‘మోదీ అబద్ధాలు మానుకోవాలి’.. మహారాష్ట్రలో సీఎం రేవంత్ ఫైర్
తెలంగాణ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేయడం ప్రధాని మోదీ మానుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేయడం ప్రధాని మోదీ మానుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారాల వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ.. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని స్థాయిలో ఉండి అసత్య ప్రచారాలు చేయడం హుందాతనం అనిపించుకోదని హితవు పలికారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈరోజు ఉదయం ఆయన మహారాష్ట్రకు వెళ్లారు. అక్కడ నిర్వహించిన ఓ సమావేశంలో రేవంత్ రెడ్డి.. ప్రధాని టార్గెట్‌గా విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజలకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై ప్రధాని మోదీ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని, అవి అమలుకు యోగ్యం కాని హామీలంటున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ అందిస్తున్న సుపరిపాలనను చూసి జీర్ణించుకోలేకే ప్రధాని మోదీ ఇలా ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
నిజాలు చెప్పడానికే వచ్చా
‘‘మహారాష్ట్ర బీజేపీ నేతలు కొద్దిరోజులుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. ప్రధాని మోదీ కూడా తెలంగాణలో కాంగ్రెస్ గ్యారంటీల అమలుపై అబద్దాలు చెప్పడం మొదలుపెట్టారు. మోదీ అబద్ధాలు చెప్పడం మానుకోకపోతే.. మేం నిజాలు చెబుతూనే ఉంటాం. అందుకే నేను మహారాష్ట్ర ప్రజలకు తెలంగాణలో ఆరు గ్యారంటీల అమలుపై నిజాలు చెప్పడానికి ఇక్కడకు వచ్చాను. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే హామీల అమలు ప్రక్రియ మొదలైంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. ఇప్పటి వరకు రూ.18వేల కోట్ల రైతు రుణమాఫీ చేశాం’’ అని చెప్పారు రేవంత్.
కేంద్రం రైతులను మరిచింది
‘‘దేశంలో అత్యధిక రైతు ఆత్మహత్యలు జరుగుతున్న రాష్ట్రం మహారాష్ట్ర. కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని మరిచాయి. నల్లచట్టాలు తెచ్చి అదానీ, అంబానీలకు మేలు చేయాలని మోదీ భావించారు. తెలంగాణలో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం 25 రోజుల్లో 22,22,067 మంది రైతులకు రూ.17,869 కోట్లు మాఫీ చేసాం. ఎవరికైనా వివరాలు కావాలంటే ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ రైతుల విషయంలో మోదీ విమర్శలకు సరైన సమాధానం ఇచ్చాం. ఆ తరువాత ఆయన తన ట్వీట్ ను డిలీట్ చేసుకున్నారు’’ అని తెలిపారు రేవంత్ రెడ్డి.
ఎన్నో హామీలు అమలయ్యాయి..
‘‘తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఏ ఒక్కరికీ అన్యాయం జరగనివ్వం. ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే 50వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. మహాలక్ష్మీ పథకం ద్వారా రూ.500లకే గ్యాస్ అందిస్తున్నాం. ఇప్పటివరకు దాదాపు 50 లక్షల మంది 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ద్వారా లబ్ది పొందుతున్నారు. వరికి రూ.500 మద్దతు ధర అందిస్తున్నాం. 1కోటి 4 లక్షల మంది మహిళలు ఈ పది నెలల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వినియోగించుకున్నారు. ఇందుకోసం రూ.3541 కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం అందించింది’’ అని వెల్లడించారు.
సామాజిక న్యాయం కోసమే కుల గణన
‘‘కుల గణను పంతాలు, పట్టింపుల కోసం మేము నిర్వహించడం లేదు. సామాజిక న్యాయం అందించేందుకు తెలంగాణలో కులగణన చేపట్టాం. 2025 జనగణలో తెలంగాణ కులగణనను పరిగణనలోకి తీసుకోవాలని కేబినెట్ లో తీర్మానం చేసి.. మోదీని డిమాండ్ చేశాం. దేశచరిత్రలో మహారాష్ట్రకు ప్రత్యేక స్థానం ఉంది. దేశ గతిని మార్చిన ఎందరో మహానుభావులకు మహారాష్ట్ర గడ్డ జన్మనిచ్చింది. మహాత్మా జ్యోతిబాపూలే, బాలగాంగధర్ తిలక్, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బాబాసాహెస్ అంబేద్కర్ వంటి ఎందరో మహానుభావులు ప్రజల్లో చైతన్యం నింపి దేశానికి ఒక దారి చూపారు. ఇంతటి ఘనత ఉన్న మహారాష్ట్ర ఎవరి చేతుల్లోకో వెళ్లకూడదు. మహారాష్ట్రకు రావాల్సిన 17 మెగా ప్రాజెక్టులు మోదీ గుజరాత్‌కు తరిలించుకొని పోయారు. మిమ్మల్ని మోసం చేసిన బీజేపీని ఈ ఎన్నికల్లో ఓడించండి’’ అని మహారాష్ట్ర ప్రజలకు రేవంత్ పిలుపునిచ్చారు.