రాజీవ్ స్వగృహ ఇళ్లకు త్వరలో వేలం
తెలంగాణలో రాజీవ్ సృగ్రహ ఇళ్లకు త్వరలో వేలం వేయాలని రేవంత్ సర్కారు నిర్ణయించింది.గతంలో వైఎస్ హయాంలో నిర్మించిన రాజీవ్ సృగృహ ఇళ్లు, ఫ్లాట్లు నిరుపయోగంగా ఉన్నాయి.
By : The Federal
Update: 2024-09-25 15:14 GMT
రాజీవ్ స్వగృహలో నిర్మించి నిరుపయోగంగా ఉన్న బ్లాక్‌లు, ఇళ్లను వేలం వేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గృహనిర్మాణ శాఖ అధికారులకు సూచించారు. రాజీవ్ స్వగృహ ఇళ్లను ఏళ్ల తరబడి వృథాగా ఉంచడం సరికాదని, వెంటనే వేలానికి రంగం సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తయినా వాటిని ఎందుకు అప్పగించలేదని ముఖ్యమంత్రి అధికారులను ప్రశ్నించారు. అర్హులకు స్వగృహ ఇళ్లను అప్పగించాలని కోరారు. హైదరాబాద్ నగరంలో నిర్మించి నిరుపయోగంగా ఉన్న బ్లాక్‌లలో మౌలిక వసతులు కల్పించి, వాటికి అర్హులైన లబ్ధిదారులకు అప్పగించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
దసరాకు ఇందిరమ్మ కమిటీలు
దసరా పండుగ నాటికి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.గ్రామ,వార్డు,మండల, పట్టణ, నియోజకవర్గ, జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటుకు విధివిధినాలు ఒకట్రెండు రోజుల్లో రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు.
పీఎంఏవై నుంచి గరిష్టంగా ఇళ్లు సాధించాలి
ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుంచి ఇతర రాష్ట్రాలు లక్షల సంఖ్యలో గృహాలు మంజూరు చేయించుకుంటే ఈ విషయంలో తెలంగాణ వెనుకబడి ఉందని, ఈ దఫా కేంద్రం మంజూరు చేసే గృహాల్లో గరిష్ట సంఖ్యలో రాష్ట్రానికి ఇళ్లు సాధించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పీఎంఏవై కింద రాష్ట్రానికి రావల్సిన బకాయిలు రాబట్టాలని సీఎం సూచించారు. కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సమాచారం వెంటనే ఇవ్వాలని, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో డాటాను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని సీఎం కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి వి.శేషాద్రి, ముఖ్యమంత్రి కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధప్రకాష్, తెలంగాణ గృహ నిర్మాణ సంస్థ ఎండీ వి.పి.గౌతమ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.