సీఎం రమేష్ వ్యాఖ్యలపై కేటీఆర్ మౌనం ఎందుకు?

సీఎం రమేష్ ఇంటికి వెళ్ళలేదు, బిజేపితో కుమ్మక్కు కాలేదు అని ఎందుకు క్లారిటీ ఇవ్వడం లేదు..?;

Update: 2025-07-29 13:39 GMT

బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేయడానికి కేటీఆర్ ప్రయత్నాలు చేశారన్న బీజేపీ నేత సీఎం రమేష్ వ్యాఖ్యలు.. తెలంగాణ రాజకీయాల్లో పొగపెట్టాయి. సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు వాస్తవాలేనని కాంగ్రెస్ నేతలు అంటుంటే.. బీఆర్ఎస్ నేతలు వాటిని ఖండించడంలో తనలమున్కలవుతున్నారు. ఈ క్రమంలోనే సీఎం రమేష్ వ్యాఖ్యలను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ‘ఇయర్ ఆఫ్ ది జోక్’గా అభివర్ణించారు. మరోవైపు మంత్రి సీతక్క మాత్రం.. సీఎం రమేష్ వ్యాఖ్యలు వాస్తవాలు కాబట్టే.. ఇప్పటి వరకు కేటీఆర్ వాటిని ఖండించలేదని, కౌంటర్ చేయలేదని అంన్నారు. దీంతో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఏపీ బీజేపీ నేత వ్యాఖ్యలు కీలక చర్చలకు దారి తీస్తున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అనేది బీజేపీలోనే కాదు.. ఏ పార్టీలో విలీనం కాదని కొప్పుల ఈశ్వర్ తేల్చిచెప్పారు.

బీజేపీలో సీఎం రమేష్ పరపతి ఎంత?: కొప్పుల

‘‘బీజేపీలో బీఆర్ఎస్‌ను విలీనం చేయడం కోసం బీజేపీ హైకమాండ్‌ను ఒప్పించడం కోసం కేటీఆర్.. సీఎం రమేష్‌ను కలిశారు. ఇది ఇయర్ ఆఫ్ ది జోక్. అసలు సీఎం రమేష్.. బీజేపీలో ఎప్పుడు చేరారు. ఆ పార్టీలో ఆయనకు ఉన్న పరపతి ఎంత? కంచెగచ్చిబౌలి భూముల విషయంలో సీఎం రమేష్ మధ్యవర్తిగా వ్యవహరించారా? లేదా?’’ అని కొప్పుల ప్రశ్నించారు. ‘‘బీఆర్ఎస్ విధానం స్వలాభం కాదు.. తెలంగాణ ప్రజల అభివృద్ధి, ఈ నేల సంక్షేమం. బీఆర్ఎస్‌ది తెలంగాణ భావజాలం. బీజేపీది ఆర్ఎస్ఎస్ భావజాలం. అధికారంలో ఏ పార్టీ ఉంటే వారితో బ్రోకరిజం చేయడం సీఎం రమేష్‌కు అలవాటు.. అలాంటి వ్యక్తి మాటలను తెలంగాణ ప్రజలు పట్టించుకోకూడద’’ అని ఆయన కోరారు. కేటీఆర్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే సీఎం రమేష్.. బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని కొప్పుల విమర్శించారు.

‘రేవంత్ స్క్రిప్ట్‌నే రమేష్ చదువుతున్నాడు’

‘‘కేటీఆర్ నా ఇంటికి వచ్చి కలిశారని అంటున్న సీఎం రమేష్.. నీ కంపెనీ కోసం, నీ కాంట్రాక్టుల కోసం అధికారంలో వున్నప్పుడు కేటీఆర్ వెంటపడలేదా? రేవంత్ రెడ్డి ఆఫీస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ సీఎం రమేష్ చదువుతున్నారు. టీడీపి నుంచి రాజ్యసభ ఎంపీ అయ్యి ఈడీ, సీబీఐ కేసులకు భయపడి బీజేపీలో చేరిన సీఎం రమేష్ మాటలకు విలువ ఉందా?. సీఎం రమేష్ చరిత్ర రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. ఆంధ్రా ఎంపీ సీఎం రమేష్ అక్కడ ఉన్న కుల పంచాయతీలు తెలంగాణకు తీసుకురావాలని చూస్తున్నారు.‌ ఆయన లాంటి వాళ్ళతో తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి’’ అని హెచ్చరించారు.

సీఎం రమేష్ మాటలపై క్లారిటీ ఇవ్వవే కేటీఆర్: సీతక్క

సీఎం రమేష్ వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతున్న క్రమంలో కేటీఆర్‌కు మంత్రి సీతక్క ఓపెన్ ఛాలెంజ్ చేశారు. అసలు సీఎం రమేష్ మాటలను కేటీఆర్ ఎందుకు ఇప్పటి వరకు ఖండించలేదు? అని ప్రశ్నించారు. వాటిలో వాస్తవాలు ఉన్నందుకే కేటీఆర్ మౌన ముద్రలోకి వెళ్లిపోయారా? అని నిలదీశారు. తాను చెప్పలేకనే పార్టీ నేతలను ముందుకు నెట్టి ఏవేవో మాటలు మాట్లాడిస్తున్నారా? అని అన్నారు. ‘‘సీఎం రమేష్‌ ఇంటికి వెళ్లిన విషయంపై కేటీఆర్‌ ఎందుకు క్లారిటీ ఇవ్వట్లేదు..? సీఎం రమేష్ ఇంటికి వెళ్ళలేదు, బిజేపితో కుమ్మక్కు కాలేదు అని ఎందుకు క్లారిటీ ఇవ్వడం లేదు.. అసెంబ్లీ ఎన్నికల్లో మీ పార్టీకి, మా పార్టీకి ఒక శాతం ఓట్ల తేడా మాత్రమే అని కేటీఆర్ అన్నారు.. మరి లోక్ సభ ఎన్నికల్లో మీరు మీ పార్టీ బీజేపికి ఓట్లు వేయించింది నిజమా..?కాదా..? ఈ ప్రశ్నలకు కేటీఆర్ గుండెపై చేయి వేసుకుని సమాధానం చెప్పాలి.. కేటీఆర్ అబద్ధాలు మాట్లాడుతారనేది ఎంపీ రమేష్ మాటల్లో చూశాం.. ఎన్ని అబద్ధాలు చెప్పినా.. కొద్దీ రోజుల్లో నిజం తెలుస్తుంది’’ అని సీతక్క పేర్కొన్నారు.

అసలు సీఎం రమేష్ ఏమన్నారంటే..!

రాష్ట్రంలోని ఫ్యూచర్ సిటిలో కాంట్రాక్టు రమేష్ కంపెనీకి రేవంత్ ఇచ్చాడని కేటీఆర్ ఆరోపించాడు. దీనిపై స్పందించిన సీఎం రమేష్.. ఘాటు విమర్శలు చేశారు. భారత్ రాష్ట్ర సమితి (బిఆర్ ఎస్ ) ను బిజెపి లో విలీనం చేసేందుకు కెటిఆర్ ప్రతిపాదన చేశారని, దానికి బిజెపి హైకమాండ్ అంగీకరించలేదని చెబుతూ దీనికి తానే సాక్షి అని రమేష్ చెప్పారు. అంతటి ఆగలేదు, దీనికి సంబంధించి సమావేశం తన ఇంటిలోనే జరిగిందని, వాటి సిసిటివి ఫుటేజీలు తన దగ్గిర ఉన్నాయని సిఎం రమేష్ చెప్పారు. బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనమయ్యేందుకు తాను సహకరించలేదని కేటీఆర్ తనపై కక్షపెంచుకుని నిరాధార ఆరోపణలు చేస్తున్నాడు అని రమేష్ మండిపడ్డారు. అక్కడితో ఆగని రమేష్ ఇంకా ఏమన్నారంటే ‘‘సిరిసిల్లో కేవలం 300 ఓట్ల మెజారిటితో నువ్వు ఏ విధంగా గెలిచావో నన్ను చెప్పమంటావా’’ ? అని ప్రశ్నించారు. ‘‘తుమ్మల నాగేశ్వరరావు లాంటి నాయకుడిని పార్టీ ఎందుకు వదిలేసుకుంద’’ని నేను అడిగితే మా పార్టీకి కమ్మ... అవసరంలేదని నువ్వు అనలేదా’’ ? అని నిలదీశారు. ‘‘రేవంత్ గెలిచిన తర్వాత తమ పార్టీలోని రెడ్లు రేవంత్ వెనకాల వెళ్ళిపోయారు కాబట్టి ఏపీలోని జగన్మోహన్ రెడ్డితోనే తమ ప్రయాణమని నాతో నువ్వు చెప్పలేదా’’ ? అని కేటీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. ‘‘పదేళ్ళ బీఆర్ఎస్ హయాంలో కాంట్రాక్టులు ఎవరికి ఇచ్చారో తన దగ్గర లిస్టు ఉంది చెప్పమంటావా’’ ? అని అడిగారు. తాను మీడియాతో చెప్పిందానికి కట్టుబడి ఉంటానని కేటీఆర్ వస్తే మీడియాలోనే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రమేష్ చేసిన సవాల్ చేశారు.

Tags:    

Similar News