కేటీఆర్, లోకేష్ రహస్య భేటీ ?

వారిద్దరు రహస్యంగా ఒకటి కాదు, రెండు సార్లు సమావేశం అయ్యారంటూ తెలంగాణ కాంగ్రెస్ నేత ఆరోపణలు చేశారు;

Update: 2025-07-07 08:32 GMT

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి , ఏపీ మంత్రి నారా లోకేష్ రహస్యంగా భేటీ అయ్యారా..?తెలంగాణ రాజకీయాలలో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.వారిద్దరు రహస్యంగా ఒకటి కాదు, రెండు సార్లు సమావేశం అయ్యారంటూ తెలంగాణ కాంగ్రెస్ నేత ఆరోపణలు చేశారు. లోకేష్ తో భేటీ వెనుక రహస్యాన్ని బైట పెట్టాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ మధ్య బనకచర్ల వివాదం కొనసాగుతున్న నేపధ్యంలో లోకేష్ తో కేటీఆర్ మంతనాలు జరిపారన్నవార్తలు కాక పుట్టిస్తున్నాయి. తెలంగాణ ప్రయోజనాల కోసం ఏపీని పూర్తిగా వ్యతిరేకించాల్సిన తరుణంలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఎలా సమావేశం అవుతారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.అసలు కేటీఆర్ ,లోకేష్ లు నిజంగానే సమావేశం అయ్యారా అయితే దేనిపై చర్చించారన్న ఉత్కంఠ అందరిలో కొనసాగుతోంది.కాంగ్రెస్ నేత కాంగ్రెస్ నేత సామా రామ్మోహన్ రెడ్డి వీరిద్దరి భేటీపై ఆరోపణలు చేయడమే కాదు,కేటీఆర్ ఈవిషయంపై స్పందిస్తే, తాను మిగిలిన విషయాలు వెల్లడించేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పుకొచ్చారు.వారెక్కడ సమావేశం అయిందీ , ఎన్నిసార్లు కలిసిందీ బైటపెడతానంటూ సామా సవాల్ విసిరారు.
జూబ్లీహిల్స్ పైనే చర్చా?
లోకేష్ తో కేటీఆర్ మంతనాల వెనుక ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అంశం వుందంటున్నారు.బనకచర్ల విషయం అట్లుంచినా గోపీనాధ్ మరణంతో త్వరలో జరగనున్న జాబ్లీహిల్స్ ఉపఎన్నిక తెలంగాణలో అధికారంలో వున్న కాంగ్రెస్ ,ప్రతిపక్ష బీఆర్ఎస్ లకు ప్రతిష్టాత్మకంగా మారింది.తమ స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలని గులాబీ పార్టీ భావిస్తుండగా ,ఎలాగైనా గెలుచుకొని తీరుతామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలుపు కాంగ్రెస్ దే నని ముఖ్యమంత్రి రేవంత్ కూడా బీఆర్ఎస్ కు సవాలు విసరడంతో ఈ ఎన్నిక రెండు పార్టీలకూ కీలకంగా మారింది. ఈ నేపధ్యంలోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కొంత బలమున్న తెలుగుదేశం పార్టీని పోటీకి దూరంగా వుంచి, లోపాయికారీగా ఆపార్టీ సహకారం పొందే క్రమంలోనే కేటీఆర్ , లోకేష్ చర్చలు జరిగాయంటున్నారు.
గోపీనాధ్ గతంలో ఇదే నియోజకవర్గం నుంచి తెలుగుదేశం టిక్కెట్ పై గెలిచారు.ఆ తరువాత బీఆర్ఎస్ లో చేరి మల్లీ జూబ్లీహిల్స్ నుంచే గెలుపొందారు. సామాజిక వర్గం పరంగా , సెటిలర్స్ ఓట్ల పరంగా తెలుగుదేశం మద్దతు గోపీనాధ్ కు కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు గోపీనాధ్ మరణంతో ఆ స్థానంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నిలుపడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని , మిత్రపక్షం బీజేపీతోనూ ఈ విషయం చర్చిస్తున్నారని వార్తలు వచ్చాయి.గోపీనాథ్ మరణం సమయంలోనూ లోకేష్ నివాళి అర్పించారు. గోపీనాధ్ కుటుంబ సభ్యులను హైదరాబాద్ వచ్చి పరామర్శించారు.గోపీనాధ్ కుటుంబ సభ్యులకు కూడా టీడీపీ నేతలతో మంచి సంబంధాలు వున్నాయి.ప్రతిష్టాత్మకంగా వుండబోతున్న ఉపఎన్నికలో గోపీనాధ్ కుటుంబసభ్యులనే పోటీకి నిలబెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది.అందుకే టీడీపీ సహకారం వుంటే మళ్లీ తమ స్థానాన్ని దక్కించు కోవచ్చని బీఆర్ఎస్ భావిస్తోందని అందుకే లోకేష్ తో కేటీఆర్ చర్చించారని అనుమానిస్తున్నారు.
కాంగ్రెస్ నేత సామా రామ్మోహన్ కామెంట్స్ పైన ఇప్పటి వరకు కేటీఆర్ మద్దతుదారులుగాని , అటు తెలుగుదేశం నేతలు గాని స్పందించలేదు.అయితే కేటీఆర్ ప్రయత్నించినా , లోకేష్ మాత్రం కేటీఆర్ ను నేరుగా కలిసేందుకు సుముఖత వ్యక్తం చేయలేదని కూడా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఏదైనా వీరిద్దరి సమావేశం ఎక్కడ జరిగిందీ, ఏంటన్నవివరాలను కాంగ్రెస్ నేత సామా బైట పడతారో లేక ఏదో గాలిలో రాయి విసిరారో తెలియాలి. ఏదైనా జూబ్లీహిల్స్ కు జరగనున్న ఉప ఎన్నిక మాత్రం బీఆర్ ఎస్ కు పెద్ద సవాలుగానే మారింది.
Tags:    

Similar News