సౌమ్యుడిని కాదు..పోరాటయోధుడిని-రామచందర్ రావు

జాతీయ నాయకత్వం సహకారంతో రాష్ట్రంలో పార్టీని మరింత ముందుకు తీసుకెల్తా అంటున్న తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు.;

Update: 2025-07-01 13:51 GMT
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఎన్నిక పత్రాన్ని అందుకుంటున్న రాంచందర్ రావు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్‌ షా, జేపీ నడ్డా వంటి జాతీయ నాయకత్వం సహకారంతో తెలంగాణలో పార్టీని మరింత ముందుకు నడిపిస్తానని తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు రామచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు.రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన పార్టీ సభలో ఆయన తొలిసారిగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు."ప్రజాస్వామ్యబద్ధమైన, వికసిత తెలంగాణ నిర్మాణం బీజేపీతోనే సాధ్యం. అందుకే ప్రజలు మనవైపు ఆశగా చూస్తున్నారు. అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లాలి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ దుందుభి మోగించాలి" అని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే ఏకైక లక్ష్యం
తనను సౌమ్యుడిగా భావించవద్దని, ప్రజా సమస్యలపై పోరాటంలో తాను ఎప్పుడూ ముందే ఉంటానని ఆయన తేల్చి చెప్పారు.పోరాటయోధుడిగా తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే ఏకైక లక్ష్యమని, గోల్కొండ కోటపై కాషాయ జెండాను ఎగరవేస్తామని రామచందర్‌రావు స్పష్టం చేశారు. "విద్యార్థుల హక్కుల కోసం పోరాడి 14 సార్లు జైలుకు వెళ్లాను. పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నాను. ప్రభుత్వంపై నా పోరాటం ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఉంటుంది. తెలంగాణ ప్రజల హక్కుల కోసం ఎంతవరకైనా పోరాడతాను" అని ఆయన స్పష్టం చేశారు.
పార్టీలో కొత్త, పాత అనే తేడాలు లేవు
అతిపెద్ద పార్టీ అయిన బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం గర్వంగా ఉందని రామచందర్‌రావు తెలిపారు. తాను అధ్యక్షుడిగా కాకుండా ఒక సాధారణ కార్యకర్తగానే పనిచేస్తానని చెప్పారు. పార్టీలో కొత్త, పాత అనే తేడాలు లేవని, పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ బీజేపీ కుటుంబ సభ్యులని ఆయన అన్నారు.యువత, మహిళలు పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరి పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చిన రామచందర్ రావు, పార్టీలోకి కొత్త రక్తం రావాలన్నారు. కాంగ్రెస్ పార్టీపై రామచందర్‌రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ఒక ఫేక్ న్యూస్ యూనివర్సిటీని నడుపుతోందని, సోషల్ మీడియాలో బీజేపీ నేతలను లక్ష్యంగా చేసుకుని ట్రోల్ చేస్తున్నారన్నారు.ఆ తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

Full View

Tags:    

Similar News