సుంకిశాల రాజేసిన రాజకీయ చిచ్చు

ఇటీవల తెలంగాణలోని సుంకిశాల ప్రాజెక్టు రీటెయినింగ్ వాల్ కూలిపోవడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ చిచ్చు రాజుకుంది.

Update: 2024-08-09 10:39 GMT

ఇటీవల తెలంగాణలోని సుంకిశాల ప్రాజెక్టు రీటెయినింగ్ వాల్ కూలిపోవడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ చిచ్చు రాజుకుంది. ఈ ఘటనపై ఇరువర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఆగస్టు 2న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనపై మీ తప్పిదమే అంటే మీ తప్పిదమే అని రెండు పార్టీల నేతలు విమర్శలు చేసుకుంటున్నారు.

బీఆర్ఎస్ పాప‌మే..  

సుంకిశాల గోడ కూలడంపై గురువారం రాత్రి మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గత బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని నిందించారు. "సుంకిశాల ప్రాజెక్టును 11.06.2021 జులైలో నాటి కేసీఆర్ ప్ర‌భుత్వం అగ్రిమెంట్ చేసుకుంది. టన్నెల్ సైడ్ వాల్ ని జులై 2023 పూర్తి చేశారు. అంటే ఇది ఎవ‌రి హ‌యాంలో మొద‌లు పెట్టి.. ఎవ‌రి హ‌యాంలో పూర్తి చేశారో అంద‌రూ తెలుసుకోవాలి. సుంకిశాల ప్రాజెక్టు కాంగ్రెస్ క‌ట్టింది కాదు.. మా హ‌యాంలో మొద‌లు పెట్టింది కాదు. మేడిగ‌డ్డ‌, అన్నారం, సుందిళ్ల‌తో పాటు సుంకిశాల కూడా బీఆర్ఎస్ పాప‌మే. బీఆర్ఎస్ హ‌యాంలో మొద‌లు పెట్టిన మిగిలిన నిర్మాణాల ప‌రస్థితి కూడా భ‌విష్య‌త్తులో తేలుతుంది అని భట్టి విక్రమార్క అన్నారు.

రాష్ట్ర ప్ర‌జ‌ల సొమ్మును ఏ ర‌కంగా దుర్వ‌నియోగం చేశారో ఇవ‌న్నీ చూస్తుంటే అర్థం అవుతోంది. ఒళ్లు గ‌గుర్పొడిచేలా కూలిపోయే నిర్మాణాల‌ను బీఆర్ఎస్ చేసిందని భట్టి ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో డిజైన్ల లోపంతో నిర్మించిన సుంకిశాల గోడలు కూలిపోతే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు.. కాంగ్రెస్ రాగానే కూలిందని గత పాలకులు పత్రిక, టీవీ ఛానల్ లో సుంకిశాల పాపం వేరొకరిని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నాడు సంపాదించిన అక్రమ సంపాదన ఉందని సోషల్ మీడియాలో ఎవరిదో ఈ పాపం ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారు.. తెలంగాణ ప్రజలు ఇప్పటికే గట్టిగా బుద్ధి చెప్పారు మరోసారి లేవకుండా చేస్తారని గులాబీ పార్టీని హెచ్చరించారు. సుంకిశాల సైడ్ వాల్ కూలిన ఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారని, దోషులు ఎవరో తేలుస్తామని భట్టి స్పష్టం చేశారు.

సీఎం కి తెలియదంటే సిగ్గుచేటు..

సుంకిశాల రిటెయినింగ్‌ వాల్ కూలిపోయిన ఘటనపై నేడు కేటీఆర్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్లే గోడ కూలిందని అధికార పార్టీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. మంచి జరిగితే మీ ఖాతాలో వేసుకుంటారు, చెడు జరుగుతే ఇతరుల మీద బురద చల్లుతారా?? అని కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. "అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నాడు ఆగస్టు రెండున ఈ సుంకిశాల ప్రాజెక్టు ప్రమాదం జరిగింది. అసెంబ్లీ గౌరవ సాంప్రదాయాల ప్రకారం రాష్ట్రంలో ఏ మంచి జరిగినా లేదా ఏ చెడు జరిగినా అసెంబ్లీలో సభ్యులందరికీ తెలియజేయాలి. కానీ ఎవరికీ తెలియకుండా దీన్ని తొక్కి పెట్టారా లేక ముఖ్యమంత్రి గారికి తెలియదా.. ముఖ్యమంత్రికి తెలియదు అంటే మాత్రం అంతకన్నా సిగ్గుచేటు మరొకటి ఉండదు" అని కేటీఆర్ విమర్శించారు.

హైదరాబాద్ త్రాగునీటి అవసరాలు తీర్చడానికి మేము కొంచెం వేగంగా సుంకిశాల ప్రాజెక్టు పనులు చేశాం.. మేము దిగేనాటికి అక్కడ మోటర్లు ఫిట్టింగ్ జరుగుతున్నది.. మా ప్రభుత్వం దిగిపోయాక అక్కడ పనులన్నీ ఆగిపోయాయి.. మా ప్రభుత్వం మళ్లీ వచ్చుంటే మేము 2024 మార్చి, ఏప్రిల్ వరకు పనులు కంప్లీట్ చేసి హైదరాబాద్ నగర వాసుల త్రాగునీటి కష్టాలు తీర్చాలి అని చూశాం అని కేటీఆర్ తెలిపారు. ఈ ప్రభుత్వం చేతగానితనం వల్ల, మొద్దు నిద్రలో ఉండటం వల్ల సుంకిశాల ప్రాజెక్ట్ పనులు అటకెక్కాయని ఆయన మండిపడ్డారు. 

కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కయ్యాయని మరోసారి స్పష్టం అవుతోందని కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం మీద మేడిగడ్డ మీద వచ్చిన ఎన్డీఎస్ఏ, కేంద్ర సంస్థలు సుంకిశాల మీద దర్యాప్తుకు ఎందుకు రావడం లేదు అని నిలదీశారు. సుంకిశాల ఘటన మీద ఒక్క బీజేపీ నేత కూడా ఎందుకు మాట్లాడటం లేదు అని ప్రశ్నించారు. దీనిపై ఒక జ్యుడీషియల్ ఎంక్వైరీ వేయండి, ఆ నిర్మాణ సంస్థను బ్లాక్ లిస్ట్‌లో పెట్టండి అని కేటీఆర్ ప్రభుత్వానికి సూచించారు.

కూలిపోయిన సుంకిశాల రిటెయినింగ్‌ వాల్

నాగార్జున సాగర్ వద్ద ఈ నెల 2న 50 మీటర్ల సుంకిశాల ప్రాజెక్ట్ రిటెయినింగ్‌ వాల్ కూలిపోయింది. కూలీలు షిఫ్టు మారే సమయంలో జరగడంతో పెనుప్రమాదం తప్పింది. ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఘటన జరిగిన వారం రోజుల వరకు విషయం బయటకి తెలియకపోవడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల నిర్యక్ష్యం.. నాగార్జునసాగర్‌కు లక్షల క్యూసెక్కుల వరద వస్తుండటం, నీటిమట్టం కూడా భారీగా ఉన్న సమయంలో రక్షణ గోడ వెనక గేటును ఏర్పాటు చేసి… సొరంగాన్ని పూర్తిస్థాయిలో ఓపెన్‌ చేయడం వల్లనే ప్రమాదం జరిగిందనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.

హైదరాబాద్ తాగు నీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్‌ జలాశయం డెడ్‌ స్టోరేజీ నుండి కృష్ణాజలాల తరలింపు కోసం సుంకిశాల ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించారు. సొరంగాల్లోకి సాగర్‌ జలాలు రాకుండా ఉండేందుకు రక్షణగా రిటెయినింగ్‌ వాల్‌ నిర్మించారు. ఇది ఒక్కసారిగా కుప్పకూలడంతో వరదనీరు చేరి సుంకిశాల పంపుహౌస్‌ నీట మునిగింది. దీంతో నీరు తగ్గే వరకు పూర్తి స్థాయిలో నష్టాన్ని అంచనా వేయడం కష్టమని భట్టి పేర్కొన్నారు. కాగా, ఇక్కడ మూడు షిఫ్టుల్లో వందల మంది కూలీలు పనిచేస్తుంటారు. సరిగ్గా కూలీలు షిఫ్టు మారే సమయంలో ఈ ప్రమాదం జరగడంతో అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు.




Tags:    

Similar News