‘అసెంబ్లీకి రా లెక్కలు చెబుతాం’.. కేసీఆర్‌కి రేవంత్ ఛాలెంజ్
అసెంబ్లీ వచ్చి ప్రశ్నించిన రోజున కేసీఆర్ అడిగిన ప్రతి ప్రశ్నకు సమాదానం చెప్తామని, అడిగిన ప్రతి లెక్కను చెప్తామని రేవంత్ అన్నారు.;
తెలంగాణ రాజకీయాలో మరోసారి వేడెక్కాయి. చాలా కాలంగా మౌనంగా ఉన్న కేసీఆర్.. ఈరోజు పెదవివిప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అన్నీ గంభీరంగా గమనిస్తున్నానని అన్నారు కేసీఆర్. కాగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఘాటుగా స్పందిస్తోంది. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించగా తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు. ఫామ్ హౌస్‌లో కూర్చుని మాటలు చెప్పడం కాదని, అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించాలని ఓపెన్ ఛాలెంజ్ చేశారు. అసెంబ్లీ వచ్చి ప్రశ్నించిన రోజున కేసీఆర్ అడిగిన ప్రతి ప్రశ్నకు సమాదానం చెప్తామని, అడిగిన ప్రతి లెక్కను చెప్తామని రేవంత్ అన్నారు.
‘‘అసెంబ్లీ ఎన్నికలను అడ్డు పెట్టుకుని రైతు బంధు ఎగ్గొట్టిన చరిత్ర కెసిఆర్‌ది. ఆయన ఎగ్గొట్టిన రైతు భరోసా నిధులను మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుల ఖాతాలో వేశాం. 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు కేసీఆర్ చేసిన రైతు రుణమాఫీ కేవలం రూ.18వేల కోట్లు మాత్రమే. ఇందులో మిత్తికి పోగా నికరంగా ఆయన చేసిన రుణమాఫీ కేవలం రూ.3 వేల కోట్లు మాత్రమే. కానీ మేం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 21వేల కోట్లు రుణమాఫీ చేశాం. మేం రుణమాఫీ చేయలేదంటున్న కెసిఆర్ ఫాం హౌస్ కు వచ్చినోళ్లకు జోలి చెప్పుడు కాదు. అసెంబ్లీకి రా లెక్కలు చెబుతాం’’ అని ధ్వజమెత్తారు.
‘‘రైతుల జాబితాతో సహా మేం చేసిన రుణమాఫీ లెక్కలు చూపిస్తాం. నీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రా. నీలా ఇచ్చిన హామీలను ఎగ్గొట్టి పంగనామాలు పెట్టిన చరిత్ర నాది కాదు. ఆయన గంభీరంగా చూస్తున్నడట…ఎవరిని చూస్తున్నావ్? అచ్చోసిన ఆబోతుల్లా కొడుకు, అల్లుడిని ఊరిమీదకు వదిలిండు. జహంగీర్ పీర్ దర్గాకు, వేములవాడ రాజన్నకు నిధులు ఇస్తానని మోసం చేసినావ్. పాలమూరును ఎరవేసి ఎండబెట్టిన దుర్మార్గుడు కెసిఆర్. మాప్రభుత్వంలో రైతులకు రుణమాఫీ జరిగింది, రైతు భరోసానూ ఇస్తున్నాం. మార్చి 31 లోగా రూ.10 వేల కోట్లు రైతు భరోసా వేస్తాం. భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబానికి ఏడాదికి రూ.12 వేలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తాం’’ అని తెలిపారు.
‘‘మొదటి ఏడాదిలోనే 55142 ఉద్యోగ నియామకాలు పూర్తి చేసిన ఘనత మా ప్రభుత్వానిది. నీ నాయకత్వంపై నీకు నమ్మకం ఉంటే అసెంబ్లీకిరా. కొడితే బలంగా కొట్టడం సంగతి పక్కకు పెడితే సరిగ్గా నిలబడటం నేర్చుకో. ట్విట్టర్ లో ఈయనకు లైకులు ఎక్కువ వచ్చాయని చెప్పుకుంటుండు. పదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన సోషల్ మీడియాలో లైకులు వచ్చాయని చెప్పుకుంటుండు అంటే ఆయన మానసిక స్థితి ఎట్లుందో అర్థం చేసుకోండి. కెసిఆర్ ముందు నీ కొడుకును, అల్లుడిని దారిలో పెట్టుకో. బీసీ కులగణన, మాదిగ వర్గీకరణపై ఫిబ్రవరి మొదటి వారంలో అసెంబ్లీ పెడుతున్నాం. పొంకనాలు కొట్టుడు కాదు.. దమ్ముంటే అసెంబ్లీకి రా మాట్లాడుకుందాం. ఫాం హౌస్ లో ఉన్న కెసిఆర్ కు ప్రజలతో బంధం తెగిపోయింది. కెసీఆర్ కాలం చెల్లిన వెయ్యి నోటు.. కెసీఆర్ మమ్మల్ని అభినందించడానికి నీకు మనసు రాకపోతే ఫామ్ హౌస్ లోనే పడుకో’’ అంటూ చురకలంటించారు.