భారీ వర్షాలకు ఇద్దరు మృతి
రేవంత్ ప్రభుత్వంపై మండిపడ్డ బిజేపీ ఎంపీ రఘునందన్ రావు;
రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ పంపడంలో ఆలస్యం కావడం వల్లే పోచారంలో ఇద్దరు చనిపోయారని బిజెపి మెదక్ ఎంపీ రఘనందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.పోచారంలో నిన్న ఇద్దరు వ్యక్తులు గల్లంతైన సంగతి తెలిసిందే. వారిలో ఒకరి మృతదేహం మాత్రమే లభ్యమైంది.. మరొకరి కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రఘునందన్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
మెదక్‌లోని జీకేఆర్ ఫంక్షన్ హాలులో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రంలో వరద బాధితులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో ముచ్చటించారు.వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన ఆదుకోవాలని రఘునందన్‌రావు డిమాండ్ చేశారు.మెదక్‌జిల్లాలో పునరుద్ధరణ పనుల కోసం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వివేక్ రూ. కోటి వరద సాయం ప్రకటించారని, అయినా సహాయక చర్యలు నత్తనడకన సాగుతున్నాయని రఘునందన్ రావు విమర్శించారు. మెదక్ పట్టణంలోని పిల్లికొట్టాల సబ్‌స్టేషన్ పూర్తిగా నీట మునిగిపోయిందని చెప్పారు. ఆ ఒక్క సబ్ స్టేషన్ పునరుద్ధరించాలంటేనే రూ.3 కోట్లు ఖర్చవుతాయని ఆయన తెలిపారు. రహదారులు కొట్టుకుపోయాయి, అనేక మంది ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారని రఘునందన్ వివరించారు. లోతట్టు ప్రాంతాలన్నీ ఇంకా జలదిగ్బంధంలోనే కూరుకుపోయాయన్నారు. విపత్తు సాయం మరింత పెంచాలని, మృతుల కుటుంబాలకు తక్షణమే రూ.50లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు . ‘‘రామాయంపేట- సిద్దిపేట మధ్య జాతీయ రహదారిలో నందిగామ వద్ద పాత బ్రిడ్జినే జాతీయ రహదారికి అనుసంధానించడం వల్ల అది పూర్తిగా దెబ్బతిని రాకపోకలకు ఆటంకమేర్పడిందన్నారు. పాత బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మించాలి’’ అని రఘునందన్‌రావు డిమాండ్ చేశారు.