పార్టీ మార్పుపై రాజాసింగ్ క్లారిటీ..

కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని, ఆ తర్వాత తానే స్వయంగా తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటిస్తానని వెల్లడించారు.;

Update: 2025-07-11 14:10 GMT

బీజేపీకి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాకు పార్టీ అధిష్టానం శుక్రవారం ఆమోదముద్ర వేసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రాజాసింగ్ దారెటు? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. కొందరు ఆయన కాంగ్రెస్‌లోకి వెళ్తారని, మరికొందరు బీఎస్‌పీలోకి వెళ్తారని అంచనాలు వేస్తుంటే.. ఇకొందరు మాత్రం రాజాసింగ్ ఒంటరిగానే ఉంటారు తప్ప మరే ఇతర పార్టీ కండువా కప్పుకోరని అంటున్నారు. తన భవిష్యత్ కార్యాచరణపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారంపై రాజాసింగ్ స్పందించారు. తన ప్లాన్స్ ఏంటి అనేది క్లారిటీ ఇచ్చారు. ఏ పార్టీలో చేరాలి అన్న అంశంపై తాను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తేల్చి చెప్పారు. తాను బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్‌లో చేరనున్నట్లు కొందరు ప్రచారం చేస్తున్నారని, అలాంటి తప్పుడు వార్తలను నమ్మొద్దని ఆయన హెచ్చరించారు. అదే విధంగా ఇలాంటి తప్పుడు వార్తలను వ్యాప్తి కూడా చేయొద్దని కోరారు. కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని, ఆ తర్వాత తానే స్వయంగా తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటిస్తానని వెల్లడించారు.

అయితే తెలంగాణ బీజేపీలో కొంత కాలంగా తీవ్ర వివాదాలు చెలరేగుతున్నాయి. కొందరు నేతలను ఉద్దేశించి రాజాసింగ్ పలుమార్లు సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్‌రావును నియమించడాన్ని కూడా రాజాసింగ్ తీవ్రంగా నిరసించారు. అందుకు ఫలితంగానే ఆయన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఏ పార్టీలో చేరతారనేది హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News