ఎర్రిస్వామి చెప్పిందే ఫైనల్, బస్సు ఎందుకు కాలిపోయిందంటే...
శివశంకర్ చావే ఇంతమంది చావుకొచ్చిందన్న పోలీసులు! న
By : The Federal
Update: 2025-10-26 03:36 GMT
కర్నూలు శివారు చిన్న టేకూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు కాలిపోవడానికి కారణం దొరికింది. మద్యం మత్తులో మోటార్ సైక్లిస్ట్ శివశంకర్ బండి నడిపి తనతో పాటు మరో 19 మంది చావుకు కారణమయ్యాడని పోలీసులు తుది అంచనాకి వచ్చారు. శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామి, పెట్రోల్ బంకు వద్ద రికార్డ్ అయిన సీసీ ఫుటేజీ ఆధారంగా కేసును కొలిక్కి తెచ్చామని పోలీసులు చెప్పారు.
బస్సు ప్రమాదం ఘటనలో వాస్తవాలను వివరిస్తూ పోలీసులు అధికారికంగా ఇచ్చిన సమాచారం ప్రకారం... కర్నూలు చిన్న టేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదానికి బైక్ నడుపుతూ చనిపోయిన శివశంకర్ తో పాటు ఉన్న వెనుకాల కూర్చున్న వ్యక్తి ఎర్రి స్వామి ఎలియాస్ నానీ గుర్తించాం. అతన్ని మేము పలు కోణాల్లో విచారించాం. ఎర్రిస్వామి, బైక్ నడుపుతున్న శివశంకర్ ఇద్దరు కలిసి లక్ష్మీపురం గ్రామం నుండి అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2 గంటల కు బయలు దేరారు. ఎర్రిస్వామిని వదలడానికి తుగ్గలికి బయలు దేరాడు. ఎర్రిస్వామిని వదలడానికి వెళ్ళిన పల్సర్ బైక్ మార్గం మధ్యంలో కియా షోరూం దగ్గరున్న HP PETROL BUNK వద్ద అర్ధరాత్రి దాటిన తర్వాత 2.24 గంటలకు రూ. 300 పెట్రోల్ పట్టించుకుని బయలు దేరాడు. బయలు దేరిన కొద్ది సేపటికి చిన్నటేకూరు సమీపంలో శివశంకర్ బైక్ నడుపుతూ స్క్రిడ్ అయి రోడ్డుకు కుడి ప్రక్కన ఉన్న డివైడర్ ను ఢీ కొట్టాడు. బైక్ నడుపుతున్న శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
వెనుకాల ఉన్న ఎర్రిస్వామి చిన్న గాయాలతో బయట పడ్డాడు.
ప్రమాదం జరిగిన ప్రాంతం వద్ద రోడ్డు మధ్యలో నుండి శివశంకర్ ను ఎర్రిస్వామి బయటికి లాగి శ్వాస చూడగా చనిపోయాడని అతను నిర్దార్ధించుకునే లోపే రోడ్డు పై పడి ఉన్న బైక్ ను తీద్దామనుకున్నాడు. అంతలోనే బైక్ ను బస్సు వచ్చి ఢీ కొట్టి కొద్ది దూరం ఈడ్చుకెళ్ళింది.
బస్సు క్రింద మంటలు రావడంతో అక్కడి నుండి ఎర్రిస్వామి భయపడి తన సొంత ఊరైనా తుగ్గలి కి బయలు దేరి వెళ్ళిపోయాడు.
ఈ ప్రమాద విషయం పై ఉలిందకొండ పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.
ప్రమాదానికి కారణం తెలిసినందున ఇక తదుపరి విచారణను కొనసాగిస్తున్నామని జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ అధికారికంగా చెప్పారు.
బస్ డ్రైవర్ ఏం చెప్పాడంటే...
తాగిన మత్తులో ఉన్న శివశంకర్.. జాతీయరహదారిపై బైక్‌తో డివైడర్‌ను ఢీకొట్టి పడిపోయి మరణించాడు. నల్లరంగు పల్సర్ బైక్ అక్కడే పడిపోయింది. దాన్ని ఒక బస్సు ఢీకొట్టింది. తర్వాత వి.కావేరి బస్సు బైక్ మీదుగా వెళ్లడంతో.. అది బస్సు కింద ఇరుక్కుపోయింది. 200 మీటర్లు అలాగే ఈడ్చుకెళ్లడంతో రాపిడికి నిప్పురవ్వలు వచ్చి బస్సు మొత్తం కాలిపోయింది. తొలుత బైకును బస్సు ఢీకొట్టడం వల్లే శివశంకర్ మరణించాడని అందరూ భావించారు. బస్సు రెండో డ్రైవర్ మాత్రం.. రోడ్డుపై పడి ఉన్న బైకునే తాము ఢీకొట్టామని, ఆ సమయంలో వాహనంపై ఎవరూ లేరని పోలీసులకు చెప్పాడు.
జాతీయరహదారిపై పడిన ద్విచక్రవాహనం నల్లరంగులో ఉండటంతో దూరం నుంచి తాను సరిగా గుర్తించలేకపోయినట్లు వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మిరియాల లక్ష్మయ్య పోలీసులకు చెబుతున్నాడు. ఆ సమయంలో వర్షం కూడా కురుస్తుండటంతో హఠాత్తుగా బ్రేక్ వేస్తే ప్రమాదం జరుగుతుందన్న ఉద్దేశంతో ద్విచక్రవాహనం పై నుంచి బస్సును పోనిచ్చినట్లు చెప్పాడు.
ఆ దిశగా దర్యాప్తు చేసిన పోలీసులకు శనివారం ఉదయం కీలక ఆధారాలు లభించాయి. కల్లూరు మండల పరిధిలోని కియా షోరూం ఎదురుగా ఉన్న హెచ్‌పీ బంకులో పెట్రోలు పోయించుకోడానికి శివశంకర్ శుక్రవారం తెల్లవారుజామున 2.24 గంటలకు వెళ్లాడు. ఆ సమయంలో బంకులో ఎవరూ లేకపోవడంతో సిబ్బందిని పిలవడానికి గట్టిగా అరిచాడు. అయినా ఎవరూ రాకపోవడంతో వాహనాన్ని పెట్రోలు పంపు దగ్గర ఉంచి.. నడుచుకుంటూ సిబ్బంది ఉన్న ప్రాంతానికి వెళ్లాడు. శివశంకర్ నడిచిన తీరు చూస్తే ఆ సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నాడని స్పష్టంగా తెలుస్తోంది. బంకులోని మరో పంపు దగ్గరికి బైక్ తీసుకురావాలని సిబ్బంది సూచించడంతో శివశంకర్ తన వాహనాన్ని తెచ్చేందుకు తూలుకుంటూ వెళ్లాడు. వాహనాన్ని స్టార్ట్ చేసి వేగంగా ముందుకు పోనివ్వడంతో అదుపుతప్పి అక్కడే కింద పడబోయాడు. మళ్లీ నియంత్రించుకుని బంకులో రూ.300 పెట్రోలు పోయించుకుని డోన్ వైపు బయలుదేరాడు.
ఎర్రిస్వామి ఎంట్రీ ఇలా...
పెట్రోల్ బంకులోకి బైక్ వచ్చేటప్పుడు దానిపై శివశంకర్‌తో పాటు మరో యువకుడు కూడా ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజీల్లో కనపడింది. దీంతో ఆ యువకుడి గురించి పోలీసులు విచారణ చేయగా అతను తుగ్గలి మండలం రాంపల్లికి చెందిన ఎర్రిస్వామి ఎలియాస్ నాని అని తేలింది. పోలీసులు శనివారం అతన్ని విచారించారు.
ఎర్రిస్వామి హైదరాబాద్‌లో తాపీ పనులు చేస్తుంటాడు. శుక్రవారం ఉదయం మిత్రుడి వివాహం ఉండటంతో కర్నూలుకు వచ్చాడు. శివశంకర్‌తో స్నేహం ఉండటంతో తనను రాంపల్లిలో దించాలని కోరాడు. డోన్‌లో దించుతానని శివశంకర్ చెప్పాడని, దీంతో శుక్రవారం తెల్లవారుజామున లక్ష్మీపురం నుంచి బయలుదేరామని పోలీసులకు వెల్లడించాడు.
శివశంకర్ మృతి ఇలా..
పెట్రోలు పోయించుకున్నాక శివశంకర్ మద్యం మత్తులోనే ఎర్రిస్వామిని ఎక్కించుకుని బయల్దేరాడు. పల్సర్ వాహనం హెడ్‌లైట్ పనిచేయకపోవడంతో బ్లింకర్ వేసుకుని ముందుకెళ్లాడు. ఇష్టారాజ్యంగా వాహనం నడిపి జాతీయరహదారిపై డివైడర్‌ను వేగంగా ఢీకొట్టాడని ఎర్రిస్వామి పోలీసులకు తెలిపాడు. శివశంకర్ తీవ్రగాయాలతో రోడ్డుపై పడిపోగా తాను పక్కకు లాగి చూస్తే అతను చనిపోయినట్లు నిర్ధారణ అయ్యిందని వివరించాడు. ఆ ప్రమాదంలో తానూ పడటంతో స్వల్ప గాయాలయ్యాయని చెప్పాడు.
రోడ్డుకు అడ్డంగా పడున్న వాహనాన్ని పక్కకు లాగుదామని అనుకునేలోపే ఓ బస్సు దాన్ని ఢీకొట్టిందని, తర్వాత వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు వేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి దాన్ని ఈడ్చుకుంటూ వెళ్లిందని, దాంతో మంటలు చెలరేగాయని వివరించాడు. తాను భయంతో అక్కడి నుంచి తుగ్గలి మండలం రాంపల్లికి వెళ్లిపోయినట్లు చెప్పాడని డీఎస్పీ వెంకటరామయ్య తెలిపారు.
మొత్తం మీద వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ఎందుకు తగలబడిందో కొలిక్కివచ్చింది. ఇక తదుపరి దర్యాప్తులో సెల్ ఫోన్లు ఎలా వచ్చాయో, క్యాబిన్ లో చనిపోయిన ఆ ఇద్దరు ఎవరో, డ్రైవర్లు పోలీసులకు చెప్పకుండా ఎందుకు పారిపోయారో తెలుతుంది. బాధిత కుటుంబాలు తమ వాళ్ల శవాల కోసం ఆస్పత్రుల వద్ద ఆర్తనాదాలు చేస్తున్నారు. ఈ కేసులో ఇంతవరకు ఎవర్నీ అరెస్ట్ చేయలేదు. డ్రైవర్ ని మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించి బస్సు బాడీ బిల్డింగ్ ఎందుకు చేయాల్సి వచ్చిందో తేలాల్సి ఉంది. బస్సు యజమాని మాత్రం అంతా సవ్యంగానే ఉందని చెబుతున్నరు.