రేవంత్ నోట పాత దొరల మాట: మేధావుల ఆందోళన

ముఖ్యమంత్రి రేవంత్ ఫార్మాసిటిని పల్లెలకు తరలిస్తామనడం ప్రమాదకరమని మేధావులు అంటున్నారు. మాజీ సైటిస్టు ఆందోళన ఇది...

Update: 2024-01-03 01:22 GMT

గత  ప్రభుత్వం చేపట్టిన ఫార్మా సిటిని రద్దు చేయడం లేదని ముఖ్యమంత్రి నిన్న స్పష్టం చేశారు. ఆ ఫార్మా సిటి బదులు, వేయి నునంచి 3 వేల ఎకరాల విస్తీర్ణంతో 10 ఫార్మా క్లస్టర్లను ఏర్పాటుచేస్తామని, అవన్నీ కూడా ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో హైవేకు దగ్గరగా ఉంటాయని ఆయన వెల్లడించారు. అయితే, కాలుష్య నివారణ అనుకున్నపుడు ఇది కూడా ప్రమాకరమయిన ప్రతిపాదనే అంటున్నారు విశ్రాంత సైంటిస్టు డా. బాబురావు.



- డాక్టర్ కె.బాబురావు,


కొత్త రాష్ట్ర ప్రభుత్వం భాష మార్చింది గాని బావనలు మార లేదు. పాత దొరలలానే కాలుష్య రహిత, జీరో పొల్యూషన్ ఫార్మా పరిశ్రమలంటున్నది. ప్రపంచంలో ఎక్కడైనా కాలుష్య రహిత ఫార్మా పరిశ్రమ ఉన్నదా? రాష్ట్రంలో ఒక్కరు కూడా ఎందుకు అమలు చేయ లేదు? ఒక ఫార్మా సిటీ బదులు పది ఫార్మా విలేజిలట. సమస్యని విస్తరిస్తున్నది. ఇదంతా చూస్తుంటే సమగ్ర పరిశీలన జరగలేదని స్పష్టం.

నగరంలో పనికి రాని పరిశ్రమలు గ్రామాలలో ఎలా? ఆనాడు పటాన్ చెరు, జీడిమెట్ల, కాజిపల్లి, గడ్డపోతారం, పాశా మైలారం అన్నీ గ్రామాలే కదా? ఇవ్వాళ వాటి దుస్థితి తెలియనిది కాదు.

అన్ని ఫార్మా విలేజిల అవసరం వున్నదా? కోవిడ్ సమయంలో దాదాపు 250 ఫార్మా కంపెనీలకు అనుమతులిచ్చారు రాష్ట్రంలో. అందులో ఎన్ని పరిశ్రమలు నిర్మాణ మై ఉత్పత్తికి వచ్చాయి? గట్టుప్పల్ లో ప్రజలు తిరస్కరించి అడ్డుకున్నారు. తురకల ఖానాపూర్, హత్నూర్ మండల్, ఖాజాపూర్ చిన్న శంకరంపేట్ మండల్, కిష్టాపురం, మునుగోడ్ మండల్ ఇలా ఎన్నో చోట్ల ప్రజలు అడ్డదారిలో అనుమతులిచ్చిన ఫార్మా కంపెనీలపై తిరగబడ్డారు. ఆపారు. అనుమతిచ్చిన వందల పరిశ్రమల సంగతేమిటి? ఎ దశలో వున్నాయి? ముందుగా ప్రభుత్వ సంస్థలు ఆ సమాచారం వెల్లడించాలి.

సెజ్ ల పేరుతో, క్లష్టర్ల పేరుతో పెట్టే పరిశ్రమలకు ప్రజలనుండి నిజమైన కాలుష్యాన్నీ, వాటి ప్రమాద స్థాయినీ దాచిపెట్టి అనుమతులిస్తారు. అక్కడ భోపాల్ ప్రమాదానికి కారణమైన మిథైల్ ఐసో సయనేట్ పరిశ్రమ పెట్టినా ప్రజలకు తెలియ నవసరం లేదు. ప్రాణాంతక పరిశ్రమలు పెట్టినా ప్రశ్నించే అవకాశం వుండదు.

ఫార్మా సిటీకి ఇచ్చిన పర్యావరణ అనుమతి ఫార్మా విలేజిలకు వర్తించదు. అదే ప్రాంతంలో 3 వేల ఎకరాలకు కుదించినా తిరిగి అనుమతి సవరణ పొందాలి. ప్రతి ఫార్మా విలేజికీ పర్యావరణ అనుమతి పొందాలి, ప్రతి చోటా ప్రజలు వ్యతిరేకించడం తధ్యం. అనుమతి పొంది సమస్యలధిగమించడానికి ప్రస్తుత ప్రభుత్వకాలం చాలక పోవచ్చు.

పాలకులు ఫార్మా పరిశ్రమ అనుకూల విధానాలు రూపొందిస్తూ ప్రజలకు కనీస రక్షణ లేకుండా చేస్తూ, బలహీన వర్గాల ప్రజలపై ప్రాణాంతక పరిశ్రమలను రుద్దడం అన్యాయం. ప్రజలకు తెలియ జెప్పడం, చర్చించడం కాలయాపన గా భావించి, సులభ వ్యాపారవిధానం పేరుతొ సత్వర అనుమతులూ, నిబంధనల సరలీకరణ సరి కాదు.

రాష్ట్రంలో ఎలాటి పరిశ్రమలు ప్రోత్సహించాలి, ప్రజలకు అవి ఎంతగా ఉపయోగ పడతాయి, క్షుణ్ణంగా చర్చ జరగాలి.

(- డాక్టర్ కె.బాబురావు, మాజీ సైంటిస్టు,మానవ హక్కుల వేదిక, హైదరాబాద్)

Tags:    

Similar News