ఫెయిలైనోళ్లే ప్రైవేట్ టీచర్లా... తప్పెవరిది?

ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులపై ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.

Update: 2024-08-04 14:26 GMT

ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులపై ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. శుక్రవారం ఎల్‌బీ స్టేడియంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల సమావేశంలో సీఎం మాట్లాడుతూ... ఇంటర్ పాసయ్యి, డిగ్రీ ఫెయిలైనోళ్లు ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్‌ లో టీచర్లుగా ఉన్నారని అన్నారు. ఆయన చేసిన కామెంట్స్ విమర్శలకు దారి తీశాయి. ఆయన వ్యాఖ్యలపై ప్రైవేట్ టీచర్లు భగ్గుమంటున్నారు.

ఇంటర్ పాసైన, డిగ్రీ ఫెయిలైన వాళ్లే ప్రైవేట్ టీచర్లుగా పని చేస్తారా? ఎంపీ, ఎమ్మెల్యే, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ప్రైవేట్ పాఠశాలలోనే చదువుతారు కదా వారికి ఫెయిలైన వాళ్లే చదువు చెప్తున్నారా? సీఎం రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని తెలంగాణ స్కూల్స్ టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.

మరోవైపు సీఎం రేవంత్ వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ సైతం ఖండించింది. ఆయన వ్యాఖ్యలు ప్రైవేట్ టీచర్ల కాన్ఫిడెన్స్ దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపించింది. రేవంత్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేసింది. బీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ... "ప్రైవేటు స్కూళ్లలో పదో తరగతి ఫెయిల్ అయిన వారు ఉపాధ్యాయులుగా ఉన్నారని రేవంత్ రెడ్డి అంటున్నారు. అది ఎవరి తప్పు? విద్యా హక్కు చట్టం కింద శిక్షణ పొందిన ఉపాధ్యాయులే ఉండాలి. చాలా స్కూళ్లల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉన్నారు. 

విద్యా హక్కు చట్టం ప్రకారం, అన్ని పాఠశాలల్లో శిక్షణ పొందిన, అర్హత కలిగిన ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఉండాలని మాజీ ఎంపీ పేర్కొన్నారు. ఏదైనా పాఠశాలలు చట్టాన్ని పాటించకుంటే అది రాష్ట్ర ప్రభుత్వ తప్పిదమేనని అన్నారు. తెలంగాణలోని 50 లక్షల మంది విద్యార్థుల్లో 51 శాతం మంది ప్రైవేట్‌ పాఠశాలల్లో చేరారని, గతేడాది 2 లక్షల మంది ప్రభుత్వం నుంచి ప్రైవేట్ విద్యా సంస్థలకు బదిలీ అయ్యారని ఆయన పేర్కొన్నారు. వారిపై అవమానకరమైన వ్యాఖ్యలు చేయకుండా ఈ ధోరణిపై దృష్టి సారించాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు.

ప్రైవేట్ విద్యాసంస్థల్లో బోధన, బోధనేతర సిబ్బందికి రక్షణ చట్టం తీసుకురావాలని, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయుల గౌరవం, భద్రతకు భరోసా కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని బీఆర్ఎస్ యోచిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రైవేట్ విద్యాసంస్థలకు చెందిన లక్ష మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందితో త్వరలో బిఆర్ ఎస్ భారీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News