‘దోపిడీ కూడా పారదర్శకమే’
కొడంగల్-నారాయణపేట రూ.4000 కోట్ల ఎత్తిపోతలు-ఎక్సెస్ లూ బహిరంగమే..;
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ ఘాటు విమర్శలు చేశారు. రేవంత్ పాలనలో అంతా బహిరంగమే అంటూ చురకలంటించారు. ఈ సర్కార్ పాలనలో దోపిడీ కూడా బహిరంగంగానే జరుగుతుందని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ‘‘ రేవంత్ రెడ్డి..బీజేపీ కి చెందిన ఒక ఆంధ్ర ప్రాంతపు అగ్ర ఎంపీ సీయం రమేష్ కంపెనీకి మీకు అత్యంత ఇష్టమైన ఫ్యూచర్ సిటీ(Four Brothers City అంటున్నరు కొందరు) రోడ్ల కాంట్రాక్టు బహిరంగంగానే వచ్చిందా? ఎవరి చెవులల్ల పూలు పెడ్తున్నరు? మీరు ‘కట్టర్’ కాంగ్రెస్-ఆయనేమో బీజేపీ, మీరేమో పాలమూరు పులి బిడ్డ, ఆయనేమో కడప బట్టమేక పిట్ట. ష్ ష్…మీకు అమిత్ షా చెప్పలేదు, మేము చూడ లేదు. పాపం రాహుల్ గాంధీ జీ!’’ అని విసుర్లు విసిరారు.
‘‘కొడంగల్-నారాయణపేట రూ.4000 కోట్ల ఎత్తిపోతలు-ఎక్సెస్ లూ బహిరంగమే.. వాటిని మెగా కృష్ణారెడ్డికి, రాఘవ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇవ్వడమూ పారదర్శకమే. ‘ఉత్తమ’ నీటిపారుదలలో ₹1500 కోట్ల ముత్యాల బ్రాంచ్ కాలువ ఆంధ్ర ‘రాయల్ వెంకట్ రావు’ చేజిక్కించుకోవడం బహిరంగమే. నల్గొండలో ఆఘమేఘాల మీద ₹400 కోట్ల రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ ఖమ్మం శ్రీధర్ రెడ్డికి అప్పనంగా అప్పగింత పారదర్శకమే.. కోదాడలో రూ.5 కోట్ల రాజీవ్ లిఫ్ట్ లు రాత్రికి రాత్రి ₹ 50 కోట్లు కావడం సాధారణమే-బహిరంగమే, ఉదయ సముద్రం పారదర్శకమే.. అన్నీ కాంట్రాక్టులు కేవలం అగ్రవర్ణాల్లో సంపన్నులకే ఇవ్వాలనుకున్నపుడు, కామారెడ్డి-చేవెళ్ల డిక్లరేషన్లు ఎందుకు చేసిండ్రు?? అంటే తెలంగాణ బహుజనులు ఎప్పుడూ కల్లు-బర్రె-గొర్రె-బియ్యం-రాయి-జైలు-బెయిలు-బేడీ-బీడీ-డప్పు-చెప్పుల చుట్టే తిరగాల్నా? తెలంగాణ బహుజనులు మీ లాగా కాంట్రాక్టులకు అర్హులు కానే కారా?’’ అని ప్రశ్నించారు.