చంద్రబాబుతో రేవంత్ పోటీయా ?

అభివృద్ధిలో తెలంగాణాతో ఏపీ పోటీపడాలా ? లేకపోతే ఏపీతో తెలంగాణా పోటీపడాలా ?

Update: 2024-06-22 10:57 GMT

చంద్రబాబునాయుడుతో రేవంత్ రెడ్డి పోటీపడబోతున్నారు. ఎందులో అంటే అభివృద్ధిలో. అవును మీరు సరిగ్గానే చదివారు. అభివృద్ధిలో తెలంగాణాతో ఏపీ పోటీపడాలా ? లేకపోతే ఏపీతో తెలంగాణా పోటీపడాలా ? తెలంగాణా రాజధాని హైదరాబాద్ కు నాలుగు వందల ఏళ్ళ చరిత్రుంది. ఇప్పటి హైదరాబాద్ కు అభివృద్ధిలో భీజం పడింది 1995లో. అంటే అంతకుముందు హైదరాబాద్ లో అభివృద్ధి లేదనికాదు.

1995లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి ఒక్కసారిగా స్పీడందుకుంది. ఐటి పరిశ్రమలు రావటం, నగరంలో ఫ్లైఓవర్ల నిర్మాణంతో డెవలప్మెంట్ జోరందుకుంది. తర్వాత వైఎస్సార్ సీఎం అవటంతో శంషాబాద్ అంర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో ప్రాజెక్టు పనులు, హైదరాబాద్ విస్తరణ తదితరాలతో అభివృద్ధి దూసుకుపోయింది. ఇది అందరికీ తెలిసిన సత్యం. ప్రత్యేక తెలంగాణా ఏర్పడి కేసీయార్ ముఖ్యమంత్రి అయ్యేనాటికి హైదరాబాద్ అన్నీ విధాలుగా డెవలప్ అయిన సిటిగా పాపులరైంది. ముందు ముఖ్యమంత్రుల అభివృద్ధిని కేసీయార్ కూడా కంటిన్యుచేయటంతో మెట్రో ప్రాజెక్టు కల సాకారం కావటం తదితరాలతో అన్నీ విధాలుగా అభివృద్ధిలో దూసుకుపోయింది.

ఇక ఏపీ విషయానికి వస్తే విభజన తర్వాత వైజాగ్ ఒక్కటే అన్నీ విధాలుగా డెవలప్ అయిన కాస్మోపాలిటన్ నగరం. 2014లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు వైజాగ్ నే రాజధానిగా చేసుకునుంటే ఈపాటికి బ్రహ్మాండమైన నగరంగా రూపుదిద్దుకునుండేది. అలాకాకుండా ఏదేదో భ్రమల్లో పడిపోయి ప్రపంచస్ధాయి రాజధానిని నిర్మించాలనే భ్రమలో రాజధాని నిర్మాణం పేరుతో అమరావతిలో శంకుస్ధాపన చేశారు. ఆ తర్వాత ఏమైందో అందరికీ తెలిసిందే. ఇపుడు విషయం ఏమిటంటే అభివృద్ధిలో హైదరాబాద్ తో పోటీపడాలని చంద్రబాబు చెప్పటంలో తప్పులేదు. ఎందుకంటే ఎన్ని అమరావతులు అయితే ఒక్క హైదరాబాద్ అవుతుందని జనాలు చెప్పుకుంటున్నారు కాబట్టి. హైదరాబాద్ స్ధాయికి అమరావతి ఎప్పుడు డెవలప్ అవ్వాలి ? ఇపుడంతా స్పీడుయుగం కాబట్టి తక్కువలో తక్కువ 30 ఏళ్ళు పడుతుంది.

అలాంటిది అభివృద్ధిలో చంద్రబాబుతో తాను పోటీపడాలని రేవంత్ అనటమే విచిత్రంగా ఉంది. రేవంత్ ఏమన్నారంటే ‘పక్క రాష్ట్రం సీఎం చంద్రబాబుతో పోటీపడి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమంలో ముందుకు నడిపించే అవకాశం తనకు వచ్చింద’న్నారు. గతంలో నేను 12 గంగలే పనిచేస్తే చాలని అనుకునేవాడిని. ‘కాని ఇపుడు చంద్రబాబులాగ 18 గంటలు పనిచేస్తు ఆయనతో పోటీపడాలని అధికారులు, సహచరులతో చెప్పాను’ ఈ మాటలను మరి రేవంత్ ఏ మూడ్ లో చెప్పారో తెలీటంలేదు. అభివృద్ధికి చంద్రబాబు ఎప్పుడూ నమూనాకాదు. కాకపోతే చంద్రబాబు అధికారంలో ఉంటే అభివృద్ధి బాగా జరుగుతుందనే ప్రచారం విపరీతంగా(చేయించుకున్నారు) జరిగింది.

ఇపుడు విషయానికి వస్తే హైదరాబాద్ తో పోటీపడాలని చంద్రబాబు చెబితే వినేవాళ్ళకు కూడా బాగుంటుంది. అంతేకాని అసలు అభివృద్ధిలో చంద్రబాబుతో పోటీపడాలని రేవంత్ చెప్పటమే పెద్ద జోక్ గా తయారైంది. చంద్రబాబుతో పోటీపడే అవకాశం వచ్చిందని రేవంత్ అనటంలో గురుభక్తే ఎక్కువగా కనబడుతోంది. 75 ఏళ్ళ వయసులో చంద్రబాబు చేయగలిగే ఏపీ డెవలప్మెంట్ ఏమిటనేది ముందుముందు కాని తెలీదు. ఇదే సమయంలో రేవంత్ ఏమీ చేయకపోయినా పర్వాలేదు చెడకొట్టకుండా ఊరికేకూర్చుంటే చాలు హైదరాబాద్ అభివృద్ధిలో దూసుకుపోతుంది. కాకపోతే అభివృద్ధిలో మైనస్ హైదరాబాద్ మిగిలిన రాష్ట్రం జీరో అనే చెప్పాలి.

Tags:    

Similar News