ఏప్రిల్ 11 నుంచి మూడురోజులపాటు సలేశ్వరం జాతర

చెంచు ప్రజల ఆరాధ్య దైవం సలేశ్వరం లింగమయ్య జాతర ఏప్రిల్ 11 నుంచి మూడురోజుల పాటు నిర్వహించనున్నారు.నల్లమల్ల లోయల్లో లింగమయ్య దర్శనార్థం భక్తులు తరలిరానున్నారు.;

Update: 2025-04-07 13:27 GMT
నల్లమల లోయల్లో సలేశ్వరం జాతర

పచ్చని చెట్లు, కొండలు, గుట్టలు, లోతైన లోయలతో కూడిన దట్టమైన నల్లమల అడవులు...పులులతోపాటు వన్యప్రాణులు సంచరిస్తున్న అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో ఏప్రిల్ 11,12,13 తేదీల్లో మూడు రోజులపాటు సలేశ్వరం జాతర జరగనుంది. ఈ జాతరకు నాగర్ కర్నూల్ జిల్లా అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు.

చెంచు ప్రజల ఆరాధ్య దైవం సలేశ్వర లింగమయ్య జాతరను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించి అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జాతరకు వచ్చే ప్రజలకు కావాల్సిన సదుపాయాలు కల్పించనున్నారు.దట్టమైన నల్లమల్ల అటవీ ప్రాంతంలో లోయల్లో కొలువై వున్న లింగమయ్య దర్శనార్థం రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలనుంచి అత్యధిక సంఖ్యలో ప్రజలు తరలిరానున్నారు. జాతర రోజుల్లో వైద్య అధికారులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసి వైద్య సిబ్బంది అందుబాటులో ఉంంచాలని నిర్ణయించారు.

అడవిలో శానిటేషన్ పనులు
జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో జాతరలో ఎప్పటికప్పుడు శానిటేషన్ పనులను నిర్వహించడంతో పాటు ఎక్కడ కూడా అపరిశుభ్రత లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ట్రాఫిక్, బందోబస్తు, ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులు తమ విధులు సక్రమంగా నిర్వహించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ బాదావత్ సతోష్ తెలిపారు.

భక్తులకు మంచినీటి సరఫరా
భక్తులకు తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలని ఆర్ డబ్ల్యూ ఎస్. అధికారుల్ని కలెక్టర్ ఆదేశించారు. సలేశ్వరం జాతరకు జిల్లాతో పాటు ఆయా ప్రాంతాల నుంచి భక్తులు ఎక్కువగా వస్తారని ప్రజలకు సరిపడా రవాణా సౌకర్యం కల్పించాలని ఆర్ టి సి అధికారులను కోరారు. సలేశ్వరం జాతర సమయంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా అగ్నిమాపక సిబ్బందితో పాటు ఫైరింజన్లను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

సలేశ్వరం జాతర నోడల్ అధికారిగా ఆర్డీఓ
జిల్లా అటవీ అధికారులు అడవిలో సరైన రోడ్డు సౌకర్యం కల్పించాలని, మూడు రోజుల పాటు జరుగునున్న జాతరలో సోలార్ లైట్లు ఏర్పాటు చేయాలని డిటిడబ్ల్యూ ఓ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకొని సరైన చర్యలు చేపట్టాలని ఐ టి డి ఎ అధికారులను సూచించారు. అచ్చంపేట ఆర్డీవో సలేశ్వరం జాతర నోడల్ అధికారిగా నియమించారు.



Tags:    

Similar News