ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరామ్..గవర్నర్ కోటాలో ఎంపిక

Update: 2024-01-25 11:35 GMT

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించ ప్రొఫెసర్ కోదండ రామ్ గవర్నర్ కోటా లో ఎమ్మెల్సీగా నియమితులయ్యారు. కోదండరామ్ తో పాటు సియాసత్ పత్రిక మాజీ ఎడిటర్ అయిన అమీర్ అలీఖాన్ ను సైతం ఎమ్మెల్సీగా ప్రభుత్వం నామినేట్ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు వెళ్లడానికంటే ముందే ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ఎన్నికకు సంబంధించిన ఫైల్ ను రాజ్ భవన్ కు పంపింది. వీటిని పరిశీలించిన గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఈ రోజు ఆమోదించారు.

తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ(టీజాక్) చైర్మన్ గా ఫ్రొపెసర్ కోదండరాం పనిచేశారు. పల్లెపల్లెకు ఉద్యమాన్ని చేర్చి, దానిని సజీవంగా ఉంచడానికి పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీలు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలను ఒక్కతాటిపై నడిపించడంలో కీలకంగా వ్యవహరించారు. తెలంగాణ సాకారం తరువాత తెలంగాణ జనసమితిని స్థాపించారు. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో ఒంటరిగా పోటీ చేసి ఓట్లను చీల్చే బదులు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ గెలవగానే ఆయనను ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది.

అలాగే లీక్ లతో పరువు పొగొట్టుకున్న టీఎస్పీఎస్సీ కు నూతన చైర్మన్ గా మాజీ పోలీస్ బాస్ ఎం. మహేందర్ రెడ్డి నియమాకానికి సంబంధించిన ఫైల్ పై గవర్నర్ సంతకం చేశారు. బోర్డు సభ్యులగా రిటైర్డ్ ఐఏఎస్ అనిత రాజేంద్ర, పాల్వాయి రజనీ కుమారి, అమీర్ ఉల్లా ఖాన్, యాదయ్య, వై . రామ్ మోహన్ రావు నియమితులైయ్యారు. టీఎస్పీపీఎస్సీ చైర్మన్ పోస్ట్ కోసం 370 వరకు దరఖాస్తులు రాగా, ప్రభుత్వం సెర్చ్ కమిటీని నియమించింది. కమిటీ వేగంగా దరఖాస్తుల పరిశీలన చేపట్టి, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును ప్రభుత్వానికి సూచించింది. ఈ ఫైల్ ను గవర్నర్ కు పంపగా ఆమె ఆమోదించారు.  

Tags:    

Similar News