నాగర్ కర్నూల్‌లో మల్లు రవి పక్కలో ముల్లు

నాగర్‌ కర్నూల్ లోక్‌సభ సీటుపై ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్.. సోనియా గాంధీకి లేఖ రాశారు. ఈ టికెట్ మల్లు రవికి ఇస్తే ఆయన మరోసారి ఓడిపోవడం తథ్యమని జోస్యం చెప్పారు.

Update: 2024-03-21 03:49 GMT
సంపత్ కుమార్, మల్లు రవి

ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా పేరున్న డాక్టర్ మల్లు రవికి నాగర్ కర్నూల్ లోక్ సభ సీటు ఖరారు చేశారని, ఇక అధికార ప్రకటన వెలువడటమే ఆలస్యమని అనుకుంటున్నపుడు కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా పార్టీ నేత సోనియా గాంధీకి లేఖ రాశారు. ఇది మల్లు రవికి ఇబ్బందికరమయిన విషయమే. ఈ తగువును పార్టీ ఎలా తీరుస్తుందో చూడాలి. మొత్తానికి సంపత్ లేఖ డాక్టర్ మల్లు రవికి మంచి సూచన కాదు. వివరాలు


లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్‌లో నాగర్‌ కర్నూల్ టికెట్ వివాదాస్పదంగా మారింది. ఈ సీటు టికెట్ విషయంలో ఇద్దరు కీలక నేతల మధ్య రేస్ మొదలైంది. టికెట్ తనకే కావాలంటూ ఇద్దరూ పట్టు పడుతున్నారు. వీరిలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ రెబల్స్‌ను బుజ్జగించడంలో భారీ సక్సెస్ అయిన మల్లు రవి ఒకరు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పటేల్ రమేష్ తిరుగుబాటు చేయకుండా అడ్డుకోవడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

ఇలాంటి ట్రబుల్స్ ను పరిష్కరించడంలో వందశాతం సక్సెస్ అయిన మల్లు రవి.. లోక్‌సభ ఎన్నికల్లో నాగర్‌ కర్నూల్ నుంచి పోటీ చేయాలని, ఆ టికెట్ తనకే ఇవ్వాలని ఆశించారు. ఇందుకు పార్టీ కూడా సుముఖత వ్యక్తం చేస్తోంది. కానీ ఈ చర్యను ఏఐసీసీ సెక్రటరీ, పాలమూరు నేత సంపత్ కుమార్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నాగర్‌ కర్నూల్ టికెట్‌ పొందడానికి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తిని తానేనని అంటున్నారు.

అదేనా నా తప్పు
ఈ సమస్యను సంపత్ కుమార్ స్టేట్ లెవెల్‌లో కాకుండా జాతీయ స్థాయిలో లేవనెత్తారు. ఈ అంశంపై పార్టీ మాజీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. ఈ లేఖను తాను బరువెక్కిన మనసుతో రాస్తున్నట్లు తెలిపారు. ‘‘పార్టీకి వీర విధేయుడిగా ఉండటమే నేను చేసిన తప్పా? బలమైన బ్యాక్‌గ్రౌండ్ లేకపోవడమే నా లోపమా? పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు శ్రమించడమే నా చేతకాని తనమా? అన్ని అర్హతలు ఉన్న నాకు కాకుండా నాగర్‌ కర్నూల్ ఎంపీ టికెట్‌ను వరుసగా ఓటమి పాలవుతున్న వ్యక్తికి ఎలా ఇస్తారు’’అని ప్రశ్నించారు సంపత్ కుమార్. తాను మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాడను కాబట్టి టికెట్ ఇస్తే తప్పకుండా నాగర్‌ కర్నూల్ నుంచి గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మల్లు రవి ఓటమి తథ్యం
‘‘నేను మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతను. నాగర్‌ కర్నూల్‌లో 17 లక్షల 30 వేల 781 మంది ఓటర్లు ఉంటే అందులో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 3 లక్షల 75 వేల 532 మంది. మాల సామాజిక వర్గానికి చెందిన వారు 62వేల 801 మంది ఉన్నారు. కావున ఇక్కడి నుంచి పోటీ చేయడానికి నేనే సరైన అభ్యర్థిని. అలా కాకుండా ఇక్కడి నుంచి పోటీ చేస్తూ వరుసగా నాలుగు సార్లు ఓడిన మల్లు రవికే ఈసారీ టికెట్‌ ఇస్తే మళ్ళీ ఆయన ఓటమి పాలవడం ఖాయం’’అని జోస్యం చెప్పారు.
వారిని సంతృప్తి పరచడానికే
ఖమ్మంలోని ఓ మంత్రి తమ్ముడిని సంతృప్తి పరచడానికి, డిప్యూటీ సీఎంకు సొంత సోదరుడు కావడం వల్లే అందరూ ఒక్కటై తన పేరును నిర్లక్ష్యం చేసి మల్లు రవి పేరును సిఫార్సు చేశారని మండిపడ్డారు. తాను మహారాష్ట్ర అభ్యర్థుల ఎంపిక పనుల్లో బిజీగా ఉన్నప్పుడు ఇక్కడి నేతలు ఈ కుట్ర పన్నారని ఆరోపించారు. పార్టీ బలోపేతం కోసం తాను మూడు దశాబ్దాలుగా కష్టపడుతున్నానని ఆయన లేఖలో రాశారు. ‘‘అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే హోదాలో తీవ్ర పోరాటం చేశాను. నన్ను చూసి బెంబేలెత్తిన బీఆర్ఎస్ ప్రభుత్వం నాపై 17 అక్రమ కేసులు బనాయించింది. అయినా వెనకడుగు వేయకుండా పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశాను. ఏఐసీసీ సెక్రటరీ సహా పలు ఇతర పదవుల్లో దేశంలోని అనేక ప్రాంతాల్లో పార్టీ కోసం పనిచేశా. రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్రలో అత్యధిక దూరం నడిచిన తెలంగాణ నేతను నేను. మూడు రిజర్వ్‌డ్ సీట్లలో గెలుపు అవకాశం, కుల ప్రాతిపదికన చూసుకున్నా నాగర్‌ కర్నూల్ టికెట్ నాకే ఇవ్వాలి. ఈ నేతలు తమ కుట్రతో సీఈసీ ముందు నా ప్రాధాన్యతను చంపేశారు’’అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని కోరారు.


Tags:    

Similar News