డిసెంబర్ 31 రూల్స్.. మందు బాబులకు అప్పటిదాకే ఛాన్స్..
డిసెంబర్ 31 వచ్చిందంటే మద్యం ఏరులై పారుతుంది. అర్థరాత్రి వరకు కుర్రకారు రోడ్లపై తిరగడం, లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లడం చేస్తుంటారు.
డిసెంబర్ 31 వచ్చిందంటే మద్యం ఏరులై పారుతుంది. అర్థరాత్రి వరకు కుర్రకారు రోడ్లపై తిరగడం, లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లడం చేస్తుంటారు. మరికొందరైతే భారీ ఖర్చుతో అంతకుమించిన భారీ పార్టీలు నిర్వహిస్తారు. డిసెంబర్ 31, అర్థరాత్రి 12 గంటల సమయంలో ఈ సంబరాలు తారాస్థాయికి చేరుకుంటాయి. బాణాసంచా కాల్చడం కూడా ఇందులోని భాగమే. ఆ తేదీకి మరెంతో సమయం లేదు. మరో మూడు రోజుల్లో 2024వ సంవత్సరం ముగిసి 2025 వస్తుంది. దీంతో ఇప్పటి నుంచి చాలా మంది తమ న్యూయిర్ పార్టీకి సన్నాహాలు ప్రారంభించేశారు. ఈ క్రమంలోనే పోలీసులు కూడా కీలక మార్గదర్శకాలను విడుదల చేశారు. న్యూ ఇయర్ అన్న సాకుతో అర్థరాత్రి వరకు తిరిగితే వీలుపడదని చెప్పేస్తున్నారు. బార్‌లు, రెస్టారెంట్లు, ఈవెంట్లు, టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ హోటల్స్ అన్నింటిలో కూడా నిర్ణీత సమయం వరకు క్రయవిక్రయాలు జరగాలని, ఆ తర్వాత అన్నీ బంద్ కావాలని పోలీసులు తేల్చి చెప్పారు.
ఈక్రమంలోనే తెలంగాణలో మద్యం అమ్మకాల వేళలను పెంచారు. తెల్లవారుజాము 1 గంట వరకు కూడా మద్యం అమ్మకాలు చేయొచ్చని, రెస్టారెంట్లు బిజినెస్ చేసుకోవచ్చని తెలిపారు పోలీసులు. అదే విధంగా పలు నిబంధనలను కూడా పెట్టారు. ఏ న్యూఇయర్ పార్టీలో కూడా డ్రగ్స్ వినియోగం జరగకూడదని, ఎక్కడైనా వీటి వినియోగం జరిగినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాంతో పాటుగా బార్‌లలో ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన మద్యం అమ్మకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పోలీసులు కూడా అలెర్ట్‌గా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. గ్రేటర్ పరిధిలో జరిగే కార్యక్రమాలు, పార్టీలపై ప్రత్యేక నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి సూచించారు.