రంగరాజన్ పై దాడి కేసు |రామరాజ్యం ఏమిటీ? ఎవరీ వీర్ రాఘవరెడ్డి ?

చిలుకూరు బాలాజి అర్చకులు రంగరాజన్ పై దాడి ఘటన సంచలనం రేపింది. ఈ ఘటనతో రామరాజ్యం ఏమిటి ?వీర్ రాఘవరెడ్డి ఎవరనే ప్రశ్నలకు పోలీసుల దర్యాప్తులో జవాబు దొరికింది.;

Update: 2025-02-11 08:13 GMT
వీర్ రాఘవరెడ్డి

చిలుకూరు బాలాజి ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి కేసులో ప్రధాన నిందితుడైన వీర్ రాఘవరెడ్డితోపాటు ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల దర్యాప్తులో రామరాజ్యం సంస్థ, రామరాజ్యం ఆర్మీ, వీర్ రాఘవరెడ్డి బాగోతాలు వెలుగుచూశాయి.

ఈ నెల 8వతేదీన చిలుకూరులో ప్రధాన పూజారి రంజరాజన్ పై రామరాజ్యం ఆర్మీ దాడి చేసింది. ఈ కేసులో రామరాజ్యం ఆర్గనైజేషన్ నిర్వాహకుడు వీర్‌ రాఘవ రెడ్డిని అరెస్ట్ చేసి ప్రశ్నించగా పలు విషయాలు వెలుగుచూశాయని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ చెప్పారు. ఈ కేసులో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారని డీసీపీ తెలిపారు. నిందితులంతా ఖమ్మం, నిజామాబాద్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.

రామరాజ్యం 2022లో ప్రారంభం
2022వ సంవత్సరంలో వీర్ రాఘవ రెడ్డి రామ రాజ్యం పేరిట ఓ సంస్థను ప్రారంభించాడు. దీన్ని స్థాపించిన వీర్ రాఘవరెడ్డి రామరాజ్యం పేరిట ఫేస్‌బుక్, యూట్యూబ్ ఇతర సామాజిక మాద్యమాల్లో పోస్టులు పెడుతూ ప్రచారం చేస్తున్నాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.భగవద్గీత శ్లోకాలతో రామరాజ్యం ఆర్మీలో చేరాలని, హిందూ ధర్మాన్ని కాపాడాలని కోరుతూ సోషల్ మీడియాలో వీర్ రాఘవరెడ్డి పోస్టులు పెట్టాడు.

రామరాజ్యం ఆర్మీలో రిక్రూట్ మెంట్
గత ఏడాది రామరాజ్యం ఆర్మీలో యువత చేరాలని కోరుతూ సెప్టెంబరు 1 నుంచి డిసెంబర్ 31 వరకూ సోషల్ మీడియాలో వీర్ రాఘవరెడ్డి ప్రకటన ఇచ్చారు. ఈ ఆర్మీలో చేరేవారికి 20వేల జీతం ఇస్తానని కూడా ప్రచారం చేశాడు.గోత్రాలను బట్టి ఇక్ష్వాక, భరత వంశీయులను గుర్తు పట్టే బాధ్యతను అర్చకులకు అప్పగించారు. రామరాజ్యాన్ని స్థాపిస్తానంటూ వీర్ రాఘవరెడ్డి తన ఆర్మీతో దాడులు చేయించడం ప్రారంభించాడు.

న్యాయస్థానాలు, పోలీసులకు వ్యతిరేకంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని అరెస్ట్ చేసే అధికారం తమకు ఉందని వీర్ రాఘవరెడ్డి వీడియోల్లో ప్రకటించుకున్నాడు. క్షత్రియులను గుర్తించి తమ ఆర్మీలో చేరేందుకు పంపించాలని వీర్ రాఘవరెడ్డి రంగరాజన్ ను సంప్రదించారు.‘‘తాను రాజ్యాంగం ప్రకారం పనిచేస్తాను, భగవత్ సేవ చేస్తాను’’అని రంగరాజన్ చెప్పారు.దీంతో వీర్ రాఘవరెడ్డి ఆగ్రహంగా రంగరాజన్ ను కింద కూర్చొబెట్టి ఆవేశంగా మాట్లాడుతూ బెదిరించాడు. తాను ఎవరినీ వదిలిపెట్టమని చెప్పారు.

రామరాజ్యం కోసమే ఆర్మీ
రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన వ్యవస్థ నిర్వీర్యం అయింది. దీనికి రామరాజ్యం స్థాపన కోసం ఆర్మీని నియమిస్తాను., మేం ప్రాణాలు ఇవ్వడానికి తీయడానికైనా వెనుకాడం అని ప్రతిన బూనారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శూద్రిడినని వీర్ రాఘవరెడ్డి ప్రకటించారు. నవగ్రహాలు తన ఆధీనంలో ఉన్నాయని దేశ సీఎం, న్యాయమూర్తులను రప్పిస్తానని, వారిని వెంకటేశ్వర పాదాల వద్ద పెడతాను. రామరాజ్యం సైనికుల్లో అమ్మాయిలు కూడా ఉన్నారు. మేం రామరాజ్య సైనికులం అంటూ వీడియోలు తీసి ప్రచారం చేశారు. ఫండ్ రైజింగ్ కూడా చేశాడు.హిందూత్వ పేరు చెప్పి ఏమైనా చేయవచ్చనే వీర్ రాఘవరెడ్డి ఆర్మీతో రెచ్చిపోయాడు. చివరకు దేవాలయాల పరిరక్షణ కోసం పోరాడుతున్న రంగరాజన్ పైనే దాడికి తెగబడి పోలీసులకు దొరికాడు. 

పథకం ప్రకారం ఆర్మీతో కలిసివచ్చి దాడి
పథకం ప్రకారం వీర్ రాఘవరెడ్డి తన ఆర్మీతో కలిసి వచ్చి రంగరాజన్ పై దాడికి పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు. రామరాజ్యం ప్రచారానికి స్పందించి వీర్ రాఘవ రెడ్డిని 25 మంది తణుకులో మొదటి సారి కలిశారని పోలీసులు చెప్పారు.తణకులో నాలుగు రోజులు ఉన్న అనంతరం వీరు కోటప్ప కొండకు వెళ్ళారు. ఒక్కొక్కరికి రూ.2వేలు ఇచ్చి యూనిఫామ్ కుట్టించుకోమని వీర్ రాఘవ్ రెడ్డి చెప్పాడని పోలీసులు తెలిపారు.‘‘యూనిఫామ్ సిద్దమయ్యాక ఈనెల 6వ తేదీన యాప్రాల్ లో అంతరూ కలిశారు.రామరాజ్యం బ్యానర్ తో ఫోటోలు,వీడియోలు తీసుకుని సామాజిక మాద్యమాల్లో పోస్టు చేశారు.ఈ నెల 7న మూడు వాహనాల్లో చిలుకూరు వచ్చి రంగారాజన్ పై దాడికి పాల్పడ్డారు’’అని డీసీపీ శ్రీనివాస్ చెప్పారు.

రామరాజ్యం ఆర్మీ కేసులో కీలక అంశాలు
వీర్ రాఘవరెడ్డి కేసులో పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను పోలీసులు పేర్కొన్నారు. కోసలేంద్ర ట్రస్ట్ పేరుతో రామరాజ్యం ఆర్మీ ఏర్పాటు చేశారని, రామరాజ్యం ఆర్మీ ఏర్పాటు పేరుతో మొదటి స్లాట్ లో 5000 మందిని రిక్రూట్ చేసుకోవాలని ప్లాన్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. రామరాజ్యం ఆర్మీకి 1,20,599 రూపాయల డొనేషన్ వచ్చిందని పోలీసులు చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రామరాజు ఆర్మీకి డొనేషన్లు వచ్చాయి.20 నుంచి 50 సంవత్సరాల లోపు వారిని మాత్రమే రామరాజ్యం ఆర్మీలో మెంబర్లుగా చేర్చుకుంటున్నారు. ప్రతి నెల 20 వేల రూపాయల జీతంతో పాటు వసతి సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు.



 ఆలయ భూములను రక్షించేందుకే అంటూ...

సి ఆర్ పి సి 340 ను న్యాయ వ్యవస్థలోని కొందరు నిర్లక్ష్యం చేశారని రామరాజ్యం ఆర్మీ వాదిస్తోంది. దీని ద్వారా ఆలయాలకు చెందిన లక్షల ఎకరాల భూములు కబ్జాకు గురవుతున్నాయని వారు వాదిస్తున్నారు.న్యాయవ్యవస్థ కేవలం క్రిమినల్స్ కే తప్ప సామాన్యులకు కాదు అంటూ రామరాజ్యం ఆర్మీ వాదన గా ఉంది. అత్యంత బలమైన వ్యూహంలో భాగంగానే సెలెక్ట్ చేసుకొని చిలుకూరి బాలాజీ టెంపుల్ పూజారి పైన దాడి చేశారు.

యువత రిక్రూట్ మెంట్
ఐదు కిలోమీటర్ల నడవగల శక్తి ,రెండు కిలోమీటర్లు పరుగెత్తగల శక్తి ఉన్నవారికి మాత్రమే ఈ ఆర్మీలో చేరేందుకు అర్హత ఉందని ప్రకటించారు.రంగరాజన్ ఇంట్లోకి చొరబడి డబ్బులతో పాటు టెంపుల్ అప్పగించాలంటూ డిమాండ్ చేశారని, రంగరాజన్ ను చిత్ర హింసలు పెట్టి దాడి చేసి పారిపోయారని పోలీసులు చెప్పారు. రామరాజ్యం ఆర్మీ కోసం మనుషుల్ని రిక్రూట్ చేయాలని రంగరాజన్ ను వీర రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. రామరాజ్యం పేరుతో సోషల్ మీడియాలో అకౌంట్లు తెరిచి వీర రాఘవరెడ్డి డబ్బు డిమాండ్ చేస్తున్నాడని పోలీసులు చెప్పారు. 



పలువురు ప్రముఖుల ఖండన

రామరాజ్యం సభ్యులతో కలిసి వెళ్లి రంగరాజన్ పై చేసిన దాడిని సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు తదితరులు ఖండించారు. ఈ దాడిని విశ్వహిందూ పరిషత్ ఖండించింది.ధర్మపరిరక్షణ ముసుగులో ఇలాంటి దాడులు చేయడం తగదంటూ వీహెచ్ పీ చెప్పింది. కేంద్రమంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ నేతకేటీఆర్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఖండించారు. రంగరాజన్ పై దాడి ధర్మపరిరక్షణ మీద జరిగిన దాడి అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

వీసా దేవుడిగా చిలుకూరుకు గుర్తింపు
చిలుకూరు బాలాజీ టెంపుల్ కు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. వీసాల దేవుడుగా పేరొందిన చిలుకూరు దేవాలయంలో 108 సార్లు యువకులు ప్రదక్షిణలు చేస్తుంటారు.ఇలాంటి ఆలయంపై దృష్టిపెట్టిన వీర్ రాఘవరెడ్డి రంగరాజన్ పై దాడికి పాల్పడ్డాడు. రామరాజ్యం ధర్మ సంస్థాపన కోసం 5వేల మంది ఆర్మీతో దుష్ట శిక్షణ,శిష్ట రక్షణ ప్రైవేటు ఆర్మీని నెలకొల్పాడు.

సంఘవ్యతిరేక శక్తులు కాదా
గతంలో ఉత్తర భారతానికి పరిమితమైన రైట్ వింగ్ తీవ్రవాదులు నేడు తెలుగురాష్ట్రాలకు కూడా విస్తరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మతోన్మాద శక్తులు పెచ్చరిల్లుతున్నాయి. ఇటీవలమహిళా అఘోరి ఆయుధాలతో సంచరిస్తోంది. అతివాదులు రామరాజ్యం పేరుతో ప్రైవేట్ ఆర్మీని తయారు చేసుకోవడం రైట్ వింగ్ తీవ్రవాదం కాదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. యువతీ, యువకులు వీరరాఘవరెడ్డి ఆర్మీలో చేరుతున్నారు. రెండేళ్లుగా పనిచేస్తూ దాడులకు తెగబడుతున్నారు. ఈ దాడి ఘటనతో వీరరాఘవరెడ్డి రామరాజ్యం ఆర్మీ బాగోతం వెలుగు చూసింది. నచ్చని వ్యక్తులపై దాడి చేస్తుంటే, హిందూ మత అర్చకులపై దాడులు చేస్తుంటే వీరికే రక్షణ లేకుంటే ఎలా అని హిందూత్వ వాదులు ప్రశ్నిస్తున్నారు. రాముడిని జైశ్రీరాం పేరిట ఆర్ఎస్ఎస్ అరాచకవాదులు అరాచకాలకు పాల్పడుతున్నారు. మత రక్షకుల పేరుతో డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారు.

రంగరాజన్ కు సీఎం ఫోన్
ప్రఖ్యాత చిలుకూరు బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకులు రంగరాజన్ ను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. ఇలాంటి దాడులను సహించేది లేదని, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.రామ రాజ్యం పేరుతో దాడులు చేసే వారిని ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. రామరాజ్యం పేరుతో చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు, నిర్వాహకులు అయిన రంగరాజన్ పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. రాముడి పేరును బద్నామ్ చేస్తూ అరాచక అనాగరిక కార్యక్రమాలకు పాలపడడం దుర్మార్గం వారు చేసే ఆగడాలకు రాముడి పేరును వాడుకుంటూ రామరాజ్యం అని చెప్పడం క్షమించని నేరం అంతే కాదు రాముడి భక్తుల మనోభావాలను దెబ్బ తీసే చర్య అని మంత్రి చెప్పారు. ఇటీవల దాడికి గురైన చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సీఎస్. రంగరాజన్‌ను ఆయన నివాసానికి వెళ్లి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. కేటీఆర్ తోపాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపార్టీ నాయకులు ఉన్నారు.రంగరాజన్ కుటుంబ సభ్యులకు తాము పూర్తిస్థాయిలో అండగా ఉంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు.


Tags:    

Similar News