Nizamabad | పసుపుబోర్డు కేంద్రంగా మళ్లీ రాజుకున్న రాజకీయ రగడ
నిజామాబాద్ లో మళ్లీ పసుపుబోర్డు కేంద్రంగా రాజకీయ రగడ రాజుకుంది.బడ్జెట్‌లో నిధులివ్వలేదని కవిత విమర్శలు గుప్పిస్తుండగా, గంగారెడ్డి వాటిని తిప్పికొట్టారు.;
By : Saleem Shaik
Update: 2025-02-02 08:22 GMT
దశాబ్దాలుగా జాతీయ పసుపుబోర్డు పేరిట సాగిన రాజకీయ రగడ కేంద్రం బోర్డు ఏర్పాటుతో తెరపడిందనుకుంటే, నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు కేంద్రంగా మళ్లీ రాజకీయ రగడ ఆరంభమైంది. నిజామాబాద్ నగరంలోని అద్దె భవనంలో తాత్కాలికంగా జాతీయ పసుపుబోర్డును కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇటీవల ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు.
- నిజామాబాద్ కేంద్రంగా జాతీయ బోర్డు ప్రారంభంతో పసుపు రైతులు సంతోషం వ్యక్తం చేశారు. పసుపు బోర్డుపై రాజకీయ పార్టీ నేతల మధ్య ఇన్నాళ్లు సాగిన విమర్శలు, ప్రతి విమర్శలకు తెరపడిందనుకున్నాం. కానీ మళ్లీ శనివారం పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో పసుపుబోర్డుకు నయాపైసా నిధులు కూడా కేటాయించలేదు.
పసుపు బోర్డుకు మాత్రం గుండు సున్నా : ఎమ్మెల్సీ కవిత విమర్శ
కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ జాతీయ పసుపుబోర్డును నిజామాబాద్ కేంద్రంగా ప్రారంభించినా, 2025-26 కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించలేదని,పసుపు బోర్డుకు మాత్రం గుండు సున్నా చూపించారని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శనాస్థ్రాలు సంధించారు. టీ బోర్డుకు రూ.771 కోట్లు, కాఫీ బోర్డుకు రూ.280 కోట్లు, రబ్బరు బోర్డుకు రూ.360కోట్లు, స్పైసెస్ బోర్డుకు రూ.153 కోట్లు కేటాయించి, కొత్తగా ప్రారంభించిన పసుపు బోర్డుకు రిక్త హస్తం చూపించారని కవిత విమర్శించారు. దేశంలోని అన్ని బోర్డులకు కేంద్ర బడ్జెట్ లో నిధులిచ్చి పసుపుబోర్డుకు మాత్రం గుండు సున్నా చూపించారని కవిత విమర్శలు ఎక్కుపెట్టారు.
కవిత ఆరోపణలను తిప్పికొట్టిన గంగారెడ్డి
జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన పల్లె గంగా రెడ్డి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శలను తిప్పికొట్టారు. కేంద్ర బడ్జెట్ లో పసుపుబోర్డుకు కేటాయింపులు లేకపోయినా, కొత్తగా ప్రారంభించిన పసుపుబోర్డుకు కేంద్ర వాణిజ్య శాఖ నిధుల నుంచి రూ.40కోట్లను కేటాయించాలని తాము కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ను కోరామని, ఈ మేరకు ప్రతిపాదనలు కూడా బోర్డు నుంచి పంపించామని పల్లె గంగారెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. తమ ప్రతిపాదనల మేర కేంద్రం పసుపుబోర్డుకు రూ.40కోట్లు ఇచ్చేందుకు అంగీకరించిందని పసుపుబోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి ఢిల్లీ నుంచి ‘ఫెడరల్ తెలంగాణ’ తో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. పసుపుబోర్డు కొత్తగా ఏర్పాటైనందున దీనికి విధి విధానాలను తాము రూపొందిస్తున్నామని గంగారెడ్డి వివరించారు.
పసుపు రైతులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నాం...
పసుపు రైతులకు పసుపుబోర్డు పక్షాన ప్రోత్సాహకాలు ఇస్తున్నామని జాతీయ పసుపుబోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి చెప్పారు. పసుపు రైతులకు సబ్సిడీపై బాయిలర్లు, పాలిషర్లు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రైతు సంఘాలకు 90 శాతం సబ్సిడీతో పాలిషర్లు, బాయిలర్లు ఇస్తామని చెప్పారు. నిజామాబాద్ లో పసుపుబోర్డు కార్యాలయ భవనం నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. గతంలో ఎమ్మెల్సీ కవిత పసుపుబోర్డు కోసం ఢిల్లీలో ప్రయత్నిస్తున్నానని చెప్పి ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించి జైలు పాలయ్యారని గంగా రెడ్డి ఆరోపించారు. తాము పసుపు బోర్డును ఏర్పాటు చేశాక కూడా ఇంకా విమర్శలు గుప్పించడంలో అర్థం లేదన్నారు. పసుపు రైతుల సంక్షేమానికి తాము కృషి చేస్తానని గంగారెడ్డి వివరించారు.
జాతీయ వార్తల్లో నిలిచిన పసుపు బోర్డు
దేశంలో నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటైన జాతీయ పసుపు బోర్డు జాతీయ వార్తల్లో నిలిచింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి ప్రారంభించిన జాతీయ పసుపు బోర్డు యూపీఎస్సీ పరీక్షల్లో కరెంట్ టాపిక్ గా మారింది. ఈ పసుపు బోర్డు ఛైర్మన్ గా పల్లె గంగారెడ్డిని నియమించడం వార్తల్లోకి ఎక్కింది. పసుపు ఉత్పత్తి పెంచడం, ఎగుమతుల్లో పసుపు నాణ్యతను పెంచడం ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు పసుపు రైతులకు ప్రయోజనం కల్పించేందుకు కేంద్రప్రభుత్వం జాతీయ పసుపు బోర్డును కేంద్రం ఏర్పాటు చేసింది. పసుపుబోర్డు జాతీయ వార్తల్లోకి ఎక్కిన విషయాన్ని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎక్స్ సోషల్ మీడియా లో వీడియో పోస్టు పెట్టారు.
National Turmeric Board —
— Arvind Dharmapuri (@Arvindharmapuri) February 1, 2025
In National News & UPSC Current Affairs pic.twitter.com/zR4CPxFt0p