విమర్శలకు తావిస్తున్నాయి. సరిపడా విత్తనాలు అందుబాటులో ఉంచకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పై ఆగ్రహావేశాలు మొదలయ్యాయి.

ఈ క్రమంలో మంగళవారం ఆదిలాబాద్ లో విత్తనాల కోసం రైతులు పోటెత్తారు. కట్టడి చేసేందుకు పోలీసులు ఒకరిద్దరిపై లాఠీ ఉపయోగించారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతులపై లాఠీ ఛార్జ్ జరిపారంటూ ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలమైంది, మరోవైపు విత్తనాలు కూడా అందించలేని నిస్సహాయ స్థితికి చేరుకుందని బీఆర్ఎస్ వర్గాలు మండిపడుతున్నాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి -కేటీఆర్

రైతన్నలపై లాఠీచార్జిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. "విత్తనాల కోసం బారులు తీరిన రైతన్నలపై లాఠీచార్జ్ చేయటం అత్యంత దారుణం.. దాడి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలి. రాష్ట్రంలో రైతన్నలపైన దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం, ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉండడం సిగ్గుచేటు.. రాజకీయాలు పక్కన పెట్టి రైతన్నల సమస్యలను పట్టించుకోవాలని ముఖ్యమంత్రికి సూచన. ఐదు నెలల్లోనే రాష్ట్రం వ్యవసాయ సంక్షోభంలో కూరుకుపోవడం ముమ్మాటికి ప్రభుత్వ పరిపాలన వైఫల్యమే. రాష్ట్రంలో రైతన్నల సమస్యలపై ముఖ్యమంత్రి వెంటనే ఒక ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించాలి" అని కేటీఆర్ ప్రభుత్వానికి సూచించారు.

కాంగ్రెస్ తెచ్చిన మార్పు లాఠీఛార్జేనా? - నిరంజన్ రెడ్డి

ఆదిలాబాద్ లో పత్తి విత్తనాల కోసం వచ్చిన రైతులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడాన్ని ఖండిస్తున్నానని మాజీ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పాలన గాలికి వదిలేసి మంత్రులు, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రులు ఇతర రాష్ట్రాల ప్రచారానికి వెళ్తారా .. ఇదెక్కడి అమానుషం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. "పత్తి విత్తనాలే కాదు.. ఎరువు కింద ఉపయోగించే జీలుగ విత్తనాల కోసం కూడా రైతులు ఆందోళనలు చేయాల్సి రావడం దురదృష్టకరం. జీలుగ విత్తనాలకే దిక్కులేదు.. ఇక అసలు విత్తనాలు ఇస్తారన్న నమ్మకం రైతులలో ఎలా కలిగిస్తారు?" అంటూ ప్రశ్నించారు.

"రైతులకు విత్తనాలు ఇవ్వలేని అసమర్ద కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి క్షమాపణ చెప్పాలి. ప్రభుత్వ అసమర్దత, నిర్లక్ష్యం కారణంగా మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. కాంగ్రెస్ వచ్చి రాష్ట్రంలో పాతరోజులు మళ్లీ తెచ్చింది.. విత్తనాలు, ఎరువుల కోసం ఈ మధ్యకాలంలో మళ్లీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి.. తాజాగా లాఠీఛార్జీలు మొదలయ్యాయి. కాంగ్రెస్ తెచ్చిన మార్పు లాఠీఛార్జేనా?" అని నిరంజన్ రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతుల పాలిట భస్మాసుర హస్తం కాంగ్రెస్....! -బీజేపీ

ఆదిలాబాద్ ఘటనపై బీజేపీ తెలంగాణ ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పై మాటల దాడి చేసింది. రైతులపాలిట కాంగ్రెస్ భస్మాసుర హస్తం అని ఆరోపించింది. "రైతులకు విత్తనాలు అందించలేని అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై అధికార మదంతో లాఠీ చార్జ్ చేయించడం సిగ్గుచేటు. ప్రజా పాలన అంటూ వెర్రి ప్రకటనలు చేస్తూ ప్రజలను అష్ట కష్టాలు పెడుతున్న రేవంత్ రెడ్డి సర్కార్ ఆరు నెలల్లోనే అసలు రంగు చూపెడుతుంది. నిన్న బీఆర్ఎస్ అయినా... నేడు కాంగ్రెస్ అయినా ఒకటే విధానం, ఆకలితీర్చే రైతును అడుగడుగునా అవమానించడమేనా? వాళ్లు సంకెళ్లు వేస్తే... వీళ్లు లాఠీలతో కొట్టారు" అని బీజేపీ ట్వీట్ చేసింది.

రైతులపై లాఠీ చార్జ్ జరపలేదు - ఆదిలాబాద్ ఎస్పీ

ఆదిలాబాద్ లో పత్తి విత్తనాల కొనుగోలు కోసం దుకాణాల వద్దకు వచ్చిన రైతులను పోలీసులు అడ్డుకున్నారని, చెదరగొట్టారన్నది అవాస్తవం అని ఆదిలాబాద్ ఎస్పీ తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. రైతుల బాగు కోసం ఎటువంటి అపాయం జరగకుండా, వారి క్షేమం కోసం సదుద్దేశంతో రైతులందరినీ ఒక క్రమబద్ధీకరణతో వరుస క్రమంలో ఏర్పాటు చేయడం కోసం పోలీసు సిబ్బంది బందోబస్తు విధులను నిర్వర్తిస్తుంటారని గ్రహించాలన్నారు. ఎటువంటి ఆందోళనకర పరిస్థితులు ఆదిలాబాద్ లో ఏర్పడలేదన్నారు. రైతులతో పోలీసులకు తీవ్ర వాగ్వాదం, తోపులాట అనేది జరగలేదని స్పష్టం చేశారు. పోలీసులు ఒక్క రైతుపై కూడా లాఠీచార్జ్ చేయడం అనేది జరగలేదన్నారు. అవాస్తమైన వార్తలను, స్క్రోలింగ్ లను ప్రచురించిన వారికి చట్టపరమైన చర్యలు తప్పవని ఆదిలాబాద్ ఎస్పీ హెచ్చరించారు.

Tags:    

Similar News