ఎంఎల్ఏల విచారణ సందర్భంగా అసెంబ్లీలో ఆంక్షలు
సుప్రింకోర్టు ఆదేశాలతో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Assembly speaker Gaddam Prasad kumar) విచారణ చేస్తున్నారు.
సోమవారం నుండి ఫిరాయింపు ఎంఎల్ఏల విచారణ మొదలవుతున్న కారణంగా అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ ఆంక్షలు విధించారు. ఈరోజు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటలవరకు ఫిరాయింపు ఎంఎల్ఏల(BRS defection MLAs) విచారణ జరగబోతోంది. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్(Telangana Congress) లోకి పదిమంది ఎంఎల్ఏలు ఫిరాయించిన విషయం అందరికీ తెలిసిందే. సుప్రింకోర్టు ఆదేశాలతో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Assembly speaker Gaddam Prasad kumar) విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ఎనిమిది మంది ఎంఎల్ఏలు స్పీకర్ జారీచేసేన నోటీసులకు సమాధానాలుగా అఫిడవిట్ల రూపంలో తమజవాబులు చెప్పారు. ఈరోజు నుండి ప్రత్యక్షంగా ఎంఎల్ఏల విచారణ మొదలవుతోంది.
మొదటివిడతగా రాజేంద్రనగర్ ఎంఎల్ఏ ప్రకాష్ గౌడ్, చేవెళ్ళ ఎంఎల్ఏ కాలే యాదయ్య, పటాన్ చెరు ఎంఎల్ఏ గూడెం మహిపాల్ రెడ్డి, గద్వాల ఎంఎల్ఏ బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని ప్రత్యక్షంగా విచారించబోతున్నారు. మంగళవారం స్టేషన్ ఘన్ పూర్ ఎంఎల్ఏ కడియం శ్రీహరి, బాన్సువాడ ఎంఎల్ఏ పోచారం శ్రీనివాసరెడ్డి, భద్రాచలం ఎంఎల్ఏ తెల్లం వెంకటరావు, జగిత్యాల ఎంఎల్ఏ సంజయ్, ఖైరతాబాద్ ఎంఎల్ఏ దానం నాగేందర్, శేరిలింగంపల్లి ఎంఎల్ఏ అరెకపూడి గాంధీని విచారించే అవకాశముంది. పార్టీ ఫారాయించిన పదిమంది ఎంఎల్ఏలపై తప్పకుండా అనర్హత వేటు పడాల్సిందే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తాము పార్టీఫిరాయించలేదని ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఎల్ఏలు చెబుతున్నారు. ఈనేపధ్యంలోనే ఫిరాయింపు ఎంఎల్ఏలతో పాటు వారి అనర్హతపై కోర్టులో పిటీషన్లు దాఖలుచేసిన బీఆర్ఎస్ ఎంఎల్ఏలు, వాళ్ళ లాయర్లు స్పీకర్ కార్యాలయానికి చేరుకోబోతున్నారు.
ఇరువైపుల ఎంఎల్ఏలు, వాళ్ళలాయర్లు స్పీకర్ ఆఫీసులో విచారణ, క్రాస్ ఎగ్జామినేషన్లో పాల్గొనబోతున్నారు. కోర్టులో వాద,ప్రతివాదనలు ఎలాగ జరుగుతాయో స్పీకర్ కార్యాలయంలో కూడా అచ్చంగా అలాగే జరగబోతోంది. ఈ నేపధ్యంలోనే స్పీకర్ అసెంబ్లీ ప్రాంగణంలో ఆంక్షలు విధించారు. సోమవారం, మంగళవారం పదిమంది ఎంఎల్ఏల విచారణ జరుగుతుంది. విచారణ జరుగుతుంది కాబట్టి అసెంబ్లీలోకి సందర్శకులను అనుమతించేదిలేదని అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు ఉత్తర్వులు జారీచేశారు. మీడియా పాయింట్ దగ్గర, అలాగే శాసనసభా భవనాల ప్రాంగణంలో కూడా మీడియా బ్రీఫింగ్ పేరుతో ఎవరూ మాట్లాడేందుకు లేదని ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. మాజీ ఎంఎల్ఏలు, మాజీ ఎంఎల్సీలు, మాజీ ఎంపీలను కూడా అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతిచేదిలేదని చెప్పారు. ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు మాత్రం అసెంబ్లీ ఆవరణలో ఉన్న తమ శాసనసభాపక్ష కార్యాలయాలకు మాత్రం వెళ్ళచ్చన్నారు. విచారణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్పీకర్ కార్యాలయం ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు అసెంబ్లీ వర్గాలు చెప్పాయి.