‘HCUలో లాఠీ ఛార్జ్ జరగలేదు.. అవన్నీ అబద్ధాలే’

రోహిత్ ,నవీన్ కుమార్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించాం. వీళ్లిద్దరికీ క్యాంపస్ తో ఎలాంటి సంబంధం లేకపోయినా అక్కడ ఉండి అల్లర్లు సృష్టించారని చెప్పారు.;

Update: 2025-03-31 17:15 GMT

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. కాగా ఈ అంశంలో భాగంగా 400 ఎకరాల భూములను చదును చేస్తున్న ప్రభుత్వ పనులను అడ్డుకునేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. కాగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారన్న ప్రచారం జరుగుతోంది. ప్రతిపక్ష నేతలు కొందరు కూడా ఈ ఆరోపణలు చేశారు. విద్యార్థులపై లాఠీ ఝులింపించడం ఏమాత్రం సబబు కాదని అన్నారు. ఈ ప్రచారం జోరందుకుంటున్న క్రమంలో దీనిపై పోలీసులు స్పందించారు. ఈ మేరకు మాదాపూర్ డీసీపీ అధికారిక ప్రకటన విడుదల చేశారు. హెచ్‌సీయూ విద్యార్థులపై ఎటువంటి లాఠీ ఛార్జ్ జరగలేదని స్పష్టం చేశారు.

‘‘HCU లో విద్యార్థుల పై లాఠీ చార్జ్ జరగలేదు. విద్యార్థుల ను కొందరు బయటి వ్యక్తులు రెచ్చగొడుతున్నారు. నిన్న మధ్యాహ్నం 3:30 కు కంచె గచ్చిబౌలి లో పనులు జరుగుతుండగా బయటి వ్యక్తులు దాడులకు దిగారు. ప్రభుత్వ అధికారుల పై రాళ్ళు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. దాడిలో మాదాపూర్ acp శ్రీకాంత్ గాయపడ్డాడు. 53 మందిని అదుపులోకి తీసుకుని పర్సనల్ బాండ్ మీద వదిలేశాము. రోహిత్ ,నవీన్ కుమార్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించాం. వీళ్లిద్దరికీ క్యాంపస్ తో ఎలాంటి సంబంధం లేకపోయినా అక్కడ ఉండి అల్లర్లు సృష్టించారు’’ అని తెలిపారు.

‘‘పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేయటం తగదు. విద్యార్థులను హాస్టల్స్ నుండి అరెస్ట్ చేశారు అనడం అవాస్తవం. యూనివర్సిటీ విద్యార్థులు బయటి వ్యక్తుల ట్రాప్ లో పడవద్దు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాము’’ అని హెచ్చరించారు.

Tags:    

Similar News