కాయ్ రాజా కాయ్..రెడీగా ఉన్న బెట్టింగ్ రాయళ్ళు

క్రికెట్ కు బెట్టింగులున్నట్లే ఇపుడు ఎన్నికల్లో గెలుపోటములపైన కూడా బెట్టింగుల జోరు పెరిగిపోతోంది. తెలుగురాష్ట్రాల్లో బెట్టింగులు మనకు ప్రత్యేకం.

Update: 2024-04-04 05:30 GMT
Betting money (source : Twitter)

పంటలకు సీజన్లున్నాయి. పండ్లకూ సీజన్లున్నాయి. వర్షాకాలం, వేసవికాలం, చలికాలం కూడా సీజన్ల ప్రకారమే వస్తాయి. ప్రతిదానికి ఒక సీజన్ ఉన్నట్లే బెట్టింగులకు కూడా సీజన్ ఉంది. అదేమిటంటే ఎన్నికల సీజన్. క్రికెట్ కు బెట్టింగులున్నట్లే ఇపుడు ఎన్నికల్లో గెలుపోటములపైన కూడా బెట్టింగుల జోరు పెరిగిపోతోంది. దేశమంతా ఇదే వ్యవహారం నడుస్తున్నా తెలుగురాష్ట్రాలు మనకు ప్రత్యేకం. ఇప్పుడిప్పుడే రెండురాష్ట్రాల్లోను బెట్టింగులు మొదలవుతున్నాయి. బెట్టింగుల్లో అది కాయచ్చు ఇది కాయచ్చనేదేమీ లేదు. ఏదిపడితే ఆ అంశంపైనే పందెం కాయచ్చు.

ఫలానా నియోజకవర్గంలో ఎవరికి టికెట్ వస్తుంది అనే విషయంలో కూడా బెట్టింగులు నడుస్తుంటాయి. ఉదాహరణకు నరసాపురం పార్లమెంటులో రఘురామకృష్ణంరాజుకు టికెట్ వస్తుందని కొందరు పందెం కడితే రాదని మరికొందరు పందేలు కడతారు. పలానా అసెంబ్లీ సీటు పలానా పార్టీకి దక్కుతుందని బెంట్టింగు కడితే రాదని మరికొందరు పందేలు కడతారు. విశాఖపట్నం జిల్లాలోని భీమిలీలో ఏ పార్టీ పోటీచేస్తుంది ? టికెట్ ఎవరికి దక్కుతుంది, తిరుపతిలో పోటీచేయబోయే పార్టీయేది ? అభ్యర్ధి ఎవరు అనే అంశాలపైన కూడా బెట్టింగులు జరుగుతున్నాయి. అయితే ఇలాంటి బెట్టింగులన్నీ చాలా తక్కువ మొత్తంతోనే జరుగుతున్నాయి. కడప, నెల్లూరు, నరసాపురం, ఏలూరు, రాజమండ్రి, గుంటూరు, విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీచేసే అభ్యర్ధులు, గెలుపోటములపైన బెట్టింగులు ఇపుడిపుడే మొదలవుతున్నట్లు సమాచారం.

ప్రాంతాలవారీగా కూడా బెట్టింగులు మొదలయ్యాయి. అంటే రాయలసీమలో వైసీపీకి ఎన్నిసీట్లొస్తాయి, టీడీపీ కూటమికి రాబోయే సీట్లెన్ని అనే అంశంపైన బెట్టింగులు మొదలయ్యాయి. ఉత్తరాంధ్రలో కూటమికి ఎక్కువ సీట్లొస్తాయా ? వైసీపీకే మెజారిటి సీట్లు దక్కుతాయా అన్నది కూడా బెట్టింగ్ అంశమే. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెలుపోటములపైన కూడా బెట్టింగులు మొదలయ్యాయి. అలాగే పవన్ గెలుపుకు టీడీపీ మాజీ ఎంఎల్ఏ ఎన్వీఎస్ఎన్ వర్మ సహకరిస్తారని కొందరు, లేదు లేదు సహకరించరని మరికొందరు పందేలు కడుతున్నారని సమాచారం. ఇపుడు మొదలైన బెట్టింగులన్నీ చాల చిన్నమొత్తాల్లోనే జరుగుతున్నట్లు ఒక బెట్టింగ్ రాయుడు చెప్పారు. పెద్దమొత్తాల్లో బెట్టింగులు మొదలవ్వాలన్నా, ఊపందుకోవాలన్నా నామినేషన్ల ప్రక్రియ మొదలవ్వాలన్నారు. ఎందుకంటే నామినేషన్లు వేసేలోగా అభ్యర్ధులను పార్టీలు మార్చేసే అవకాశాలున్నాయి కాబట్టి. అందుకనే బెట్టింగ్ రాయళ్ళంతా నామినేషన్లు ఎప్పుడు మొదలవుతాయా అని ఎదురుచూస్తున్నారు.

సదరు బెట్టింగ్ రాయుడి ప్రకారం కొద్దిరోజుల క్రితంవరకు వైసీపీకి 74 సీట్లు వస్తాయని మాత్రమే అంచనాలుండేదట. అయితే టీడీపీ, జనసేనకు బీజేపీ తోడవ్వటం, కూటమిలో సీట్ల పంచాయితీలు పెరిగిపోతుందటం, అసంతృప్తుల కారణంగా వైసీపీకి 84 సీట్లు గ్యారెంటీ అనే అంచనాలు పెరిగాయట. ఈ ట్రెండ్ మరింతగా పెరిగే అవకాశముందని చెప్పారు. పోయిన ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ గెలుపోటములపై పెద్దగా బెట్టింగులు నడవలేదట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర తర్వాత వైసీపీనే అధికారంలోకి వచ్చేస్తుందని అందరికి తెలిసిపోవటంతో టీడీపీ గెలుపుమీద బెట్టింగులు కట్టేవాళ్ళు తగ్గిపోయారట. గెలుపోటములపై స్పష్టత లేనపుడే బెట్టింగులు జోరందుకుంటాయన్నారు. 2019 ఎన్నికల్లో అనంతపురం జిల్లాలోని రాప్తాడు, తాడిపత్రి నియోజకవర్గాల్లో గెలుపోటములపైన రు. 100 కోట్ల బెట్టింగులు జరిగినట్లు చెప్పారు.

బెట్టింగులంటే మామూలుగా జరగదని కోట్లరూపాయల్లో ఉంటుందన్నారు. తెలంగాణాలో పట్టణప్రాంతాల్లో బీజేపీకి, గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ కు పట్టుందని కొందరు పందేలు కడుతున్నట్లు చెప్పారు. ఇదే సమయంలో పట్టణాలు+గ్రామీణ ప్రాంతాలు రెండింటిలోను కాంగ్రెస్ మెజారిటి సీట్లు సాధిస్తుందని బెట్టింగులు కడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 400 సీట్లు దాటే విషయంలో కూడా పందేలు మొదలయ్యాయి. హోలు మొత్తంమీద ఇది అది అని కాకుండా బెట్టింగుల జోరందుకునే కాలం ముందుందని తెలిసిపోతోంది. బెట్టింగుల ట్రెండింగ్ వల్ల కూడా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే అంచనాలు పెరిగిపోతుంటాయన్నది వాస్తవం.

 

Tags:    

Similar News