ర్యాలీలకు పర్మిషన్ లేదు.. వికాస్ రాజ్ స్ట్రిక్ట్ వార్నింగ్
కౌంటింగ్ రోజున మద్యం దుకాణాలు బంద్ ఉంటాయని.. అలాగే ర్యాలీ లకు అనుమతి ఉండదని రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవో వికాస్ రాజ్ స్పష్టం చేశారు.
తెలంగాణలో ఈ నెల 4న ఉదయం 8 గంటలకు లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలవుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవో వికాస్ రాజ్ వెల్లడించారు. మొదట పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపు పూర్తయ్యాక 8.30 గంటలకు ఈవీఎం ల ఓట్ల లెక్కింపు మొదలవుతుందని తెలిపారు. హైదరాబాద్ లో శనివారం బీఆర్‌కే భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కౌంటింగ్ కేంద్రాల వద్ద నాలుగంచెల భద్రత ఉంటుందని పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రం లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకు వెళ్లేందుకు పర్మిషన్ లేదని వికాస్ రాజ్ స్పష్టం చేశారు. అలాగే, కౌంటింగ్ ఏజెంట్లు, సిబ్బందికి సైతం సెల్ ఫోన్స్ అనుమతి ఉండవని తెలిపారు. కౌంటింగ్ కేంద్రం లోని ప్రతి మూలను కవర్ చేసేలా సీసీ కెమెరాల నిఘా ఉంటుందని.. స్ట్రాంగ్ రూం నుంచి లెక్కింపు కేంద్రం వరకు బారికేడ్లు, పటిష్ఠ భద్రత ఉంటుందని వెల్లడించారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు 2.17 లక్షల పోస్టల్ బ్యాలెట్స్ వచ్చాయని చెప్పారు. ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు 276 టేబుల్స్‌ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యధికంగా 24 రౌండ్లలో లెక్కింపు ఉంటుందని.. మరో మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యల్పంగా 13 రౌండ్ల లెక్కింపు ఉంటుందన్నారు. ఓట్ల లెక్కింపులో దాదాపు 10 వేల మంది సిబ్బంది పాల్గొంటారని, సెగ్మెంట్ల వారీగా ఓట్ల లెక్కింపు సిబ్బందిని ర్యాండమ్ గా కేటాయిస్తామన్నారు. లెక్కింపు రోజు ఉదయం 5 గంటలకు మరోసారి ర్యాండమ్‌గా సిబ్బందిని కేటాయిస్తామని చెప్పారు.
2400 పైగా మైక్రో అబ్జర్వర్లు కౌంటింగ్‌లో పాల్గొంటారని చెప్పారు. కౌంటింగ్ రోజున మద్యం దుకాణాలు బంద్ ఉంటాయని.. అలాగే ర్యాలీ లకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ర్యాలీ లకు పోలీసులు అనుమతి ఇస్తే చేసుకోవచ్చునన్నారు. శనివారం సాయంత్రం 6.30 గంటల నుంచి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసుకోవచ్చన్నారు.