Davos | దావోస్‌లో రేవంత్‌ను కలిసిన ప్రణీత పరమానందం
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభిమాని అయిన తెలంగాణ బాలిక ప్రణీత కలిసి పరమానంద భరితురాలైంది.;
By : The Federal
Update: 2025-01-24 03:47 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటుండగా గురువారం ఆయనను అనుకోని ఓ ఆత్మీయ అతిథి కలిసింది. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికగా పెట్టుబడుల సమీకరణలో ముఖ్యమంత్రి వేల కోట్ల రూపాయల పెట్టుబడులను తెలంగాణకు సాధించి రికార్డు నెలకొల్పారు.
- స్విట్జర్లాండ్ దేశంలో తెలంగాణకు చెందిన పదహారేళ్ల ప్రణీత 11వ తరగతి చదువుతుంది. విద్యార్థిని ప్రణీత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఎంతో అభిమానిస్తుంది.
దావోస్ లో కలిసిన రేవంత్ అభిమాని
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం దావోస్ పర్యటనకు వచ్చారని తెలుసుకొని, ఆయనను కలిసి తన అభిమానాన్ని వ్యక్తపరచాలని స్విస్ లో చదువుకుంటున్న తెలంగాణ విద్యార్థిని ప్రణీత నిర్ణయించుకుంది. అంతే ప్రతికూలమైన మైనస్ ఉష్ణోగ్రత, చలిని తట్టుకుని ప్రణిత తన తండ్రితో కలిసి దావోస్‌కి 300 మైళ్ళ ప్రయాణం చేసింది.దావోస్ వచ్చి రేవంత్ రెడ్డిని కలిసిన ప్రణీత ఆనందంతో ఉక్కిరిబిక్కిరైంది. ప్రణీత సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన మిషన్‌లకు ఆత్మీయ అభిమాని అయింది.
సీఎం మూసీ ప్రక్షాళనపై ప్రణీత అభినందన
ప్రకృతిని, పర్యావరణాన్ని ప్రేమించే ప్రణీత సీఎం పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను అభినందించింది. హైదరాబాద్‌ను కాలుష్యరహిత నగరంగా మార్చాలని సీఎం తీసుకుంటున్న చర్యలు, మూసీ నదిని శుభ్రపరచడం, విద్యుత్ వాహనాల ప్రోత్సాహానికి తీసుకున్న చర్యలతో తాను ప్రభావితమయ్యానని ప్రణీత పేర్కొంది. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రణీత వీడియోతో తెలంగాణ సీఎంఓ అసిస్టెంట్ డైరెక్టర్ జాకోబ్ రాస్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ పోస్టులు పెట్టింది. ఈ సోషల్ మీడియా పోస్టులకు నెటిజన్లు లైక్ లు, షేర్ లు చేశారు. దావోస్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి బృందం చేసిన కృషితో తెలంగాణ 1,78,950 కోట్ల పెట్టుబడులు సాధించిందని జాకోబ్ రాస్ ట్వీట్ చేశారు.
సీఎం రేవంత్ కు ఘనస్వాగతం
దావోస్ పర్యటనను ముగించుకొని తెలంగాణకు అత్యధికంగా పెట్టుబడులు సాధించి శుక్రవారం ఉదయం శంషాబాద్ లోని విమానాశ్రయానికి తిరిగివచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పలువురు నేతలు సీఎం రేవంత్ ను అభినందించారు.