రేవంత్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారా ?

గొర్రెల పంపిణీ పథకంలో అవినీతి జరిగింది..బతుకమ్మ చీలర పంపిణీ మొత్తం అవినీతే..కేసీఆర్ కిట్ల కొనుగోలు, పంపిణీ అంతా అవినీతే

Update: 2024-07-27 10:16 GMT
Revanth and Harish Rao

గొర్రెల పంపిణీ పథకంలో అవినీతి జరిగింది..బతుకమ్మ చీలర పంపిణీ మొత్తం అవినీతే..కేసీఆర్ కిట్ల కొనుగోలు, పంపిణీ అంతా అవినీతే... విచారణకు సిద్ధమైతే ప్రభుత్వం వెంటనే విచారణ జరిపిస్తుంది...ఇది అసెంబ్లీ సమావేశంలో బీఆర్ఎస్ ఎంఎల్ఏ హరీష్ రావును ఉద్దేశించి రేవంత్ రెడ్డి హెచ్చరిక. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే అవినీతి జరిగింది వాస్తవం. అయితే అవినీతిపై విచారణ చేయించేందుకు మాత్రం ప్రభుత్వం సిద్ధంగా లేదు. కానీ విచారణకు హరీష్ సిద్ధపడితే ప్రభుత్వం వెంటనే విచారణ జరిపిస్తుందట. వినటానికే విచిత్రంగా లేదూ రేవంత్ హెచ్చరిక.

కేసీయార్ ప్రభుత్వంలో అవినీతి జరిగిందన్నది పక్కా అయితే, అందుకు ఆధారాలుంటే డైరెక్టుగానే విచారణ చేయించచ్చు కదా ? విచారణలో అవినీతికి బాధ్యులెవరు, ఎవరెవరి పాత్ర ఎంతెంత అన్న విషయాలను బయటపెట్టి వాళ్ళందరి మీద సీరియస్ యాక్షనే తీసుకోవచ్చు కదా ? మధ్యలో హరీష్ అంగీకారం ఎందుకు ? విచారణకు సిద్ధమా అని హరీష్ ను ఛాలెంజ్ చేయటం ఎందుకు ? హరీష్ సిద్ధపడకపోతే ప్రభుత్వం జరిగిన అవినీతి మీద విచారణ జరిపించదా ? అక్రమార్కులు బొక్కేసిన ప్రజాధనాన్ని తిరిగి కక్కించదా ? విన్నజనాలు ఇదేమి ప్రభుత్వమని అనుకోరా ? సభలో రేవంత్ హెచ్చరికలు విన్నవారికి హరీష్ ను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లే అనిపిస్తోంది.

అప్పుల విషయంలో హరీష్ రావు చెప్పిన లెక్కలతో విభేదించిన రేవంత్ మాట్లాడుతు ప్రజలు శిక్షించినా బీఆర్ఎస్ ఎంఎల్ఏలకు బుద్ధి రాలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో లక్షల కోట్లరూపాయలు విలువైన ఓఆర్ఆర్ ను రు. 7 వేల కోట్లకే అమ్మేసుకున్నారని ధ్వజమెత్తారు. పదేళ్ళల్లో పాలమూరు జిల్లాలోని ఏ ప్రాజెక్టునూ పూర్తిచేయలేదన్నారు. కేసీఆర్ పాలనలో రంగారెడ్డి జిల్లాలో భూములను అమ్ముకున్నారట. సాగునీరు అందించకుండా ఎడారిగా మార్చేశారట. బతుకమ్మ చీరలని చెప్పి సూరత్ నుండి కిలోల లెక్కన చీరలు తెప్పించి పంపిణీ చేశారట. గొర్రెల పంపిణీలో రు. 700 కోట్ల అవినీతి జరిగిందని చెప్పారు. పసిపిల్లలకు పంపిణీ చేసిన కేసీయార్ కిట్ల కొనుగోలు, పంపిణీలో కూడా అవినీతి జరిగిందని రేవంత్ సభలో చెప్పారు.

రేవంత్ చెప్పినట్లుగా గొర్రెల పంపిణీలో రు. 700 కోట్లు, బతుకమ్మ చీలర పంపిణీలో అవినీతి, కేసీఆర్ కిట్ల పంపిణీలో అవినీతి జరిగుంటే వెంటనే విచారణ చేయించచ్చు కదా. అందుకు హరీష్ అనుమతి ఎందుకు ? విచారణ సిద్ధమని హరీష్ చెప్పాల్సిన అవసరం ఏముంది ? అవినీతి నిజంగానే జరిగినా హరీష్ సిద్ధపడకపోతే రేవంత్ విచారణ జరిపించరా ? ఇదెక్కడ లాజిక్కో అర్ధంకావటంలేదు. అవినీతి జరిగిందట కాని హరీష్ సిద్ధమని చెప్పకపోతే విచారణ జరిపించరట. రేవంత్ ధోరణి ఎలాగుందంటే అవినీతి పేరుతో నోరెత్తకుండా హరీష్ ను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లే ఉంది.

Tags:    

Similar News