సీతారామ ప్రాజెక్ట్ లిఫ్ట్ పనులు ఇక వేగవంతం
సీతారామ ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు తెలంగాణ సర్కారు శుభవార్త వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్ లిఫ్ట్ పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
By : The Federal
Update: 2024-11-02 13:50 GMT
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలో సాగు నీరు,తాగు నీటితో పాటు పారిశ్రామిక అవసరాలను తీర్చేందుకు ఉద్దేశించిన సీతారాం లిఫ్ట్ ప్రాజెక్టు ను వేగవంతంగా పూర్తి చేసేందుకు రూట్ మ్యాప్ రూపొందించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.
- ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం అవసరమైన భూసేకరణ కోసం ప్రత్యేక సర్వే టీం లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.సీతారాం లిఫ్టు ప్రాజెక్ట్ నిర్మాణపు పనులపై శనివారం ఎర్రమంజిల్ కాలనీలోని జలసౌదలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు ,నీటిపారుదల శాఖా ముఖ్య కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్,ఇ యన్ సి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఏడాది జులై లోగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు చేపడుతుందన్నారు
3.28 లక్షల కొత్త ఆయకట్టు సాగులోకి...
సీతారామ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇప్పటి వరకు 6,234.91 ఎకరాల భూమిని సేకరించి నట్లు మంత్రి వివరించారు.ఇంకా సేకరించాల్సింది 993 ఎకరాలు ఉందన్నారు.దీని కోసం సత్వరమే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.ప్రాజెక్ట్ పూర్తి అయితే 3.28 లక్షల కొత్త ఆయకట్టు సేద్యంలోకి వస్తుందని మంత్రి చెప్పారు.
చెరువులకు నీరు
సీతారామ ప్రాజెక్టు నుంచి 550 చెరువులకు సమృద్ధిగా నీరు చేరుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.తద్వారా అదనంగా మరో 1.16 లక్షల ఎకరాలు సాగులోకి వస్తుందన్నారు.ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ పై 6,401.95 కోట్లు ఖర్చు పెట్టినట్లు ఆయన తెలిపారు.యుద్దప్రాతి పదికన ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి పేర్కొన్నారు.