ప్రమాదంలో మహిళల భద్రత.. చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఫార్మాలిటీస్ పేరుతో పోలీసులు కావాలనే బాధితురాలిని తరలించడంలో జాప్యం చేస్తున్నారన్న బీజేపీ నాయకురాలు శిల్పారెడ్డి. కేంద్రమంత్రికి కేటీఆర్ విజ్ఞప్తి.;
మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు రోజురోజుకు అధికమవుతున్నాయి. మహిళలకు భద్రత కల్పించడానికి ప్రభుత్వం, భద్రతా బలగాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సరే.. వీటికి బ్రేకులు పడటం లేదు. తాజాగా ఎంఎంటీఎస్ రైతులో ఓ యువతిపై కొందరు అత్యాచారానికి పాల్పడ్డారు. వారిని నుంచి తప్పించుకోవడం కోసం సదరు యువతి చేసేదేమీ లేక.. రైలు నుంచి బయటకు దూకేసింది. ఈ ఘటనలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సదరు యువతికి గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సబిత ఇంద్రారెడ్డి.. సదరు యువతిని పరామర్శించారు. ఈ ఘటనను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. ఈ ఘటనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని, యువతిపై అత్యాచారానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కేంద్ర మంత్రికి కేటీఆర్ విజ్ఞప్తి
ఎంఎంటీఎస్ రైలు ఘటనపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు కేటీఆర్ కీలక విజ్ఞప్తి చేశారు. అత్యాచారయత్నం నుంచి తనను తాను కాపాడుకోవడం కోసం ఓ యువతి రైలు నుంచి దూకేసిన ఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తును వేగవంతం చేయాలని రైల్వే పోలీసులకు ఆదేశాలివ్వాలని కేంద్ర మంత్రిని కేటీఆర్ అభ్యర్థించారు. తెలంగాణ పోలీసులు, మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ కొండా సురేఖ కూడా బాధితురాలికి అన్ని విధాలా అండగా ఉండాలని కోరారు. ఈ ఘటన రైల్వే పోలీసుల పరిధిలో ఉన్నప్పటికీ, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి మేల్కొలుపు లాంటిది అని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కనుమరుగయ్యాయని, వాటిని కాపాడటానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
పోలీసులు కావాలనే జాప్యం: బండి
ఎంఎంటీఎస్ ఘటన బాధితురాలికి బీజేపీ ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్ ఫోన్ చేసి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. ఆమెకు మెరుగైన వైద్యించడంలో జాప్యం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెరుగైన చికిత్స కోసం యశోద ఆసుపత్రికి తరలిస్తామని హామీ ఇచ్చారు. సంజయ్ సూచన మేరకు బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి.. గాంధీ ఆసుపత్రికి వచ్చారు. బాధితురాలిని యశోద ఆసుపత్రికి తరలించడానికి సిద్ధమయ్యారు. కానీ ఫార్మాలిటీస్ పేరుతో పోలీసులు కావాలనే బాధితురాలిని తరలించడంలో జాప్యం చేస్తున్నారని విమర్శించారు.
సీఎం చేతగాని తనమే కారణం: హరీష్
‘‘ఎంఎంటిఎస్ రైలులో ఉద్యోగిని పై జరిగిన అత్యాచారయత్నం ఘటన యావత్ తెలంగాణ సమాజాన్ని కలిచివేసింది.హోంమంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో శాంతి భద్రతలు పడిపోవడానికి మీ చేతగాని పాలనే కారణం. రాష్ట్ర రాజధానిలో ఇలాంటి దారుణాలు జరుగుతుంటే, ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం, రైల్వే సిబ్బంది ఏం చేస్తున్నట్లు? ఆ కీచకుడి నుండి తనను తాను కాపాడుకోవడం కోసం రైలు నుంచి దూకి తీవ్రంగా గాయపడి, గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ ఆడబిడ్డ దీన స్థితికి ఎవరు బాధ్యులు? ఇందిరమ్మ రాజ్యంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారడం సిగ్గుచేటు. గతేడాదితో పోలిస్తే, ఈ ఏడాదిలో అత్యాచారం కేసులు 29% పెరుగుదలతో 2945 కేసులు నమోదైనట్లు సాక్షాత్తు డిజిపి గారు ప్రకటించారు. అంటే సగటున ప్రతి నెలా 250 అత్యాచార కేసులు నమోదవుతున్న దారుణమైన పరిస్థితి. ప్రతీ రోజూ రాష్ట్రంలో మహిళలలు అత్యాచారాలు, హత్య, వేధింపులకు గురవుతుంటే ప్రభుత్వం చేతులు ముడుచుకు చూస్తున్నది. మహిళలకు భద్రత కల్పించడంలో దారుణంగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. హోంమంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో శాంతి భద్రతలు పడిపోవడానికి మీ చేతగాని పాలనే కారణం. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని ప్రగల్బాలు పలకడం కాదు, ముందు మహిళల ప్రాణాలకు భద్రత కల్పించండి’’ అని హరీష్ రావు డిమాండ్ చేశారు.
మహిళలకు భద్రత కరువైంది: సబిత
‘‘ఎంఎంటీఎస్ ట్రైన్ లో బాధితురాలపై అత్యాచారం యత్నం జరిగింది. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైంది. మహిళ కోచ్ లోకి నిందితుడు ప్రవేశించి అత్యాచారం యత్నం చేశాడు. ఆగంతుకుడు నుండి తప్పించుకునేందుకు బాధితురాలు ట్రైన్ నుండి కిందకు దూకింది. అమ్మాయికి గాయాలు పాలై చికిత్స జరుగుతుంది. బస్సులో , ట్రైన్స్ లో కూడా మహిళలు భద్రత కరువైంది. మహిళలు పై అత్యాచారం కేసులు, క్రైమ్ రేట్ 22 శాతం పెరిగినట్లు నివేదికలు చెపుతున్నాయి. మహిళల భద్రత పై రాష్ట్ర పోలీసులు చర్యలు తీసుకోవాలి. బాధితురాలను ప్రభుత్వం ఆదుకోవాలి. రాష్ట్రంలో షీ టీమ్స్ ఏమి చేస్తున్నాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్ ను రాజకీయ వేదిక చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ పోలీసులకు వదిలేయాలి. లక్ష కెమెరాలు కమాండ్ కంట్రోల్ నుండి పర్యవేక్షణ చేయవచ్చు. కానీ సెక్రటేరియట్ లో జరగాల్సిన కార్యకలాపాలు కమాండ్ కంట్రోల్ లో చేస్తున్నారు. కమాండ్ కంట్రోల్ ను పోలీసులకు కి అప్పగించి, శాంతి భద్రతలు కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని సబిత ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
ప్రభుత్వ వైఫల్యమే కారణం : కవిత
మహిళల భద్రతపై ప్రభుత్వం మెరుగైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కోరారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని, మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మహిళల భద్రతపై మేము ప్రభుత్వాన్ని పలుసార్లు హెచ్చరించారు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి ఇప్పుడు ఎంఎంటీఎస్‌లో జరిగిన ఘటన నిదర్శనం. మరో యువతి తన మానం కాపాడుకోవడానికి ప్రాణాన్ని పణంగా పెట్టి.. రైలు నుంచి దూకేసింది. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి’’ అని కవిత డిమాండ్ చేశారు.