వేసవి ముందు రాజస్థాన్‌తో తెంగాణ కీలక ఒప్పందం..
ప్రాజెక్ట్ వ్యయం, లాభాల్లో 74 శాతం సింగరేణి, 26% రాజస్థాన్ విద్యుత్ ఉత్పాదన్ నిగం లిమిటెడ్‌కు వాటా కలిగి ఉండనున్నాయి.;
వేసవి వస్తున్న క్రమంలో తెలంగాణలో విద్యుత్ డిమాండ్ రోజురోజుకు అధికమవుతోంది. డిమాండ్ పెరుగుతున్న కొద్దీ.. ప్రభుత్వంపై విద్యుత్ భారం కూడా అధికమవుతోంది. ప్రజల అవసరాలకు తగ్గట్టుగా అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది. ఈ క్రమంలోనే డిమాండ్ తగ్గ విద్యుత్ నిల్వలను సంపాదించడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ అంశంలో తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. సింగరేణి వ్యాపార విస్తరణలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అత్యంత కీలకంగా మారనుంది. ఈ క్రమంలోనే రాజస్థాన్ విద్యుత్ శాఖతో సింగరేణి సంస్థ భారీ ఒప్పందం కుదుర్చుకుంది.
రాజస్థాన్ విద్యుత్ శాఖతో 3100 మెగా వాట్ల విద్యుత్ ప్రాజెక్టులపై సింగరేణి చరిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది సింగరేణి సంస్థ. రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్ లాల్ శర్మ, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు సమక్షంలో ఈ మేరకు అవగాహన ఒప్పందం జరిగింది. రాజస్థాన్ విద్యుత్ శాఖ అనుబంధ సంస్థతో కలిసి జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. ఈ కంపెనీతో 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్, రాజస్థాన్‌లో 1500 మెగావాట్ల సోలార్ విద్యుత్తు ఉత్పాదనకు దోహదపడుతుంది. ఇది సింగరేణి ఆర్థిక పరిపుష్టికి అతిపెద్ద అవకాశం. ఈ ప్రాజెక్ట్‌కు మొత్తం వ్యయం, లాభాల్లో 74 శాతం సింగరేణి, 26% రాజస్థాన్ విద్యుత్ ఉత్పాదన్ నిగం లిమిటెడ్‌కు వాటా కలిగి ఉండనున్నాయి. ఈ ఒప్పందంతో తొలిసారిగా ఇతర రాష్ట్రాల్లో అతి పెద్ద సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుతో జాతీయ స్థాయి కంపెనీగా సింగరేణికి గుర్తింపు పొందనుందని తెలంగాణ సర్కార్ భావిస్తోంది.