రాయదుర్గంలో ఎకరా భూమి రూ.177 కోట్లు
భూముల వేలంలో బద్దలయిన రికార్డ్. అత్యధికర ధరకు 7.6 ఎకరాలను సొంతం చేసుకున్న సంస్థ.
తెలంగాణ హౌసింగ్ బోర్డ్.. హైదరాబాద్‌లోని పలు భూములను సోమవారం వేలం వేసింది. ఈ వేలంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో సరికొత్త రికార్డ్ నమోదయింది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీ భూముల వేలం ఊహించని రేంజ్‌కు వెళ్లింది. అక్కడ ఒక్కో ఎకరా రూ.177 కోట్లకు అమ్ముడుపోయింది. ఈ ధరకు మొత్తం 7.6 ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్ సంస్థ ఎంఎస్ఎన్ సొంతం చేసుకుంది. అంటే మొత్తం 7.6 ఎకరాల భూమికి ఆ సంస్థ చెల్లించిన మొత్తం అక్షరాలా.. రూ.1,356 కోట్లు. ఈ భూముల వేలం ప్రారంభం ధర రూ.101 కోట్లుగా ఉంది. దానిని సదరు సంస్థ రూ.177 కోట్లుకు వేలం పాడిందని అధికారులు తెలిపారు.
వేలం ఇలా..
అక్టోబర్ 6 నుంచి 10వ తేదీ మధ్య జీహెచ్ఎంసీతో పాటు శివారు ప్రాంతాల్లోని ప్లాట్లు వేలం వేయనున్నారు. ఇందులో భాగంగానే సోమవారం చింతల్, నిజాంపేట, బాచుపల్లిలోని 22 రెసిడెన్షియల్ ప్లాట్లను వేలం వేసింది. చింతల్‌లోని 18 ఎంఐజీ, హెచ్ఐజీ ప్లాట్లను వేలం వేశారు. అదే విధంగా ఈ నెల 7, 8 తేదీల్లో కేపీహెచ్‌బీలోని 4 కమర్షియల్ ప్లాట్లతో పాటు నాంపల్లిలోని 1,148 గజాల ప్లాట్‌ను వేలం వేయనున్నారు. అక్టోబర్ 9,10 తేదీల్లో చింతల్, రావిర్యాలలోని కమర్షియల్ భూములను వేలం వేయనున్నట్లు తెలంగాణ హౌసింగ్ బోర్డ్ తెలిపింది.
హౌసింగ్ బోర్డ్ వేసిన అంచనా ప్రకారం.. ఈ భూముల వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు ఆదాయం రావొచ్చు. ఈ విధంగా రాష్ట్రానికి అదనపు రాబడి వచ్చినట్లే, పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులు కూడా వేగవంతం అవుతాయి. హౌసింగ్ బోర్డ్ ప్లాట్ల వేలం ద్వారా జనరేటెడ్ రెవెన్యూని వివిధ సివిల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులలో వినియోగించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ వేలం ద్వారా కొత్త హౌసింగ్, రోడ్డులు, పార్క్‌లు, కమ్యూనిటీ సెంటర్ల వంటి అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయన అధికారులు అంటున్నారు.