SHRC ని ఆశ్రయించిన రియాజ్ కుటుంబం..
పోలీసులు తమను వేధిస్తున్నారంటూ రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు.
రౌడీ షీటర్ రియాజ్ ఇటీవల పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. కాగా తాజాగా రియాజ్ కుటుంబ సభ్యులు రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. తమను పోలీసులు వేధిస్తున్నారని కమిషన్ ఛైర్మన్ జస్టిస్ షామీమ్ అక్తర్‌కు ఫిర్యాదు చేశారు. రియాజ్ ఎన్‌కౌంటర్‌కు దారితీసిన పరిస్థితులు, ఆ తర్వాత నుంచి తమను వేధిస్తున్న తీరుపై రియాజ్ తల్లి, భార్య, పిల్లలు ఫిర్యాదు చేశారు. తమకు కనీసం స్వగ్రామంలోకి కూడా రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని, తీవ్రంగా వేధింపులకు గురి చేస్తున్నారని వారు వివరించారు. రియాజ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదును ఛైర్మన్ స్వీకరించారు. రియాజ్ ఎన్‌కౌంటర్ విషయంలో నివేదిక సమర్పించడానికి పోలీసులకు అందించిన తేదీని తగ్గిస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. నవంబర్ 3లోపు నివేదిక అందించాలని డీజీపీని ఆదేశించారు.
కానిస్టేబుల్ ప్రమోద్‌తో గొడవలు..
రియాజ్‌కు కానిస్టేబుల్ ప్రమోద్‌తో ఆర్థిక లావాదేవాల విషయంలో గొడవలు ఉన్నాయని రియాజ్ కుటుంబీకులు తమ ఫిర్యాదులో వివరించారు. ‘‘ప్రమోద్ ఒక విషయంలో రియాజ్‌ను రూ.3 లక్షలు డిమాండ్ చేశారు. రియాజ్ అప్పటికప్పుడు రూ.30వేల చెల్లించాడు. మిగిలిన డబ్బుల కోసం రియాజ్‌ను ప్రమోద్ తీవ్రంగా వేధించారు’’ అని రియాజ్ భార్య తన ఫిర్యాదులో తెలిపారు.
ఇదిలా ఉంటే కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో రియాజ్ ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. నిజామాబాద్‌లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో పారిపోయే ప్రయత్నం చేసిన రియాజ్.. కానిస్టేబుల్ గన్ లాక్కుని కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో రియాజ్ మరణించాడు. కాగా ఈ కేసును మానవ హక్కుల సంఘం ఇప్పటికే సుమోటోగా స్వీకరించింది. ఎన్‌కౌంటర్‌కు సంబంధించి పూర్తి వివరాలను నివేదిక అందించాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించింది.