షాద్ నగర్ లో ఆమె మీద ఆ ‘డిటెక్టివ్’ దౌర్జన్యం ఏంటి, ఎవరా డిటెక్టివ్ ?

షాద్ నగర్లో దళిత మహిళపై పోలీసుల థర్డ్ డిగ్రీ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

Update: 2024-08-05 17:28 GMT

షాద్ నగర్లో దళిత మహిళపై పోలీసుల థర్డ్ డిగ్రీ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. బంగారం అనుమానం కేసులో అనుమానితులుగా ఉన్న సునీతను మగ పోలీసులు చిత్రహింసలకు గురి చేయడం చర్చనీయాంశం అయింది. ఈ కేసులో పోలీసులపై విమర్శలు వెల్లువెత్తడంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపై వేటు వేశారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ (డీఐ) రామిరెడ్డి తోపాటు మరో ఐదుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు.

అసలేం జరిగింది?

సైబరాబాద్ పరిధిలోని షాద్ నగర్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో నివాసం ఉంటున్న నాగేందర్ అనే వ్యక్తి తన ఇంట్లో చోరీ జరిగిందని పోలీసులను ఆశ్రయించాడు. 22.5 తులాల బంగారం, రూ.2 లక్షల నగదు చోరీ అయ్యాయంటూ జులై 24న షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సునీత, భీమయ్య దంపతులే దొంగతనం చేసి ఉంటారని ఆరోపిస్తూ వారిపై కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో షాద్ నగర్ పోలీసులు సునీత, భీమయ్యతో పాటు వారి 13 ఏళ్ల కొడుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.

ఆ తర్వాత భర్త భీమయ్యను పంపించి, సునీతను ఆమె కొడుకు ముందే దొంగతనం నేరం అంగీకరించాలని తీవ్రంగా కొట్టారు.. దెబ్బలకు తాళలేక సునీత స్రృహ తప్పి పడిపోగా, అప్పుడు ఇంటికి పంపించారు. అది కూడా ఫిర్యాదుదారుడి కారులోనే పంపడం గమనార్హం. తాను చేయని నేరానికి తనను తన కొడుకు ముందే దారుణంగా కొట్టారని.. డిటెక్టివ్ సీఐ రామిరెడ్డి, అతని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని మీడియా వేదికగా తన బాధను వ్యక్తం చేసింది సునీత. స్పందించిన సీపీ అవినాష్ మహంతి లాకప్ హింస కింద రామిరెడ్డిని విచారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

విచారణ అనంతరం సస్పెన్షన్...

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రాంరెడ్డిపై వచ్చిన ఆరోపణలపై సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి స్పందించారు. డీఐ రామిరెడ్డిని సైబరాబాద్ హెడ్‌క్వార్టర్స్‌ కు అటాచ్ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఘటనపై ఏసీపీ రంగస్వామి జరిపారు. విచారణ నివేదికను సీపీకి సమర్పించగా... బాధ్యులైన పోలీసు అధికారులను సీపీ అవినాష్ మహంతి సస్పెండ్ చేశారు.

డీఐ రామిరెడ్డి

సీఎం సీరియస్...

షాద్ నగర్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఓ దళిత మహిళ, ఆమె భర్తపై షాద్ నగర్ పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురి చేసిన ఘటనపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశించారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం దృష్టికి ఈ విషయం వెళ్లడంతో ఆయన పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఘటనకు బాధ్యులైన వారు ఎవరు తప్పించుకోలేరని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బాధితులకు అండగా ఉంటామన్నారు.

బాధితురాలిని పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు..

షాద్ నగర్ ఘటనపై బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తోంది. "దళిత మహిళపై ఇంత దాష్టీకమా? ఇదేనా ఇందిరమ్మ పాలన? ఇదేనా ప్రజాపాలన? దొంగతనం ఒప్పుకోవాలంటూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? మహిళ అని కూడా చూడకుండా ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తారా?" అని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. షాద్ నగర్ సర్కార్ దవాఖానలో చికిత్స పొందుతున్న దళిత మహిళను బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ మందా జగన్నాథం, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

షాద్నగర్ దళితవాడలో నివసించే నాగేందర్ తన ఇంట్లో 22.5 తులాల బంగారం, రూ.2 లక్షల నగదు చోరీ అయ్యాయంటూ జులై 24న పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయన ఎదురింట్లో భీమయ్య, సునీత (35) దంపతులు నివసిస్తున్నారు. కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్న ఈ దంపతులపై అనుమానంతో డీఐ రామిరెడ్డి 26వ తేదీన పోలీస్ స్టేషన్కు పిలిపించారు. తాము చోరీ చేయలేదని వారు చెప్పడంతో ఇంటికి పంపేశారు. 30వ తేదీ రాత్రి 8.30 గంటల సమయంలో పోలీసులు మళ్లీ వచ్చి.. ఠాణాకు తీసుకొచ్చి తీవ్రంగా కొట్టారని బాధిత మహిళ సునీత ఆరోపించారు.

బాధితురాలికి రాష్ట్ర మహిళా కమిషన్ భరోసా..

షాద్‌నగర్ బాధితురాలిని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరేళ్ళ శారద పరామర్శించారు. బాధిత మహిళ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ఆసుపత్రి సిబ్బందిని కోరారు. ఘటనపై వెంటనే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ కు నివేదిక సమర్పించాలని, భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించారు. జరిగిన ఘటన చాలా బాధాకరమని, రాష్ట్ర మహిళా కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటాయని నేరెళ్ల శారద భరోసా ఇచ్చారు.

Tags:    

Similar News