తెలంగాణలో పోటాపోటీగా ఆరంజ్, పింక్ బుక్ పాలిట్రిక్స్

తెలుగు రాష్ట్రాల్లో రెడ్ బుక్, పింక్ బుక్, ఆరంజ్ బుక్ పాలిట్రిక్స్ నడుస్తున్నాయి. మూడు పార్టీల నేతలు లోకేష్, కవిత, ఈటెల బుక్ పాలిటిక్స్ కు తెర లేపారు.;

Update: 2025-02-19 13:50 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ పాలనలో అధికార దుర్వినియోగం చేసి, అవినీతికి పాల్పడిన నాయకులు, అధికారుల పేర్లను ‘రెడ్ బుక్’ లో రాశానని దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికలకు ముందు టీడీపీ ప్రధాన కార్యదర్శి, సీఎం తనయుడు నారా లోకేష్ ప్రకటించారు. వైసీపీ హయాంలో చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన అధికారుల పేర్లను రాసిపెట్టుకున్నామని, తాము అధికారంలోకి రాగానే వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని గతంలో లోకేష్ రెడ్ బుక్ ('Red Book' politics) చూపిస్తూ చేసిన హెచ్చరికలు సంచలనం రేపాయి. అధికారంలోకి వచ్చాక విశాఖపట్టణంలోని ఆర్టీసీ, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ ల వద్ద రెడ్ బుక్ సిద్ధం అని టీడీపీ నేతలు హోర్డింగులు ఏర్పాటు చేశారు. నారా లోకేష్ ప్రకటించిన రెడ్ బుక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపింది.




 గుడ్ బుక్ రాస్తామని జగన్ ప్రకటన

గతంలో నారా లోకేష్ రెడ్ బుక్ ప్రస్థావన తీసుకురావడంతో అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాము గుడ్ బుక్ రాస్తామని ప్రకటించారు. తమ ప్రభుత్వ హయాంలో బాగా పనిచేసిన వారి పేర్లను గుడ్ బుక్ లో రాసిపెట్టుకుంటామని జగన్ గతంలో పేర్కొన్నారు. రెడ్ బుక్ ఏమైనా పెద్దపనా? నేను కూడా రాస్తున్నా గుడ్ బుక్ అని జగన్ చెప్పారు.మరో వైపు రెడ్ బుక్ ప్రస్థావనపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కూడా స్పందించారు.‘‘నేను బుక్ రాస్తా, అధికారం ఉందని పిచ్చోడిలా బిహేవ్ చేయవద్దు, నా స్పిరిచ్చువల్ పవర్ వాడి నేను బుక్ తీస్తే లోకేష్, చంద్ర బాబు ఉండరు’’అని పాల్ హెచ్చరించారు.


బీఆర్ఎస్ ‘పింక్ బుక్’
నారా లోకేష్ రెడ్ బుక్ ను అనుసరిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, గులాబీ దళపతి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ‘పింక్ బుక్ ’(Pink Book)ను ప్రవేశపెడుతున్నట్లు ఇటీవల ప్రకటించారు. తమ బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందని, దీనిపై పింక్ బుక్ రాసి తాము నాలుగు సంవత్సరాల్లో అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీపై ప్రతీకారం తీర్చుకుంటామని కవిత హెచ్చరించారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు అరాచకాలను తాము పింక్ బుక్ లో రాసి పెడతామని కవిత చెప్పారు.




 బీజేపీ ‘ఆరంజ్ బుక్’

చట్టానికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్న ఐఎఎస్, ఐపీఎస్ అధికారుల పేర్లను తాము ‘ఆరంజ్ బుక్’(Orange Book) లో రాసి పెడతామని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ హెచ్చరించారు. వరంగల్ జిల్లా పర్యటనలో మాట్లాడిన ఈటెల ఈ వ్యాఖ్యలు చేశారు. ఆరంజ్ బుక్ లో పేర్లు రాసి పెట్టుకొని సమయం వచ్చినపుడు వారికి లెక్కలతో సహా బయటపెడతామని ఎంపీ చెప్పారు.చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని, పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగినట్లుగా అధికారులు పనిచేస్తే ఊరుకునేది లేదని ఈటెల స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకి పడుతుందని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణలో బుక్ పాలిటిక్స్ రచ్చ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలైన రెడ్ బుక్ పాలిటిక్స్ (spread to Telangana) తెలంగాణకు వ్యాపించింది.(Telugu States) తెలంగాణలో పింక్ బుక్, ఆరంజ్ బుక్ పాలిటిక్స్ ట్రెండ్ గా మారింది.రేవంత్ రెడ్డి చేస్తున్న అరాచకాలు, కొందరు అధికారుల మీద పింక్ బుక్ రాస్తున్నామని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ప్రకటించారు. తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్నబీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా ఇటీవల పింక్ బుక్ అంటూ వ్యాఖ్యానించారు.

బుక్ పాలిటిక్స్ పేరిట బ్లాక్ మెయిలింగ్ : ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరావు
తెలంగాణలో పింక్, ఆరంజ్ బుక్స్ పేరిట కొందరు నాయకులు బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారని తెలంగాణ విద్యా కమిటీ సభ్యుడు ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరావు వ్యాఖ్యానించారు. బుక్ పాలిటిక్స్ మీద ప్రొఫెసర్ ‘ఫెడరల్ తెలంగాణ’తో మాట్లాడారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్న నాయకులు రాజ్యాంగం ప్రకారం వ్యవహరించాలని సూచించారు. చట్టం తన పని తాను చేసుకుంటుందని, ప్రతీ దానికి న్యాయవ్యవస్థ ఉందని, నిబంధనల ప్రకారమే నడుచుకోవాలని ఆయన కోరారు. రూల్ బుక్, రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించడం తగదన్నారు. ప్రజాప్రతినిధులు పారదర్శకంగా, బాధ్యతాయుతంగా పనిచేయాలని, వారు అధికారులపై బెదిరింపులకు పాల్పడటం చట్టవ్యతిరేకమని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ వ్యవస్థ ప్రకారం సీబీఐ, ఈడీ, ఏసీబీ, సీఐడీ, పోలీసు విభాగాలు, ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు పనిచేస్తుంటారని ఆయన చెప్పారు. బుక్స్ పేరిట బెదిరింపులకు పాల్పడిన వారిపై రాజ్యాంగం ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రొఫెసర్ సూచించారు.


Tags:    

Similar News